'లవ్​టుడే' సినిమా రిపీట్​​.. ఫోన్లు మార్చుకున్న జంట.. ఆ వీడియోతో దొరికి జైలు పాలైన యువకుడు

author img

By

Published : Jan 21, 2023, 11:02 AM IST

LoveToday Tamil cinema style cell phone exchange

పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని అనుకుంది ఓ జంట. ఇటీవల విడుదలై సూపర్​ హిట్​గా నిలిచిన 'లవ్​టుడే' సినిమా నుంచి స్ఫూర్తి పొంది తమ ఫోన్లు పరస్పరం మార్చుకున్నారు. అలా యువకుడి ఫోన్​ చూసిన యువతికి మైండ్​ బ్లాక్​ అయింది.

సినిమాల నుంచి స్ఫూర్తిపొంది జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లిన వాళ్లు ఉన్నారు. కానీ అందరూ అలా అవుతారనుకుంటే పొరపాటే. ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. ఇటీవల విడుదలై సూపర్​ హిట్​ సాధించిన చిత్రం 'లవ్​టుడే'ను ఒక యువ జంట ఆదర్శంగా తీసుకుంది. అయితే, ఈ రియల్​ 'లవ్​టుడే' సీన్​ రివర్స్​ అయింది. యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. అసలు బండారం బయటపడటం వల్ల ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన సేలం జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది.. అరవింద్​(23).. వజప్పడి దగ్గరలోని బేలూర్​కు చెందిన వాడు. ఇతడు ఓ ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అరవింద్​కు బేలూర్​ టౌన్​లోని ఓ యువతితో నిశ్చితార్థం అయింది. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని అనుకున్నారు. అలా తెలుసుకోవడానికి సరైన మార్గం గురించి ఆలోచించారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'లవ్​టుడే' సినిమా గుర్తుకువచ్చింది ఇద్దరికీ. ఈ సన్నివేశం ప్రకారం వారిద్దరి మధ్య ఎలాంటి దాపరికం ఉండకూడదు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు వాళ్ల మొబైల్​ ఫోన్లు పరస్పరం మార్చుకున్నారు.

అయితే ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది. పెళ్లైపోతుంది అన్న తొందరలో ఆలోచించకుండా మార్చుకున్నారు. ఫోన్లు అయితే మార్చుకున్నారు కానీ, అందులో వాళ్ల పర్సనల్స్​ను మాత్రం గమనించుకోలేదు. ముఖ్యంగా అరవింద్​ ఈ విషయంలో తొందరపడి అడ్డంగా బుక్​ అయ్యాడు. ఇదిలా ఉంటే, ఇలా అడగగానే అలా ఫోన్​ ఇచ్చిన.. తనకు కాబోయే భర్త ధైర్య సాహసాలకు ఆ యువతి పొంగిపోయింది. తనకు ఇంత మంచి భర్త వస్తున్నందుకు సంతోషపడిపోయింది. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ ఫోన్​ను కొద్ది సేపు బ్రౌజ్​ చేసిన వెంటనే ఆ యువతి కంగుతింది. తనకు కాబోయే భర్త చేసిన పని చూసి యువతి మైండ్​ బ్లాక్​ అయిపోయింది. ఆ ఫోన్​లో ఓ బాలిక నగ్న వీడియోలు ఉన్నాయి. దీంతో అరవింద్​ నిజస్వరూపం బయటపడింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది ఆ యువతి. దీంతో పెళ్లి రద్దు అయింది.

LoveToday Tamil cinema style cell phone exchange
నిందితుడు

ఆ తర్వాత తన బంధువుల సహాయంతో బాలిక తల్లిదండ్రులను కలిసింది. వారికి జరిగిన విషయాన్ని వివరించింది. అనంతరం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. అతడి ఫోన్లో ఇంకా ఇతర మహిళల వీడియోలు ఉన్నయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై వజిప్పాడి సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​ హరిషన్​గరి స్పందించారు. విద్యార్థులు తమ ఫోన్​ నంబర్లను ఫేస్​బుక్ లాంటి సామజిక మాధ్యమాల్లో షేర్​ చేయకూడదని సూచించారు. అప్పడే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడతామని చెప్పారు. ఇందుకు తాజాగా ఓ యువకుడి తప్పులు తెలుసుకుని ఓ యువతి పెళ్లిని రద్దు చేసుకుంది అనే విషయాన్ని ఉదహరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.