'ఆ డబ్బు నాది కాదు.. నాపై కుట్రలకు కాలానిదే సమాధానం'

author img

By

Published : Jul 31, 2022, 10:49 PM IST

partha chatterjee news

Partha chatterjee news: నటి, మోడల్‌ అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదన్నారు బంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు.

Partha chatterjee news: బెంగాల్‌లో పాఠశాల ఉద్యోగుల నియామక కుంభకోణం కేసులో తనతో పాటు అరెస్టయిన నటి, మోడల్‌ అర్పితా ముఖర్జీ ఇంట్లో బయటపడిన డబ్బు తనది కాదని మాజీ మంత్రి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు. కోల్‌కతా శివారులోని జోకాలో వైద్య పరీక్షల కోసం అధికారులు ఆయన్ను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకురాగా.. విలేకర్లతో మాట్లాడారు. అర్పితా ముఖర్జీ ఇళ్లలో ఈడీ జరిపిన సోదాల్లో దొరికిన డబ్బు తనది కాదన్నారు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారా అని విలేకర్లు అడగ్గా.. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు.

గత వారం అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న పార్థా ఇటీవల మాట్లాడుతూ.. ఈ కుట్రలో తాను బాధితుడిగా మారానని వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేయడం పట్ల విచారం వ్యక్తంచేసిన ఆయన.. ఆ నిర్ణయం నిష్పాక్షిక దర్యాప్తును ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పార్థా.. ఈ కేసు నేపథ్యంలో తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ దీదీ తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు.

మరోవైపు, 2014-2021 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు.. పార్థాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా అర్పిత నివాసాల్లో సోదాలు జరపగా.. రూ.కోట్ల విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, కీలక దస్త్రాలను సీజ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఆ డబ్బంతా మంత్రి పార్థా ఛటర్జీదేనని.. తన ఇంటిని ఆయన ఓ మినీబ్యాంకులా మార్చుకున్నారంటూ ఆమె విచారణలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ డబ్బు తనది కాదంటూ పార్థా ఛటర్జీ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇవీ చదవండి: India Monkeypox death: దేశంలో తొలి మంకీపాక్స్ మరణం!

అలవోకగా 'లా'.. ఒకేసారి 11 గోల్డ్​ మెడల్స్​తో పల్లవి సత్తా.. చూపు లేకపోయినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.