'కిర్పాల్​ను నియమించండి'.. మరోసారి సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం

author img

By

Published : Jan 19, 2023, 10:51 PM IST

supreme-collegium-once-again-recommended-appointement-of-senior-advocate-saurabh-kirpal

స్వలింగ సంపర్కుడైన సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్​ను దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది.

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు పునరుద్ఘటించింది. స్వలింగ సంపర్కుడైన సౌరభ్‌ నియామకానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. 2021 నవంబర్‌ 11వ తేదీనే కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే అది ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం.. తాము చేసిన సిఫార్సు గురించి కేంద్రానికి గుర్తుచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది.

దీని ప్రకారం హైకోర్టు జడ్జిగా కిర్పాల్‌ నియామకం ప్రతిపాదన ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీజేఐ చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్​కే కౌల్‌, కేఎం జోసెఫ్‌లతో కూడిన కొలీజియం విజ్ఞప్తి చేసింది. కిర్పాల్‌ నియామకాన్ని దిల్లీ హైకోర్టు కొలీజియం 2017 అక్టోబర్‌ 13నే ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేసింది. దీనిని 2021 నవంబర్‌ 11న సుప్రీంకోర్టు ఆమోదించి కేంద్రానికి పంపగా.. పునఃపరిశీలన నిమిత్తం ఈ ప్రతిపాదన గతేడాది నవంబర్‌లో తిరిగి వెనక్కి వచ్చినట్లు తెలిపింది.

కిర్పాల్‌కు సమర్థత, సమగ్రత, తెలివితేటలు ఉన్నాయని ఆయన నియామకం దిల్లీ హైకోర్టు బెంచ్​కు విలువను జోడిస్తుందని సుప్రీంకోర్టు కొలీజియం తమ ప్రకటనలో పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఎన్​ కిర్పాల్‌ కుమారుడైన సౌరభ్‌ కిర్పాల్‌ తాను స్వలింగ సంపర్కుడినని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన నియామకంలో జాప్యం నెలకొందని ఆరోపణలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.