Punjab polls: కాంగ్రెస్​ తొలి జాబితా సిద్ధం.. రెండు స్థానాల్లో సీఎం పోటీ!

author img

By

Published : Jan 14, 2022, 11:50 AM IST

Punjab polls

Punjab polls: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్​ సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి.

Punjab polls: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది పంజాబ్​ కాంగ్రెస్​. ఇందులో భాగంగా కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం వర్చువల్​గా భేటీ అయింది. 70 మందికిపైగా అభ్యర్థులతో తొలి జాబితా సిద్ధమైందని, త్వరలోనే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి జాబితాలో పెద్ద ఎత్తున సిట్టింగ్​లకే ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. మరోమారు కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తుది జాబితాను ఖరారు చేయనుందని, శుక్రవారమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు మరికొంత మంది నేతలు పేర్కొన్నారు.

సీఎం రెండు సీట్లలో పోటీ

పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​ జీత్​ సింగ్​ చన్నీని రెండు స్థానాల్లో బరిలో దించాలని కాంగ్రెస్​ అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చమ్​కౌర్​ నియోజకవర్గంతో పాటు మరో స్థానంలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు చెప్పాయి.

" మాఝా ప్రాంతంలోని చమ్​కౌర్​ సాహిబ్​ అసెంబ్లీ స్థానంతో పాటు దోవోబా ప్రాంతంలోని అదంపుర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం చన్నీని బరిలో దింపేందుకు కాంగ్రెస్​ సిద్ధమవుతోంది. అలాగే.. సిట్టింగ్​ ఎంపీలను సైతం అసెంబ్లీ బరిలో నిలిపినా ఆశ్చర్యమేమీ లేదు."

- పార్టీ సీనియర్​ నేత.

బరిలో ఎంపీ జస్బిర్​ సింగ్​ గిల్​

పార్టీ కోరితే అసెంబ్లీ బరిలో నిలిచేందుకు తాను సిద్ధమని ప్రకటించారు కాంగ్రెస్​ ఎంపీ జస్బిర్​ సింగ్​ గిల్​. అయితే, ఆ నిర్ణయం కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఉందన్నారు. పోటీ చేయాలని ఆమె సూచిస్తే.. తప్పకుండా ఎన్నికల బరిలో ఉంటానని ధీమాగా చెప్పారు. మరోవైపు.. త్వరలోనే పదవీ కాలం ముగియనున్న రాజ్యసభ ఎంపీ ప్రతాప్​ సింగ్​ బజ్వా లాంటి వారిని ఎన్నికల్లో నిలిపే అవకాశం ఉందని ఓ నేత చెప్పారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.