ఆరని నిరసనాగ్ని.. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోనూ ఆందోళనలు

author img

By

Published : Jun 19, 2022, 4:11 AM IST

Updated : Jun 19, 2022, 6:45 AM IST

protests against agnipath over countrywide

Agnipath Protests: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రాజుకున్న నిరసనాగ్ని దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. వరుసగా నాలుగో రోజు కూడా పలు రాష్ట్రాల్లో సైనిక ఉద్యోగార్థులు విధ్వంస చర్యలకు పాల్పడ్డారు. కొత్త సైనిక నియామక విధానాన్ని రద్దు చేయాల్సిందేనని నినదించారు. బిహార్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌, ఆప్‌ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. హరియాణా, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, అసోంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కేరళ, తమిళనాడులలోనూ నిరసనలు పెల్లుబికాయి. కర్ణాటక, బంగాల్‌ రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Agnipath Protests: అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాజస్థాన్‌ మంత్రిమండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిరసనల కారణంగా రైల్వే శాఖ శనివారం దేశవ్యాప్తంగా మొత్తం 369 రైలు సర్వీసులను రద్దు చేసింది. వీటిలో 210 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 159 లోకల్‌ పాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. మరో రెండు మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పాక్షికంగా రద్దయ్యాయి.

బిహార్‌లో బంద్‌ మద్దతుదారులు పట్నా శివార్లలోని తారెగనా రైల్వే స్టేషన్‌కు, రైల్వే పోలీసుల వాహనానికి నిప్పంటించారు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందిపైకి రాళ్లు విసరడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన కాల్పులకు దారితీసింది. దానాపుర్‌ సబ్‌డివిజన్‌లో అంబులెన్స్‌పై దాడి జరిగింది. వాహనంలో ఉన్న రోగి, సహాయకులను కొట్టారని డ్రైవర్‌ ఆరోపించారు. జెహనాబాద్‌ జిల్లాలో పోలీస్‌ శిబిరం ధ్వంసమైంది. భాజపా నేతలపై దాడులు జరుగుతుండటంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 10మంది ముఖ్య నేతలకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో అదనపు భద్రతను కేంద్ర హోంశాఖ మంజూరు చేసింది. వీరిలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణుదేవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

.
.

లుథియానాలో ముసుగు వ్యక్తుల విధ్వంసం: పంజాబ్‌లోని లుథియానా రైల్వే స్టేషన్‌లోకి ముసుగులు ధరించి ప్రవేశించిన 50 మంది యువకులు విధ్వంసం సృష్టించారు. రైల్వే ట్రాక్‌తో పాటు స్టేషన్‌లోని దుకాణాలను ధ్వంసం చేశారు. జలంధర్‌, హోషియార్‌పుర్‌లలో నిరుద్యోగులు ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. హరియాణాలో మహేందర్‌గఢ్‌ రైల్వే స్టేషన్‌ వెలుపల ఒక వాహనానికి నిప్పంటించారు. రోహతక్‌-పానీపత్‌ రహదారిపై సోనీపత్‌ వద్ద, ఫతేహాబాద్‌, జింద్‌లలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బంగాల్​ రాజధాని కోల్‌కతాలో విద్యార్థి, యువజన సంఘాలు ధర్నా నిర్వహించాయి. సీఎం మమతా బెనర్జీ నివాస ప్రాంతం హజ్రాకు సమీపంలో రహదారిని దిగ్బంధిస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసు బలగాలు వారిని చెదరగొట్టాయి. కేరళ రాజధాని తిరువనంతపురం, కోజికోడ్‌లలో నిర్వహించిన ర్యాలీలలో వందల మంది యువకులు పాల్గొన్నారు. తిరువనంతపురంలో రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ప్రదర్శకులను పోలీసులు అడ్డుకోవడంతో వారు రహదారిపైనే బైఠాయించి నినాదాలు చేశారు. కర్ణాటకలోని ధార్వాడ్‌లో నిరసనకు దిగిన యువకులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. రాజస్థాన్‌లోని జైపుర్‌, జోథ్‌పుర్‌, ఝున్‌ఝునుల్లో నిరుద్యోగ యువకులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. బెహ్రోర్‌లో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌, గంజాం జిల్లాలోని బ్రహ్మపురలో ప్రదర్శనలు శాంతియుతంగా జరిగాయి.

