'గుర్తు తెలియని వ్యక్తుల' నుంచే జాతీయ పార్టీలకు ఆదాయం!

author img

By

Published : Aug 31, 2021, 7:46 PM IST

Association for Democratic Reform

2019-20 ఆర్థిక సంవత్సరంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచే జాతీయ పార్టీలు భారీ ఆదాయం సేకరించినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR report) నివేదించింది. ఇందులో భాజపాకే అధికంగా నిధులు వచ్చినట్లు పేర్కొంది. కాగా మొత్తం జాతీయ పార్టీల గుర్తు తెలియని ఆదాయంలో భాజపా వాటా 78.24 శాతమని తెలిపింది.

దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో సింహ భాగం 'గుర్తు తెలియని' వర్గాల నుంచే వస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలన్నీ (political parties income in India) కలిపి రూ.3,377.41 కోట్లు ఇలా వసూలు చేశాయి. ఇందులో 88.643 శాతం (2,993.826 కోట్లు) నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయి. పార్టీల ఆదాయాల్లో గుర్తు తెలియని నిధుల వాటా 70.98 శాతం కావడం గమనార్హం. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR report) నివేదించింది.

భాజపాదే అధిక భాగం

గుర్తు తెలియని వ్యక్తుల నిధులు భాజపాకే అధికంగా వచ్చాయి. మొత్తం రూ.2,642.63 కోట్లు గుర్తు తెలియని వర్గాల నుంచి వచ్చినట్లు భాజపా వెల్లడించింది. ఈ విషయంలో మొత్తం జాతీయ పార్టీల ఆదాయంలో భాజపా వాటా 78.24 శాతం.

కాంగ్రెస్​కు రూ.526 కోట్లు గుర్తు తెలియని వర్గాల నుంచి వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ వాటా 15.57 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. జాతీయ పార్టీలన్నీ కేవలం రూ. 3.18 లక్షలను నగదు రూపంలో స్వీకరించాయి.

2004-05 నుంచి 2019-20 మధ్య జాతీయ పార్టీలన్నీ గుర్తు తెలియని వర్గాల నుంచి రూ.14,651.53 కోట్లను వసూలు చేశాయి. ఈ కాలంలో కాంగ్రెస్, ఎన్​సీపీలు కూపన్ల విక్రయం ద్వారా రూ. 4,096.725 కోట్ల ఆదాయాన్ని సంపాదించాయి.

గుర్తు తెలియని ఆదాయం అంటే?

ఈ కేటగిరీ కిందకు వచ్చే ఆదాయం ఎవరు ఇచ్చారనే విషయాలు తెలియవు. ఎలక్టోరల్ బాండ్లు, కూపన్ల అమ్మకం, సహాయ కార్యక్రమాల నిధులు, స్వచ్ఛంద విరాళం, మీటింగ్​లు, మోర్చాల నుంచి వచ్చిన సొమ్మును గుర్తు తెలియని ఆదాయం కింద వర్గీకరిస్తారు. దాతలు ఆదాయ పన్ను రిటర్నుల్లో వీటి గురించి వివరాలు వెల్లడిస్తారు. అయితే, రూ.20 వేల లోపు విరాళాలకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని వెల్లడించరు.

ఈ ఆదాయ వనరులపై పారదర్శకత ఉండాలని ఏడీఆర్ డిమాండ్ చేస్తోంది. పార్టీల ఆర్థిక నివేదికలను 'కాగ్', ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన యంత్రాంగంతో తనిఖీ చేయించాలని సిఫార్సు చేస్తోంది. తద్వారా రాజకీయ పార్టీలను.. తమ ఆదాయాలపై జవాబుదారీని చేయాలని సూచిస్తోంది.

ఇదీ చూడండి: భాజపాకు విరాళాల వరద- ఐదు పార్టీలకు వచ్చినదానికి ట్రిపుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.