మీరు ఎవరినైనా లవ్​ చేస్తున్నారా?.. ప్రేమ పిశాచులను పసిగట్టండిలా!

author img

By

Published : Nov 19, 2022, 8:47 AM IST

recognize true love with suggestions

ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో సహజీవనం చేస్తూ, అవసరాలన్నీ తీర్చుకుంటూ హత్యకు పాల్పడిన ఘటనలను తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రేమను పెంచుకున్నవాళ్లు.. బాధ్యతలు పంచుకున్నవాళ్లే ఒక్కసారిగా ఎందుకిలా రాక్షసుల్లా మారుతున్నారు? మనసు గెలుచుకున్నవాళ్ల ఈ విపరీత మనస్తత్వాల కారణమేంటి? వీళ్లని గుర్తించేదెలా? ఆ ఊబి నుంచి బయటపడేదెలా?

  • ప్రేమించానన్నాడు.. సహజీవనం చేశాడు.. పెళ్లి చేసుకొమ్మన్న పాపానికి అమ్మాయిని ముక్కలుగా నరికేశాడు.
    - దిల్లీలో ఈమధ్యే జరిగిన ఘోరం
  • ప్రేమ పేరుతో వెంట తిప్పుకుంది.. అవసరాలన్నీ తీర్చుకుంది.. పెళ్లి చేసుకుందాం అన్న అబ్బాయిని మత్తుమందు కలిపి మట్టుబెట్టింది.
    - కేరళ తిరువనంతపురంలో ఘాతుకం ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో!

ప్రేమను పెంచుకున్నవాళ్లు.. బాధ్యతలు పంచుకున్నవాళ్లే ఒక్కసారిగా ఎందుకిలా రాక్షసుల్లా మారుతున్నారు? మనసు గెలుచుకున్నవాళ్ల ఈ విపరీత మనస్తత్వాల కారణమేంటి? వీళ్లని గుర్తించేదెలా?ఆ ఊబి నుంచి బయటపడేదెలా?

గుర్తించండిలా:

  • మాట్లాడటమే ఇష్టం లేదన్నట్టుగా మూడీగా ఉంటారు. చిన్నచిన్న దానికే గొడవ పడుతుంటారు. తప్పులు వెతుకుతుంటారు.
  • ఫొటోలు, వీడియోలు, చాటింగ్‌, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు.. ఇలాంటి ఆనవాళ్లు లేకుండా చూడాలని ప్రయత్నిస్తుంటారు.
  • పెళ్లి పేరెత్తగానే చిరాకు పడిపోతుంటారు. కుటుంబ సభ్యులను కలవడానికి అస్సలు ఇష్టపడరు.
  • ప్రేమలో ఉంటూనే వేరొకరితో ప్రేమాయణం నడిపిస్తుంటారు.
  • శారీరకంగా, ఆర్థికంగా అన్నిరకాలుగా వాడుకోవాలని చూస్తుంటారు.
  • మొదట్లోలాగా అందం, వ్యక్తిత్వం గురించి అస్సలు పొగడరు.
  • సామాజిక మాధ్యమాల్లో అన్‌ఫ్రెండ్‌ చేస్తారు. అనుసరించడం మానేస్తారు. ఫోన్‌కి కొత్తగా పాస్‌వర్డ్‌ పెట్టుకుంటారు.

జాగ్రత్త పడండిలా

  • ప్రేమలో ఉన్నా.. సహజీవనం చేస్తున్నా.. ప్రతిదానికీ పరిమితులు ఉండాలి. దీని గమ్యం పెళ్లా? విడిపోవడమా? స్పష్టత ఉండాలి.
  • ఎవరిని ఎంత గాఢంగా ప్రేమించినా హద్దులు దాటొద్దు. శారీరకంగా లొంగిపోవద్దు.
  • మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వనివాళ్లు, వ్యక్తిగత పరిధుల్లోకి చొచ్చుకొని వచ్చేవాళ్లకి బ్రేకప్‌ చెప్పడమే మేలు.
  • లవర్‌లో మీకు నచ్చని అలవాట్లు, పద్ధతులు ఉంటే ఉపేక్షించాల్సిన పని లేదు.
  • ఇద్దరిమధ్య గొడవ జరిగితే రహస్యంగా ఉంచకుండా.. అర్థం చేసుకోగలిగే వాళ్లతో పంచుకోవాలి. వారి సలహా తీసుకోవాలి.

