Telugu Desam Mahanadu : పసుపు పండగకు గోదావరి తీరం ముస్తాబు.. టీడీపీ మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు

author img

By

Published : May 25, 2023, 8:15 AM IST

Updated : May 25, 2023, 8:44 AM IST

టీడీపీ మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు

Telugu Desam Mahanadu : తెలుగుదేశం పసుపు పండగ మహానాడుకు గోదావరి తీరం ముస్తాబవుతోంది. రెండ్రోజులపాటు నిర్వహించే పార్టీ సమావేశాలు, సభలకు ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. 15 వేల మందితో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ఈ మహానాడులోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రాథమిక అంశాలు వెల్లడించాలని చంద్రబాబు నిర్ణయించారు.

Telugu Desam Mahanadu: రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో నిర్వహించే మహానాడు ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ మహానాడులోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. జాతీయ రహదారికి ఇరువైపుల సువిశాల ప్రాంతంలో 27న నిర్వహించే ప్రతినిధుల సభ, 28న మహానాడు బహిరంగ సభలకు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. 15 వేల మందితో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.

టీడీపీ మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు

ఎన్నికల ఏడాది కావడంతో మహానాడులో మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలను వెల్లడించనున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం వివిధ రంగాల్లో నష్టపోయిన పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణకు సంబంధించి... ప్రభుత్వ వైఫల్యం, ప్రశ్నాపత్రాల లీక్, మహిళలపై అఘాయిత్యాలు, పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానాలు రూపొందించారు. మొత్తంగా మహానాడులో ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించి 6, 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. రాజకీయ తీర్మానంలో పొత్తులపై ప్రస్తావన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈసారి మహానాడుకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు.

కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడును నిర్వహించనున్నాం. చరిత్రలో నిలిచిపోయేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ అధ్యక్షుడు మొదలుకుని క్లస్టర్ ఇన్ చార్జి వరకు దాదాపు 15వేల మంది ప్రతినిధులను పిలిచి 15 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాం. జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని తెలిపి, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి దశ, దిశ ఈ మహానాడులో చూపించాలని నిర్ణయించాం. - అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా మహానాడును స్వర్ణోత్సవాలుగా జరుపుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే రాజమండ్రిలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మేరకు ఎన్నికల పాలసీని కూడా నిర్ణయించనున్నారు. - చినరాజప్ప, మాజీమంత్రి

రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది. నాలుగు సంవత్సరాలుగా పరిపాలన నిర్వీర్యమైపోయింది. పాలనను గాడిన పెట్టడంతో పాటు పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తూనే ఈ మహానాడు జరుగుతుంది. అన్న ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా నిర్వహిస్తాం. - గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పార్టీ సీనియర్ నేత

రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకు రావాలన్నదే లక్ష్యం. ప్రతినిధుల సభలో 15 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి నమూనా, సంపద సృష్టిపైనే దృష్టి పెట్టేలా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రూపొందిస్తున్నారు. - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి :

Last Updated :May 25, 2023, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.