'పైలట్ విశ్వాస ఘాతకుడు.. ఎప్పటికీ సీఎం కాలేరు'.. రాజస్థాన్‌ సీఎం సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Nov 25, 2022, 7:57 AM IST

Updated : Nov 25, 2022, 9:14 AM IST

rajasthan political crisis

Ashok Gehlot On Sachin Pilot : రాజస్థాన్​లోని కాంగ్రెస్​ పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​.. ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్​పై విమర్శలు గుప్పించారు. సచిన్‌ పైలట్‌ను విశ్వాస ఘాతకుడిగా విమర్శించారు. 2020లో సొంత ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు సచిన్ పైలట్​ ప్రయత్నించారని మండిపడ్డారు.

Ashok Gehlot On Sachin Pilot : రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ పార్టీలో అశోక్‌ గహ్లోత్‌-సచిన్‌ పైలట్‌ల పేచీ మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌పై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్‌ పైలట్‌ను విశ్వాస ఘాతకుడిగా అభివర్ణించిన గహ్లోత్‌.. అలాంటి వ్యక్తితో సీఎం స్థానాన్ని భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సొంత ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు ప్రయత్నించారంటూ తాజాగా మండిపడ్డారు. పైలట్‌ తిరుగుబావుటా ఎగురవేయడంలో కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత అమిత్‌ షా ప్రమేయం కూడా ఉందని గహ్లోత్‌ ఆరోపించారు. పైలట్‌కు విధేయులైన కొందరు ఎమ్మెల్యేలు నెలరోజులకు పైగా గురుగ్రామ్‌లోని రిసార్ట్‌లో ఉన్నారని, వారిని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తరచూ సందర్శిస్తుండేవారన్నారు. పైలట్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.10కోట్లు మేర భాజపా చెల్లించినట్టు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అవకాశాలు మెరుగుపడాలని అగ్రనాయకత్వం భావిస్తే పైలట్ మినహా రాజస్థాన్‌లో ఉన్న తమ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరినైనా తన స్థానంలో భర్తీ చేయవచ్చన్నారు. అంతేగాని తిరుగుబాటు చేసి ద్రోహిగా ముద్ర పడిన వ్యక్తిని మాత్రం ఎమ్మెల్యేలు ఎప్పటికీ సీఎంగా అంగీకరించరన్నారు. అలాంటప్పుడు సచిన్‌ పైలట్‌ ఎలా సీఎం అవుతారననారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గురుగ్రామ్‌ రిసార్టులో ఒక్కో ఎమ్మెల్యే రూ.10కోట్లు చొప్పున తీసుకున్నట్టు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఎన్డీటీవీతో వ్యాఖ్యానించారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే తన సొంత ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన ఉదాహరణలు ఎక్కడా ఉండవన్నారు. అయితే, ఈ పరిణామాల పట్ల సచిన్‌ పైలట్‌ క్షమాపణలు చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని గహ్లోత్‌ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటివరకు ఆయన క్షమాపణలు చెప్పలేదన్నారు. మరోవైపు, సీఎం వ్యాఖ్యల్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఖండించారు. 2020లో పార్టీ ఫిరాయించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు భాజపా ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టంచేశారు.

2018లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించినప్పటి నుంచి సీఎం పదవిపై గహ్లోత్‌, పైలట్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, త్వరలోనే భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించనుండడం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇలాంటి పరిణామాలు ఆ పార్టీలో చీలికల్ని మరింతగా పెంచేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

నాపై అలాంటి భాష వాడటం తగదు!..
ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుగుతున్న భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సచిన్‌ పైలట్‌.. అశోక్‌ గహ్లోత్‌ వ్యాఖ్యలపై స్పందించారు. తన లాంటి సీనియర్‌ నేతపై అలాంటి భాషను వాడటం సరికాదన్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేయాల్సిన తరుణంలో ఇలా పరస్పరం బురదజల్లుకోవడం, నిందారోపణలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అశోక్ గహ్లోత్‌ తనను లక్ష్యంగా చేసుకొని చేసిన ప్రకటనల్ని చూశానని.. అపార రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నేతలు, పార్టీ నుంచి ఎన్నో అవకాశాలు పొందిన వారు అలాంటి భాషను వాడుతూ తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. గతంలోనూ తనపై పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. గహ్లోత్‌ సీనియర్‌ పరిశీలకుడుగా ఉన్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే తమ ప్రాధాన్యమని.. గత మూడు నెలలుగా భారత్‌ జోడో యాత్రలో భాగంగా 2వేల కి.మీలకు పైగా పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు పోరాడాల్సిన తరుణమిదేనన్నారు.

Last Updated :Nov 25, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.