దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం

author img

By

Published : Aug 1, 2022, 10:35 PM IST

MONKEYPOX

Monkeypox Delhi: దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దిల్లీలో నివసిస్తున్న నైజీరియావాసికి వైరస్ పాజిటివ్​గా తేలిందని అధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశస్థులైన మరో ఇద్దరిని.. అనుమానిత కేసులుగా పరిగణించి ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు, మంకీపాక్స్​పై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ప్రత్యేక టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది.

Monkeypox cases in India: దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దిల్లీలో నివసిస్తున్న నైజీరియా వాసికి మంకీపాక్స్ పాజిటివ్​గా తేలింది. బాధితుడు ఇటీవల ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. అతడి వయసు 35 అని అధికారులు తెలిపారు. బాధితుడిని ఎల్ఎన్​జేపీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇది దిల్లీలో రెండో కేసు కాగా.. దేశంలో ఆరవది. నైజీరియా వాసికి ఒంటిపై పొక్కులు వచ్చాయని, ఐదు రోజులుగా జ్వరంగా ఉందని అధికారులు వెల్లడించారు. 'అతడి నమూనాలను పుణెలోని నేషనల్ వైరాలజీ ఇన్​స్టిట్యూట్​కు పంపించాం. సోమవారం సాయంత్రం ఫలితాలు వచ్చాయి. అందులో పాజిటివ్ అని తేలింది. ఆఫ్రికా దేశస్థులైన మరో ఇద్దరు అనుమానితులను సైతం ఆస్పత్రిలో చేర్పించాం' అని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు, జులై 30న ప్రాణాలు కోల్పోయిన 22ఏళ్ల యువకుడికి మంకీపాక్స్ పాజిటివ్​ అని నిర్ధరణ అయింది. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అతడు.. స్నేహితులతో కలిసి ఫుట్​బాల్ ఆడాడు. ఆ తర్వాతి రోజే అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. యూఏఈలో ఉన్నప్పుడే అతడికి మంకీపాక్స్ పాజిటివ్​గా తేలిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం అతడి నుంచి సేకరించిన నమూనాలను అధికారులు పరీక్షలకు పంపించగా.. తాజాగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాధితుడికి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, స్నేహితులను పరిశీలనలో ఉంచారు. మరోవైపు, రాజస్థాన్​లోనూ మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. ఒంటిపై దురద, జ్వరం వంటి లక్షణాలతో 20ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో చేరాడు.

ఇదీ చదవండి: దేశంలో తొలి మంకీపాక్స్ మరణం.. 20 మంది క్వారంటైన్

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. దేశంలో మంకీపాక్స్‌ కేసుల పర్యవేక్షణ, కట్టడి కోసం ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దేశంలోని ప్రధాన వైద్య, పరిశోధనా సంస్థల ప్రతినిధులూ సభ్యులుగా ఉంటారని తెలిపాయి. వైరస్‌ నిర్ధారణ, చికిత్సలకు సంబంధించి వసతుల విస్తరణ, అవసరమైన ఏర్పాట్లు, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ సూచనలు చేస్తుంది. 'దేశంలో మంకీపాక్స్ కేసుల నిర్వహణలో ఈ టాస్క్‌ఫోర్స్‌ సహాయపడుతుంది. ఆయా రాష్ట్రాల్లో నమోదయ్యే కేసులను సమన్వయం చేస్తుంది. అవసరమైతే సూచనలు జారీ చేస్తుంది' అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.