ప్రేమించడం లేదని యువతి కిడ్నాప్.. పాతకక్షలతో నడిరోడ్డుపై హత్య

author img

By

Published : Aug 3, 2022, 4:50 PM IST

man kidnaps his lover

తమిళనాడులోని మయిలాడుతురైలో తనను ప్రేమించడం లేదంటూ ఓ యవకుడు.. యువతిని కిడ్నాప్​ చేశాడు. హరియాణా హిసార్​లో జరిగిన మరో ఘటనలో పాతకక్షల కారణంగా యువకుడిని నడిరోడ్డుపైనే కొట్టి చంపారు.

తనను ప్రేమించడం లేదని యువతిని కిడ్నాప్​ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని రక్షించిన పోలీసులు.. ప్రేమికుడు సహా అతడికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని మయిలాడుతురైలో జరిగింది.
తంజావురుకు చెందిన విఘ్నేశ్వరన్​(34) అనే వ్యక్తి.. మయిలాడుతురైకు చెందిన 23 ఏళ్ల యువతి ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విఘ్నేశ్వరన్​ ప్రవర్తన నచ్చకపోవడం వల్ల.. అతడిని దూరం పెట్టింది. దీంతో యువతి వెంటపడిన విఘ్నేశ్వరన్​.. పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడు. విసుగు చెందిన యువతి స్థానిక మయిలాడుతురై పోలీస్ స్టేషన్​లో యువకుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు.. విఘ్నేశ్వరన్​ స్టేషన్​కు పిలిచి కౌన్సిలింగ్​ ఇచ్చారు. మళ్లీ వేధించబోనంటూ అతని వద్ద లేఖ తీసుకున్నారు.

ఆ తర్వాత జులై 12న యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు విఘ్నేశ్వరన్. వారి వద్ద నుంచి తప్పించుకొని వచ్చి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న తన స్నేహితులతో కలిసి యువతి ఇంటికి వచ్చిన విఘ్నేశ్వరన్​.. తలుపులు పగులగొట్టి ఆమెను ఎత్తుకెళ్లాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. విల్లుపురం జిల్లాలోని విక్రాన్​వాడి టోల్​గేట్ వద్ద అతడిని పట్టుకున్నారు. బాధితురాలిని కాపాడారు.

అమ్మాయితో మాట్లాతున్నాడని హత్య: అమ్మాయితో మాట్లాడడం ఆపడం లేదంటూ ఓ యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన దిల్లీలోని ఖాజురి ఖాస్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. బిహార్​ పుర్ణియా జిల్లాకు చెందిన అన్వరుల్ హక్​.. ఓ యువతిని ప్రేమించాడు. కానీ ఆమెను కాదని మూడు నెలల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత కూడా యువతితో సంబంధాన్ని కొనసాగించాలనుకున్నాడు అన్వరుల్​. ఈ క్రమంలోనే యువతికి మరో యువకుడు అబు ఉస్మాన్​తో పరిచయం ఏర్పడింది. దీంతో ఉస్మాన్​, అన్వరుల్​ మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మాట్లాడుకుందామంటూ అన్వరుల్​ను పిలిచాడు ఉస్మాన్​. అప్పటికే తన స్నేహితులతో కలిసి వేచి ఉన్న ఉస్మాన్​..అన్వరుల్​ రాగానే కత్తులతో దాడి చేశాడు. అక్కడ నుంచి తప్పించుకున్న అన్వరుల్​ ఓ మొబైల్​ షాపులో దాక్కున్నాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన అన్వరుల్​ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

పాతకక్షలతో నడిరోడ్డుపై హత్య: నడిరోడ్డుపైనే యువకుడిని దారుణంగా కొట్టిచంపిన ఘటన హరియాణాలోని హిసార్​లో జరిగింది. పాతకక్షల కారణంగా ఏడుగురు దుండగులు కలిసి యువకుడిని రోడ్డుపైనే హత్య చేశారు. మృతుడి భార్య, పిల్లలు ప్రాధేయపడినా.. పట్టించుకోకుండా దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి.

హిసార్​కు చెందిన వికాస్​ అనే వ్యక్తి సుమారు 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తాజాగా ఓ హత్య కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తూ.. పది రోజుల కిందే బెయిల్​పై విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు.. కర్రలు, గొడ్డళ్లతో వికాస్​ ఇంటిపై దాడి చేశారు. వికాస్​ తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. ఇంట్లో నుంచి తప్పించుకున్న వికాస్​ను.. నడిరోడ్డుపై చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. అతడి భార్య, పిల్లలు ప్రాధేయపడినా.. పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టడం వల్ల మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మైనర్​పై సామూహిక అత్యాచారం: ఒడిశా సంబల్​పుర్​లో దారుణం జరిగింది. ఓ మైనర్​పై నలుగురు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఫుడ్​ జంక్షన్​ వద్ద అపస్మారక స్థితిలో ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా.. నలుగురు అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉత్తర్​ప్రదేశ్​ బల్లియాలో నలుగురు వ్యక్తులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. జులై 30న కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన ఆమెపై.. అదే గ్రామానికి చెందిన యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి: 'మంకీపాక్స్ విషయంలో అలా చేయొద్దు'.. ప్రజలకు కేంద్రం కీలక సూచనలు

తల్లి మృతదేహం పక్కనే చిన్నారి నిద్ర.. 5గంటలు అలాగే... ఆకలేస్తోందని విలపిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.