Chandrababu in Mahanadu: "వచ్చే సార్వత్రిక ఎన్నిక ఓ కురుక్షేత్ర సంగ్రామం.. కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దాం"

author img

By

Published : May 27, 2023, 1:21 PM IST

Chandrababu in Mahanadu

Chandrababu Speech at TDP Mahanadu: క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్​ అని కొనియాడారు.

"వచ్చే సార్వత్రిక ఎన్నిక ఓ కురుక్షేత్ర సంగ్రామం.. కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దాం"

Chandrababu Speech at TDP Mahanadu: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో పాల్గొన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్​ అని కొనియాడారు.

ఎన్టీఆర్‌ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందన్నారు. రాజమండ్రిని గోదావరి పుష్కర వేళ రాజమహేంద్రవరంగా నామకరణం చేశామన్న చంద్రబాబు.. ఇక్కడే నడయాడిన నన్నయ.. భారత ఆధునీకరణకు నాంది పలికారని పేర్కొన్నారు. కాటన్‌.. బ్రిటీష్‌ వారైనా ఇక్కడి ప్రజలు ఫొటోలు పెట్టి ఆరాధిస్తున్నారని.. నీటి సౌకర్యం ఇచ్చిన కాటన్‌ను ఆరాధించడం గోదావరి జిల్లాల ప్రత్యేకత అని తెలిపారు. తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని.. రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. దేశంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు.

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు: సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లని ఎన్టీఆర్‌ చెప్పారు.. టీడీపీను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకునేది పేదవాళ్లే అని కొనియాడారు. తెలుగుదేశం జెండా.. తెలుగుజాతికి అండ అని చంద్రబాబు పేర్కొన్నారు. సైకిల్‌ ముందు చక్రం సంక్షేమం.. వెనుక చక్రం అభివృద్ధి అని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ సైకిల్‌ వస్తే సైకిల్‌ స్పీడే స్పీడు అని చంద్రబాబు అన్నారు.

కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం: టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులతో జైలులో పెట్టారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని చంద్రబాబు తెలిపారు. టీడీపీ శ్రేణులది ఉక్కు సంకల్పమన్న చంద్రబాబు.. ఏ కష్టం వచ్చినా కుటుంబ పెద్దగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం.. అభివృద్ధి తనకు ప్రధానమన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పనిచేస్తారని.. కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుని రుణం తీర్చుకుంటామని తెలిపారు.

ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువ: వైసీపీ విధ్వంసం సమాజానికే పెను సవాలుగా మారిందని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో జగన్‌ చేసిన అవినీతి రూ.2.27 లక్షల కోట్లని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని మండిపడ్డారు. దేశంలోనే పేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏపీ అని.. అందరు సీఎంల కంటే ధనిక ముఖ్యమంత్రి జగన్‌ అని పేర్కొన్నారు. ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువ విమర్శించారు. స్కాముల్లో మాస్టర్ మైండ్ జగన్ అని ధ్వజమెత్తారు. 3 రాజధానులంటూ అసలు రాజధానే లేని నగరంగా మార్చారని ఆగ్రహించారు. కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలే అని ఆరోపించారు. రూ.2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుకు తెలుగుదేశం కట్టుబడి ఉందని తెలిపారు.

పేదవాడు ధనికుడు కావడమే నా ఆశయం: వచ్చే సార్వత్రిక ఎన్నిక ఓ కురుక్షేత్ర సంగ్రామం అని చంద్రబాబు తెలిపారు. సంగ్రామంలో కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దామని పిలుపునిచ్చారు. రేపు ఎన్నికల తొలి మేనిఫెస్టో ప్రకటిస్తామని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రం పిచ్చొడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డం పడతామన్నారు. పేదల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో టీడీపీకు తెలుసన్నారు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతామన్నారు.

అరాచక పాలన సాగిస్తున్న జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేద్దాం: ప్రజల పక్షాన పోరాటం చేయడమే టీడీపీ ఏకైక ధ్యేయం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇబ్బందులుండేవి కాదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేశారని.. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలులో ఉన్న.. దోపిడీ దొంగకు ఓట్లు వేసి గెలిపించడం చాలా తప్పన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీకి స్వర్ణ యుగం అన్న అచ్చెన్న.. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. జగన్‌ మాయమాటలతో టీడీపీపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.

కోడికత్తితో పొడిపించుకుని డ్రామా ఆడిన వ్యక్తి జగన్‌ అని మండిపడ్డారు. 151 స్థానాలు రావడంతో జగన్‌కు కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. దుర్మార్గ ఆలోచనతో పాలన ప్రారంభించారని.. వైసీపీ తప్ప మరో పార్టీ ఉండకూడదని ఇబ్బందులు పెట్టారన్నారు. సర్వం కోల్పోయినా రాత్రింబవళ్లు టీడీపీ శ్రేణులు పనిచేశారని.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల రుణం తీర్చుకోలేమన్నారు. ఏపీలో 5 కోట్ల మంది ప్రజలు జగన్‌ను ఛీకొడుతున్నారని.. జగన్‌ పేదవాడంట.. చంద్రబాబు ధనికుల పక్షాన ఉన్నారంటున్నారని మండిపడ్డారు.

జగన్‌ వంటి అబద్ధాల కోరును జీవితంలో చూడలేదని విమర్శించారు. దేశంలో 28 మంది సీఎంలు ఎన్నికల అఫిడవిట్‌లో డబ్బు ఎంతుందో చూపారు.. 28 రాష్ట్రాల సీఎంలకు రూ.508 కోట్లు ఉంటే.. జగన్‌కు రూ.510 కోట్లు ఉందన్నారు. 2004లో వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యేసరికి చేతిలో చిల్లగవ్వ లేక ఇల్లు తాకట్టుపెట్టారని గుర్తు చేశారు. జగన్‌ ఇంత డబ్బు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఉత్తరాంధ్రకు రాజధాని ఇస్తానని మోసగించారని.. వలసలు లేని ఉత్తరాంధ్ర కావాలని వ్యతిరేకించామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.