సెల్​ఫోన్​ వినియోగంలో మన పిల్లలే టాప్​!

author img

By

Published : May 15, 2022, 5:07 AM IST

mcafee survey 2022

Mcafee Survey 2022: భారత్‌లో పదిహేనేళ్ల లోపు వయసు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం 83 శాతంగా ఉందని కంప్యూటర్‌ భద్రత సాఫ్ట్‌వేర్‌ సంస్థ 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10-14 ఏళ్ల వయసులోనే సెల్‌ఫోన్‌ వినియోగంలో ప్రపంచ సరాసరి కన్నా 7 శాతం అధికంగా ఉందని తాజా సర్వేలో వెల్లడైంది.

Mcafee Survey 2022: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం భారీగా పెరిగింది. చిన్నారుల చేతుల్లోకి అవి వచ్చేశాయి. టచ్‌స్క్రీన్లపై నేర్పుగా కదులుతున్న చిట్టిచేతులు.. ఆన్‌లైన్‌ ప్రపంచపు ద్వారాలు తెరుస్తున్నాయి. ఈ విషయంలో భారత చిన్నారులు ముందున్నారు. ప్రపంచ సరాసరితో పోలిస్తే వీరు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌ను ఔపోసన పట్టేస్తున్నారు. 10-14 ఏళ్ల ప్రాయంలోనే 'మొబైల్‌ మెచ్యూరిటీ' సాధిస్తున్నారు. ఇదే సమయంలో మన చిన్నారులు ఆన్‌లైన్‌ బెదిరింపులనూ ఎక్కువగానే ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్‌ భద్రత సాఫ్ట్‌వేర్‌ సంస్థ 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగు చూశాయి. 'లైఫ్‌ బిహైండ్‌ ద స్క్రీన్స్‌ ఆఫ్‌ పేరెంట్స్‌, ట్వీన్స్‌ అండ్‌ టీన్స్‌' పేరిట విడుదలైన నివేదికలో కీలకాంశాలున్నాయి.

చిన్నారుల స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై 'మెకాఫే' నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

  • మన దేశ పిల్లల్లో 22 శాతం మంది ఏదో ఒక సమయంలో సైబర్‌ బెదిరింపులను ఎదుర్కొన్నారు. ప్రపంచ సరాసరి (17 శాతం) కన్నా ఇది 5 శాతం అధికం.
  • సామాజిక మాధ్యమాల్లో సైబర్‌ బెదిరింపులు, దుర్భాషలపై భారత తల్లిదండ్రుల్లో ఆందోళన 47 శాతం మేర ఉంది. ఈ విషయంలో ప్రపంచ సరాసరి 57 శాతంగా ఉంది.
  • భారత్‌లో పిల్లలు, యుక్త వయస్కులు స్మార్ట్‌ఫోన్లు, గేమింగ్‌ కన్సోల్స్‌ను తమకు ఇష్టమైన సాధనాలుగా చెబుతున్నారు.
  • భారత్‌లో పదిహేనేళ్ల లోపు వయసు పిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం 83 శాతంగా ఉంది. ఈ విషయంలో ప్రపంచ సరాసరి 76 శాతం మాత్రమే.
  • సామాజిక మాధ్యమాల్లో సైబర్‌ బెదిరింపులు, దుర్భాషలపై భారత తల్లిదండ్రుల్లో ఆందోళన 47 శాతం మేర ఉంది. ఈ విషయంలో ప్రపంచ సరాసరి 57 శాతంగా ఉంది.

10-12 ఏళ్లు, టీనేజీ జీవితాల్లో గోప్యత: ఆన్‌లైన్‌లో సంధానమయ్యే చిన్నారులు, టీనేజీవారు ఏకాంతం, రక్షణ కోరుకుంటున్నారు. బ్రౌజర్‌ చరిత్రను తొలగించడం నుంచి ఆన్‌లైన్‌లో తమ కార్యకలాపాల ఆనవాళ్లను చెరిపేయడం వరకూ ప్రపంచవ్యాప్తంగా 59 శాతం మంది చిన్నారులు తమ ఇంటర్నెట్‌ జీవితాలను గోప్యంగా ఉంచాలనుకుంటున్నారు.

  • వాస్తవ వివరాలు తెలుసుకోకుండానే ఒక వ్యక్తితో ఆన్‌లైన్‌లో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు.. ప్రపంచ సరాసరి కన్నా 11 శాతం అధికంగా ఉన్నారు.

అమ్మాయి విషయంలోనే..: ఆన్‌లైన్‌లో తమ చిన్నారుల భద్రతకు తీసుకునే చర్యల విషయంలో తల్లిదండ్రులు.. కుమారులు, కుమార్తెల మధ్య వైరుధ్యం చూపుతున్నారు. ఫలితంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువ రక్షణ పొందుతున్నారు. నిజానికి అబ్బాయిలకే ఆన్‌లైన్‌లో సమస్యలు తలెత్తుతాయి.

  • ప్రపంచవ్యాప్తంగా 23 శాతం మంది తల్లిదండ్రులు.. 10 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న తమ కుమార్తెల బ్రౌజింగ్‌, ఈమెయిల్‌ చరిత్రను తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారు. అబ్బాయిల విషయంలో అది 16 శాతంగా ఉంది. కొన్ని రకాల వెబ్‌సైట్లు చూడకుండా అమ్మాయిలను కట్టడి చేస్తున్నట్లు 22 శాతం మంది తల్లిదండ్రులు పేర్కొనగా.. అబ్బాయిల విషయంలో అది 16 శాతంగానే ఉంది.
  • భారత్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. మన దేశంలో 44 శాతం మంది బాలికల కంప్యూటర్లలో 'పేరెంటల్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌'లు ఉన్నాయి. 40 శాతం మంది అబ్బాయిల విషయంలోనే ఇలాంటివి ఉన్నాయి.
  • భారత్‌లో 10-14 ఏళ్ల వయసున్న అమ్మాయిల తల్లిదండ్రుల్లో 55 శాతం మంది.. తమ కుమార్తెల కాల్స్‌, టెక్స్ట్‌లను తనిఖీ చేసే అవకాశం ఉంది. కుమారుల విషయంలో ఇలా చేస్తున్న తల్లిదండ్రుల సంఖ్య 52 శాతమే.
  • తల్లిదండ్రుల బాధ్యత..: ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు తామే ఆన్‌లైన్‌ సంరక్షకులమన్న విషయాన్ని గుర్తిస్తున్నారు. 73 శాతం మంది చిన్నారులు.. ఆన్‌లైన్‌ భద్రత విషయంలో అమ్మానాన్నలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే తల్లిదండ్రుల నుంచి ఈ సేవలు సక్రమంగా అందకపోవడవం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
  • తమ స్మార్ట్‌ఫోన్‌ను పాస్‌వర్డ్‌తో రక్షించుకుంటామని 56 శాతం మంది తల్లిదండ్రులు పేర్కొనగా, తమ చిన్నారుల ఫోన్ల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు 42 శాతం మందే చెప్పారు.

అధ్యయనం ఇలా..: భారత్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, మెక్సికో, బ్రిటన్‌, అమెరికాల్లోని 15,500 మంది తల్లిదండ్రులు, 12వేల మంది చిన్నారులను ప్రశ్నించి, ఈ నివేదికను రూపొందించారు.

ఇదీ చదవండి: భార్య భుజాలపై ఎన్నికల విధులకు భర్త.. షాకిచ్చిన అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.