ఉద్ధవ్​ సర్కార్​కు షాక్​.. మంత్రి తిరుగుబాటు.. 15 మందికిపైగా ఎమ్మెల్యేలతో జంప్​?

author img

By

Published : Jun 21, 2022, 9:20 AM IST

Updated : Jun 21, 2022, 2:08 PM IST

maharashtra uddhav Govt In Trouble

09:12 June 21

ఉద్ధవ్​ సర్కార్​కు షాక్​.. మంత్రి తిరుగుబాటు.. 15 మందికిపైగా ఎమ్మెల్యేలతో జంప్​?

Eknath Shinde: మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి భారీ షాక్​ తగిలింది. ప్రభుత్వంపై అసంతృప్తితో కేబినెట్​ మంత్రి, శివసేన సీనియర్​ నేత ఏక్​నాథ్​ శిందే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని గుజరాత్​కు వెళ్లారు. ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని సమాచారం. వీరంతా.. గుజరాత్​ భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​తో టచ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. సూరత్​లోని ఓ హోటల్​లో బస చేస్తున్నట్లు అక్కడి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మహా కూటమికి ఝలక్​: మహారాష్ట్ర శాసన మండలిలోని 10 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీలు రెండేసి సీట్లలో, కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించాయి. విపక్ష భాజపా సొంతంగా అయిదు స్థానాలను గెలుచుకోగలిగింది. కమలం పార్టీకి నలుగురు అభ్యర్థులను గెలుచుకోగల సంఖ్యా బలం(106) మాత్రమే ఉన్నప్పటికీ అయిదుగురిని బరిలోకి దించింది. పూర్తిస్థాయిలో విజయం సాధించింది. కూటమిలోని మూడు పక్షాలు కలిసి (రెండేసి సీట్ల చొప్పున) ఆరు స్థానాల్లో పోటీ చేసినా అయిదుగురినే గెలిపించుకోగలిగాయి. కూటమి తరఫున కాంగ్రెస్​ నుంచి బరిలోకి దిగిన చంద్రకాంత్​ హండోర్​ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో సొంత బలం 106 కాగా.. 133 ఓట్లు తమ అభ్యర్థులకు వచ్చాయని భాజపా తెలిపింది. ఆ పార్టీకి అదనంగా వచ్చిన ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు అధికార పక్షం వారివీ ఉంటాయని భావిస్తున్నారు.

శిందే అజ్ఞాతంలోకి వెళ్లారని శివసేన నేత ఒకరు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​ సమయంలో కూడా లేరని, గుజరాత్​ వెళ్లి ఉంటారని ఆయన అన్నారు. దీనిని బట్టే అధికార పక్షంలోని ఏక్​నాథ్​ శిందే తిరుగుబావుటా ఎగరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​ జరిగిందేమోనని అనుమానంతో.. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే అప్రమత్తమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. అందరూ తప్పక హాజరుకావాలని స్పష్టం చేశారు. మరి శిందే వస్తారో లేదో స్పష్టత లేదు.

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ దిల్లీ నివాసంలో.. విపక్షాల భేటీ జరగనుంది. ఇందులో 17 పార్టీల ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శివసేన ప్రతినిధి సంజయ్​ రౌత్​ ఈ మీటింగ్​కు వెళ్లబోరని తెలుస్తోంది. శివసేన విధేయుల పార్టీ అని.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని రౌత్​ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లోలాగా.. భాజపా ట్రిక్కులు మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వాన్ని ఏం చేయలేవని ఉద్ఘాటించారు. శిందే శివసైనికుడే అని.. త్వరలోనే ఆయన తిరిగివస్తారని చెప్పారు. మొత్తం 15 మందికిపైగా శివసేన ఎమ్మెల్యేలు అందుబాటులోకి రావట్లేదని పేర్కొన్నారు.

శివసేన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్​ పాటిల్​ స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తమకేమీ సంబంధం లేదని అన్నారు. ఒకవేళ శిందే నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏదైనా ప్రతిపాదన వస్తే.. కచ్చితంగా పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
ఠాక్రేతో భేటీ కానున్న పవార్‌..

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీలు అత్యవసర భేటీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎన్సీపీ సీనియర్‌ నేతలు అధినేత శరద్‌ పవార్‌ను కలిసేందుకు దిల్లీ బయల్దేరారు. అటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ కూడా హస్తిన వెళ్లారు. ఈ సాయంత్రం శరద్‌ పవార్‌ ముంబయికి తిరిగొచ్చి సీఎం ఠాక్రేను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గానూ.. సంకీర్ణ ప్రభుత్వానికి 169 మంది సభ్యులు ఉన్నారు. 113 సీట్లతో ఎన్​డీఏ రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో లేని ఈ 12 మంది ఎమ్మెల్యేలు.. భాజపాలో చేరినా ప్రభుత్వం అధికారం కోల్పోదు. మహా వికాస్​ అఘాడీకి.. మెజార్టీ కంటే ఎక్కువ స్థానాలే ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు ముందు.. ఇది భాజపాకు లాభం చేకూర్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: 'అగ్నిపథ్'​పై విపక్షాలు భగ్గు.. 'ఆర్మీ అధికారులతో ఆ పని చేయిస్తారా?'

రాష్ట్రపతి అభ్యర్థిపై భాజపా కీలక భేటీ.. విపక్షాల తరఫున సిన్హా?

Last Updated :Jun 21, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.