యూపీలో 900 మందిపై కేసులు: ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌లో దుండగులు ఒక పోలీస్‌ జీప్‌నకు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన బస్సుకు, కొన్ని మోటారు సైకిళ్లకు నిప్పంటించారు. సిక్రారా పోలీసుస్టేషన్‌ పరిధిలో సుమారు 200 మందికి పైగా యువకులు రాళ్లు, కర్రలతో రోడ్డుపైకి వచ్చి బస్సుల నుంచి ప్రయాణికులను దింపివేసి వాటి అద్దాలు ధ్వంసం చేశారు. సిక్రారా పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ద్విచక్రవాహనం, మచ్లీషహర్‌ పోలీసుస్టేషన్‌లోని ప్రభుత్వ జీపు, రెండు బస్సులతో సహా అరడజనుకుపైగా ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. బద్లాపూర్‌ సమీపంలో లఖ్‌నవూ నుంచి వారణాసి వెళుతున్న చందౌలీ డిపో బస్సు నుంచి ప్రయాణికులను కిందికి దించి దుండగులు బస్సుకు నిప్పుపెట్టారు. వెస్ట్‌ ఫత్తుపుర్‌ గ్రామం వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకవైపు నుంచి ఆందోళనకారులు రాళ్లు రువ్వుతుండగా మరోవైపు నుంచి పోలీసులు బాష్పవాయు గోళాలను, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. చందౌలీ సమీపంలోని కుచమన్‌ రైల్వేస్టేషన్‌ను, స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 340 మంది నిందితులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అలీగఢ్‌ జిల్లాలో అల్లర్లకు సంబంధించి 500 మందిపై, శుక్రవారం బలియాలో రైలుకు నిప్పంటించిన ఘటనలో 400 మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

protests against agnipath over countrywide
అగ్నిపథ్​కు వ్యతిరేకంగా మిన్నంటిన ఆందోళనలు

రైలులో మహిళ ప్రసవం
'అగ్నిపథ్‌' వ్యతిరేక ఆందోళనల కారణంగా దిల్లీ-హౌరా ప్రధాన మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జమానియా రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయిన రైలులో బిహార్‌కు చెందిన గుడియా దేవి(28) అనే మహిళ ప్రసవించింది.
ఇదే స్టేషన్‌లో నిలిచిపోయిన దానాపుర్‌-ఆనంద్‌ విహార్‌ రైలులో రామేశ్వర్‌(55)కు గుండెపోటు వచ్చింది. అంబులెన్స్‌లో పీహెచ్‌సీకి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

రూ.200 కోట్ల నష్టం: గత నాలుగు రోజుల ఆందోళనల్లో బిహార్‌లో 60 రైలు బోగీలు, 10 రైలు ఇంజిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. రైల్వే స్టేషన్లు సహా సమీప ప్రాంగణాల్లో జరిగిన విధ్వంసంతో రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని దానాపుర్‌ రైల్వే డివిజన్‌ డీఆర్‌ఎం ప్రభాత్‌ కుమార్‌ వెల్లడించారు. ఉద్యమకారులపై శనివారం పోలీసులు 25 కేసులు నమోదు చేసి 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత మూడు రోజులుగా మొత్తం 718 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: 'అగ్నిపథ్​' నిరసనలతో ఆగిన ట్రైన్​​​.. వ్యక్తి మృతి.. రైలులోనే మహిళ ప్రసవం

Last Updated :Jun 19, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.