ఎలుక పోయిందని కేస్.. వారిపైనే డౌట్.. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు!

author img

By

Published : Oct 3, 2022, 7:44 AM IST

rajasthan rat theft issue

ఎలుక పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. గుర్తించేందుకు అవసరమైన ఆనవాళ్లన్నీ వివరించాడు. ఎవరిపై అనుమానం ఉందో కూడా చెప్పాడు. ఎన్నడూ చూడని కేసుపై 'ప్రత్యేక' దర్యాప్తు చేస్తున్నారు రాజస్థాన్​ పోలీసులు.

"సార్‌.. నా సైకిల్‌ పోయింది. సార్‌ నా కారు పోయింది లేదా మా ఇంట్లో బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు" అంటూ పోలీసులకు ఫిర్యాదులు అందడం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా.. "సార్‌ నేను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఎలుకను ఎవరో ఎత్తుకెళ్లారు" అని పేర్కొంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. ఈ మేరకు బాంసవాఢా జిల్లా సజ్జన్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పడ్లా వాఢ్కియా గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్య పోవడం పోలీసుల వంతైంది. అనంతరం అతనికి నచ్చజెప్పేందుకు వారు విఫలయత్నం చేశారు.

తాను పెంచుకునే ఎలుక 700 గ్రాముల బరువు ఉంటుందని, గత నెల 28న దానిని ఎవరో ఎత్తుకెళ్లారని ఫిర్యాదుదారుడు పేర్కొనడం విశేషం. అక్కడితో ఆగకుండా తన సోదరుడి ముగ్గురు కుమారులపై అనుమానం ఉందని సైతం వెల్లడించాడు. చివరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురి పేర్లను అందులో నిందితులుగా పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదు అందడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

ఇలాంటి విచిత్ర చోరీ కేసులు గతంలోనూ వెలుగుచూశాయి. ఈ ఏడాది మార్చిలో చెన్నైలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు.. అది కూడా ఒకరోజు కాదు, వరుసగా మూడు రోజులు. దొరికినకాడికి నగదును, బంగారాన్ని దోచుకెళ్లారు. అక్కడితో ఆగకుండా మందు పార్టీ చేసుకున్నారు. వీరు దొంగతనం చేసిన ఇల్లు విశ్రాంత న్యాయమూర్తిది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరోవైపు.. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మందు కోసం తాను పని చేసే ఆఫీస్​లోని వస్తువులనే అమ్మేశాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజామ్​ జిల్లా విద్యా శాఖ అధికారి-డీఈఓ కార్యాలయంలో జరిగింది. నిఘా ఉంచమని బాధ్యత అప్పచెబితే అతడు తన చేతివాటాన్ని చూపించాడు. దాదాపు రెండేళ్లలో తలుపులతో సహా మొత్తం ఆఫీస్​నే ఖాళీ చేశాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒడిశాలో కొందరు దొంగలు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఓ పాఠశాలకు చెందిన కంప్యూటర్లు దోచుకెళ్లి.. బ్లాక్​బోర్డు పైన 'త్వరలోనే ధూమ్-​4 రాబోతుంది' అని రాశారు. మరుసటి రోజు ఉదయం పాఠశాలకు వచ్చి అది చూసిన ఉపాధ్యాయులు అవాక్కై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.