'ఇంట్లోకి వచ్చేదాకా వేచిచూడొద్దు.. వారిని వెంబడించాల్సిందే!'.. ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు

author img

By

Published : Nov 18, 2022, 11:31 AM IST

narendra modi

ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు యావత్​ ప్రపంచం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై దిల్లీ వేదికగా 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

PM Modi Terrorism: ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై దిల్లీ వేదికగా 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. "గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ అనేక విధాలుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటోంది. ఎన్నో విలువైన ప్రాణాలను మనం కోల్పోయాం. కానీ దీనిపై మనం ధైర్యంగా పోరాడుతున్నాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు మేం విశ్రమించబోం. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు చురుకైన, వ్యవస్థీకృత స్పందన అవసరం. మన ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటే.. ఉగ్రవాదం మనింటి లోపలికి వచ్చేవరకు వేచి చూడకూడదు. మనమే ముష్కరులను వెంబడించాలి. వారికి మద్దతుగా ఉన్న నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టాలి" అని మోదీ స్పష్టం చేశారు.

కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఆ దేశాలు ముష్కరులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉంటున్నాయని, అలాంటి వారిపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని ప్రధాని సూచించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విస్తరిస్తోన్న ఈ ఉగ్రవాదంపై పోరాడేందుకు మనమంతా ఏకమవ్వాలని ప్రపంచ దేశాలను కోరారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మంత్రులతో పాటు ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఏ) సభ్యులు, పలు ఉగ్ర నిరోధక సంస్థల అధినేతలు కలిపి దాదాపు 450 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. శనివారం ఈ సదస్సు ముగింపు సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. ఉగ్రవాదులకు నిధుల నిరోధంపై జరుగుతున్న మూడో సదస్సు ఇది. అంతకుముందు 2018 ఏప్రిల్‌లో పారిస్‌ వేదికగా.. 2019 నవంబరులో మెల్‌బోర్న్‌లో 'నో మనీ ఫర్‌ టెర్రర్‌' అంతర్జాతీయ సదస్సులు జరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.