గుజరాత్​లో ఒమిక్రాన్ కేసు- వారిని కనుగొనే పనిలో అధికారులు

author img

By

Published : Dec 4, 2021, 2:35 PM IST

Updated : Dec 4, 2021, 4:35 PM IST

Omicron Variant news

14:31 December 04

భారత్​లో మరో ఒమిక్రాన్ కేసు

Omicron Virus India: భారత్​లో మరో ఒమిక్రాన్​ కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్​లోని జామ్​నగర్​లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జామ్​నగర్​కు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఆఫ్రికాలోని జింబాబ్వే నుంచి ఇటీవల స్వగ్రామానికి చేరుకోగా.. తాజాగా వైరస్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.

" వైరస్​బారిన పడిన వ్యక్తి నవంబర్​ 28న జింబాబ్వే నుంచి వచ్చారు. డిసెంబర్​ 2న కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత అతని నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం అహ్మదాబాద్​కు పంపించాం."

- గుజరాత్​ హెల్త్​ కమిషనర్​ జై ప్రకాశ్​ శివ్​హేర్

జామ్​నగర్​కు చెందిన ఆ వ్యక్తి చాలా ఏళ్లుగా జింబాబ్వేలో నివసిస్తున్నారని.. తన మామను కలిసేందుకు గుజరాత్​కు వచ్చారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే జ్వరం రావటం వల్ల ఆర్​టీ పీసీఆర్​ పరీక్ష చేసుకోవాలని అతని వైద్యులు సూచించారని, ఓ ప్రైవేటు ల్యాబ్​లో కరోనా పరీక్ష చేసుకోగా వైరస్​ నిర్ధరణ అయినట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

వైరస్​ సోకిన వ్యక్తిని ప్రస్తుతం ఖరాడిలోని గురు గోవింద్​ సింగ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్​కు తరలించారు అధికారులు. జింబాబ్వే నుంచి వచ్చాక ఆ వ్యక్తి 90 మందిని కలిసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారందరి సమాచారం తెలుసుకుని, పరీక్షలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బెంగళూరులో రెండు..

కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం గురువారం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు. అయితే, గోప్యతను దృష్టిలో ఉంచుకొని వారి పేర్లను వెల్లడించడం లేదని అన్నారు. వీరిద్దరికీ తొలుత కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ కావడం వల్ల ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేశామని, వారిద్దరిలో ఒమిక్రాన్‌ ఉన్నట్టు ఇన్‌సాకాగ్ నిర్ధరించినట్లు వెల్లడించారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదని తెలిపారు.

కర్ణాటకలో వెలుగు చూసిన రెండు ఒమిక్రాన్ కేసుల్లో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా దేశస్థుడని, మరొక వ్యక్తి ప్రభుత్వ వైద్యుడని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. దక్షిణాఫ్రికా దేశస్థుడు కోలుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. ఆఫ్రికా దేశస్థుడితో సన్నిహితంగా మెలిగిన.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు పరీక్షలు జరపగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 'బెంగళూరులో రెండు ఒమిక్రాన్‌ కేసులు.. మరో ఐదుగురికి..'

Last Updated :Dec 4, 2021, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.