కొత్త పార్లమెంటు ఓపెనింగ్​కు కేంద్రం ఆహ్వానం.. వెళ్లరాదని విపక్షాల నిర్ణయం

author img

By

Published : May 24, 2023, 12:57 PM IST

Updated : May 24, 2023, 8:00 PM IST

parliament building inauguration

New Parliament Building Inauguration : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకపై రాజకీయ దుమారం రేగింది. ఈ నెల 28న జరగనున్న నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు 19 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన పార్టీల జాబితాలో ఉన్నాయి.

New Parliament Building Inauguration : పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలనే డిమాండ్‌ను విపక్షాలు లేవనెత్తుతున్నాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ ప్రారంభించనుండటం.. అనేది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందకే వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోదీకి కొత్తేం కాదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్‌ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కనపెట్టినప్పుడు.. ఇక నూతన భవనంలో తమకు ఏ విలువా కనిపించడం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు DMK రాజ్య సభ సభ్యుడు తిరుచ్చి శివ స్పష్టత ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి NCP హాజరుకాదని.. ఈ అంశంపై భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలతో కలిసి నిలబడాలని నిర్ణయించకున్నట్లు NCP ప్రకటించింది. అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసే తాము కూడా నడుస్తామని శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఈ జాబితాలో సీపీఎం కూడా చేరింది. శిలా ఫలకాలపై పేరు కోసమే మోదీ, దేశ అత్యున్నత స్థానంలో ఉన్న గిరిజన మహిళను అవమానిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు.

'కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం. కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది. దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్మును పక్కనబెట్టి ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని నిర్ణయించడం ఇది ఆమెను అవమానించడమే. ఇలా చేయడం ప్రజాస్వామ్యంపై దాడి కూడా. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాదు.. పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంట్​లో బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అలాంటిది రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. ఈ చర్య గౌరవప్రదమైన రాష్ట్రపతి పదవిని అవమానిస్తుంది.' అని విపక్షాలు సంయుక్తంగా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, శివసేన(యూబీటీ), జేడీయూ సహా 19 పార్టీలు ఈ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

'పార్లమెంట్​ రాజ్యాంగ విలువలపై నిర్మితమైంది.. అహంపై కాదు'
పార్లమెంట్​ రాజ్యాంగ విలువలపై నిర్మితమైందని.. అహం(ఈగో) ఇటుకలపై కాదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్లమెంట్​ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత ప్రారంభించకుండా.. ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం రాజ్యాంగ అత్యున్నత స్థానాన్ని అవమానపరచడమేన్నారు. కాంగ్రెస్ సహా 19 విపక్ష పార్టీలు పార్లమెంట్​ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన నేపథ్యంలో రాహుల్ స్పందించారు.

సమర్ధించుకున్న బీజేపీ
మరోవైపు.. తన చర్యను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టికి ఉదాహరణ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. రావడం లేదా రాకపోవడం వారికి విజ్ఞత మీద ఆదారపడి ఉంటుందని పేర్కొన్నారు. భవనం ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయకూడని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

"భవన నిర్మాణంలో భాగమైన 7,000 మందిని కార్మికులను ప్రధాని మోదీ సత్కరిస్తారు. మే 28న కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'ను ప్రధాని ఉంచుతారు. దీనిని ప్రధాని మోదీ తమిళ ఆదివాసీల నుంచి మే 28న స్వీకరిస్తారు. 1947 ఆగస్టు 14న బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ సెంగోల్​ను స్వీకరించారు."

-- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

విపక్ష పార్టీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న పార్టీలు తమ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని ఆయన కోరారు. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్‌కు కొరవడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారనీ, 1987లో ఆమె తనయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా ప్రధానిగా పార్లమెంటు గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు చేస్తే తప్పేమిటని కాంగ్రెస్‌ని హర్దీప్‌సింగ్‌ ప్రశ్నించారు.

parliament building inauguration
నూతన పార్లమెంట్​ భవనం నమూనా చిత్రం

బీఆర్​ఎస్​ వైఖరి ఇదే..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరుకావాలా? వద్దా? అనే విషయంపై మే 25(గురువారం)న నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు తెలిపారు. బీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు పార్టీ నేతలతో చర్చించాక పార్లమెంట్ భవనం ప్రారంభానికి పార్టీ హాజరుకావడంపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

New Parliament Building Inauguration Date : భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. మే 28న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్​లో భవనానికి పునాది రాయి వేశారు ప్రధాని మోదీ. నిజానికి గతేడాది నవంబర్​లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.

Parliament New Building : 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.

parliament building inauguration
పార్లమెంట్ భవనం( పాత ఫొటో)
Last Updated :May 24, 2023, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.