'సంస్కరణలు ఇప్పుడు నచ్చకపోయినా.. దీర్ఘకాలంలో మేలే'

author img

By

Published : Jun 20, 2022, 6:37 PM IST

PM Modi Agnipath protests

PM Modi Agnipath protests: సంస్కరణలు దీర్ఘకాలంలో దేశానికి మేలు చేస్తాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా.. కాలం గడిచేకొద్దీ దేశం వాటి లాభాలను అందుకుంటుందని చెప్పారు. సైనిక నియామకాల్లో సంస్కరణలపై దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi Agnipath protest: అగ్నిపథ్‌పై దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోయినా, కాలం గడిచే కొద్దీ వాటి లాభాలను దేశం అందుకుంటుందని అన్నారు. బెంగళూరులో రూ.280 కోట్లతో నిర్మించిన మెదడు పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు ప్రధాని. మరో రూ.28వేల కోట్లతో చేపట్టిన రహదారి, రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజక్టులకు శ్రీకారం చుట్టారు.

"21వ శతాబ్దపు భారతదేశం.. సంపద, ఉద్యోగాల సృష్టికర్తలది. నవకల్పనలు కలిగిన వారికీ ఇది సొంతం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా ఉండడమే భారత్‌ శక్తి, సంపద. గత 8 ఏళ్లలో అంకురాలు, నవకల్పనల మార్గంలో వేగంగా పయనించడం సులభంగా జరగలేదు. కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా నచ్చకపోవచ్చు, కానీ సమయం గడిచిన తర్వాత ఆ సంస్కరణల లాభాలను ఇప్పుడు దేశం అనుభవిస్తోంది. సంస్కరణల మార్గమే మనల్ని కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల వైపు తీసుకువెళుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌కు బెంగళూరు ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. ఈ నగరం అభివృద్ధి, లక్షలాది మంది అభివృద్ధి అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి ఈ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాయని తెలిపారు. అయితే అధికార దాహం కలిగిన కొందరు.. ప్రైవేటు రంగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని విపక్షాలపై ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సంస్కరణల మార్గమే మనల్ని కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాల వైపు తీసుకువెళుతుందని అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.