ప్రేమ.. సహజీవనం తప్పా? ఒప్పా? అంటే ఒక్కొక్కరిది ఒక్కోరకమైన అభిప్రాయం. తప్పొప్పుల సంగతి పక్కనపెడితే ఇందులో నిండా మునిగివాళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకూడదన్నదే ఇక్కడ ప్రధానం. నిజమైన ప్రేమ ఎవరినైనా ఎదిరిస్తుంది. పెళ్లితో ఒక్కటైనా, కాకపోయినా కలకాలం తోడు నిలుస్తుంది. కల్మషం లేని ప్రేమలో లాభనష్టాల బేరీజు ఉండదు. కలుషితమైన, కపట ప్రేమే అపాయకరం. స్వచ్ఛమైన ప్రేమకి కులం.. మతం.. ప్రాంతంతో పనే లేదు. కానీ ప్రేమ పేరుతో ముందే పథకం వేసుకొని ముగ్గులోకి దింపేవాళ్లూ ఉంటారు. అవసరాలు తీర్చుకొని అంతం చేసే అవకాశవాదులు కాచుకొని కూర్చుకుంటారు.

తీయని మాటలతో వలలో వేసుకొని ఆపై అసలు రంగు చూపిస్తారు. వాళ్లు అబ్బాయిలైనా కావచ్చు. అమ్మాయిలైనా అయ్యుండొచ్చు. ఆ ప్రేమ ముసుగు వేసుకున్న మేకవన్నె పులుల జాడ పసిగట్టాలి. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలతోనూ అనుకోని ప్రమాదం ముంచుకురావచ్చు. అమ్మాయి లేదా అబ్బాయిలో ఒక్కరిదే నిజమైన ప్రేమ అయినప్పుడూ చిక్కులొస్తాయి. మనసు, తనువు అన్నీ అర్పించుకున్నాక.. జీవితాంతం తనతోనే కలిసి ఉండాలనుకుంటారు ఒకరు. సహజంగానే ఇంకొకరికి ఇది నచ్చదు. బ్రేకప్‌’ అంటారు. కుదరకపోతే వదిలించుకోవాలనుకుంటారు. ఆఖరి ప్రయత్నంగా వాళ్లను అంతమొందించాలనుకుంటారు. కోపంలో జరిగే అనర్థాలు కొన్నైతే.. కావాలని ఉసురు తీసే కుటిల యత్నాలు ఇంకొన్ని. దేనికైనా తెగించే ఆ ప్రేమ పిశాచుల నుంచి తమను తాము కాపాడుకోవడమే తెలియాలి.

అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఇష్టమున్నప్పుడే ప్రేమ, సహజీవనం సాధ్యమవుతుంది. ఈ అనుబంధంలో ఇద్దరిదీ ఒకేరకమైన అభిప్రాయమైతే ఏ ఇబ్బందీ ఉండదు. ఇంట్లో పెళ్లి ఒత్తిడి, ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినప్పుడే తగాదాలు మొదలవుతాయి. వదిలించుకునే క్రమంలో హత్యల దాకా వెళ్తారు. ఈ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే.. ప్రేమ, సహజీవనం కొత్తలో ఉన్నప్పుడే ప్రేమికుడు/ప్రేమికురాలితో ఎంతవరకు ముందుకెళ్లాలి? ఎంతవరకు వెళ్లకూడదు? అని తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటామా? చేసుకోమా? ముందే తెలిసి ఉండాలి. అది చెప్పగలగాలి. టీలో పంచదార, తేయాకు, పాలతోపాటు మహా అయితే అల్లం వేయాలి.

అంతేగానీ ఉప్పు, కారం వేస్తే ఎలా ఉంటుంది? అలాగే ప్రతి అనుబంధంలో ఏవి ఉండాలో, ఏవి ఉండకూడదో ముందే తెలిసి ఉండాలి. ప్రవర్తన, నడవడిక, అలవాట్లు, పద్ధతుల ద్వారా ప్రేమికుడు/ప్రేమికురాలు రాక్షసుల్లా మారుతున్న విషయం ముందే పసిగట్టవచ్చు. అతిగా కోపానికి రావడం, తిట్టడం, ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ప్రవర్తించడం, విపరీతంగా ఖర్చు పెట్టడం, దురలవాట్లు.. ఇవేమైనా కనిపిస్తే ఏదో తేడా ఉందని అర్థం చేసుకోగలగాలి. అతడు/ఆమె టాక్సిక్‌ అని తెలిసిన వెంటనే ఆ బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సాధారణంగా యుక్తవయసులోకి వచ్చిన ఒక అమ్మాయి లేదా అబ్బాయికి ఎమోషనల్‌ సపోర్ట్‌ లేనప్పుడు బయటి వ్యక్తుల నుంచి ఆశిస్తారు. వాళ్లకి దగ్గరవుతారు. ఆపై ఇలాంటి దారుణాలు జరుగుతుంటాయి. తల్లిదండ్రులు పిల్లలకు విలువలతో కూడిన పెంపకం ఇచ్చినప్పుడు ఇలాంటివి కొంతవరకు అరికట్టవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.