బిడ్డ కోసం హైనాతో పోరాటం.. 3 కి.మీ పరిగెత్తిన తల్లి.. దురదృష్టవశాత్తూ..

author img

By

Published : Mar 5, 2023, 9:11 AM IST

mother fight with hyena to save son in jagdalpur chattisgarh

ప్రపంచంలో తల్లికి మించిన యోధురాలు ఎవ్వరూ ఉండరు. కన్నబిడ్డ కోసం కాలాన్ని అయినా ఎదిరించగల శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంది. తన బిడ్డను పెంచడానికి ఎంత కష్టమైనా పడుతుంది. ఎవరినైనా ఎదురిస్తుంది. అలాంటి ఘటనే ఛత్తీస్​గఢ్​లో జరిగింది. క్రూర జంతువు దాడి నుంచి తన బిడ్డను కాపాడుకోవడానికి దాదాపుగా 3కిలోమీటర్ల దూరం పోరాడింది. కానీ కనికరించని కాలం బాలుడిని.. మృత్యుఒడికి చేర్చింది.

ఛత్తిస్​గఢ్​లో విషాదకర ఘటన జరిగింది. రెండేళ్ల చిన్నారి ఆరుబయట ఆడుకుంటూ ఉండగా ఓ హైనా వచ్చి బాలుడిని ఎత్తుకెళ్లింది. దానిని గమనించిన తల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా హైనా వెంట 3కిలోమీటర్లు పరిగెత్తి కుమారుడిని వణ్యప్రాణి నుంచి కాపాడుకుంది. దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగ్​దల్​పుర్ జిల్లా చిత్రకోట్ అటవీ ప్రాంతంలో జరిగింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. తోకపాల్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని నైన్నార్ గ్రామంలో 2 సంవత్సరాల బాలుడు తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్నాడు. అంతలో పొదల్లో దాగిఉన్న హైనా బాలుడు ఒంటరిగా ఉండటం చూసి వచ్చి చిన్నారిపై దాడి చేసింది. అతడిని నోట్లో పెట్టుకుని అడవి వైపు పరిగెత్తడం ప్రారంభించింది. ఇంతలో తల్లి హైనాను గమనించింది. వెంటనే తల్లి అలర్ట్ అయ్యి హైనా వెనక పరిగెత్తడం ప్రారంభించింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడింది.

హైనా నుంచి తన బిడ్డను రక్షించడానికి 3కిలోమీటర్ల మేర పరిగెత్తింది. తల్లి పరిగెత్తడం చూసి చుట్టుపక్కల వారు కూడా ఆమెతో పాటు పరుగులు తీశారు. హైనా నుంచి బాలుడిని విడిపించడంలో గ్రామస్థులు కూడా సహాయపడ్డారు. ఎట్టకేలకు బాలుడిని హైనా నుంచి విడిపించారు. వెంటనే బస్తర్‌లోని డిమ్రాపాల్ ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ఒక గంట తర్వాత బాలుడు తన ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో నైన్నార్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భయాందోళన నెలకొంది. చిన్న పిల్లల భద్రతపై ప్రజల్లో ఆందోళన పెరిగింది.

"ఉదయం 8.30 గంటలకు, తీవ్రంగా గాయపడిన బాలుడిని టోకాపాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రథమ చికిత్స తర్వాత డిమ్రాపాల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యుల బృందం వచ్చి చికిత్స ప్రారంభించింది. గాయపడిన బాలుడు.. సుమారు 1 గంట తర్వాత మృతి చెందాడు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించాం" అని డిమ్రాపాల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అనూత్ సాహు వివరించారు.

'పరిహారం ఇచ్చాం..'
'ప్రాణనష్టానికి రూ.6 లక్షల పరిహారం ఇవ్వాలని నిబంధన ఉంది. ముందుగానే బాధిత కుటుంబానికి రూ.25 వేలు అడ్వాన్స్‌గా అందించాం" అని చిత్రకోట్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి ప్రకాశ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.

కుమార్తె కోసం ఒక తల్లి అడవి పందితో పోరాటం:
ఛత్తిస్​గఢ్​లోని కోర్బాలో వారం క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. తన 11 ఏళ్ల కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి అడవి పందితో పోరాడాల్సి వచ్చింది. పందిని కుప్ప కూల్చే వరకు ఆమె పారతో దాడి చేసింది. అరగంట పాటు ఈ పోరు జరిగింది. పసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేలియామర్ గ్రామానికి చెందిన దువాసియా బాయి తన కూతురు సునీతను కాపాడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.