'సారీ అమ్మ, నాన్న.. అతడ్ని ప్రేమించా.. ఇక నా వల్ల కాదు'.. యువకుడి సూసైడ్ లెటర్

author img

By

Published : Jul 31, 2022, 6:25 PM IST

Updated : Jul 31, 2022, 7:08 PM IST

student suicide news

రాజస్థాన్​లోని కోటాలో స్వలింగ సంపర్క సమస్యలతో 16ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు.. స్నానం కోసం కుంటలో దిగిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి మరణించారు. ఈ దారుణ ఘటన అదే రాష్ట్రంలోని శ్రీగంగానగర్​లో జరిగింది.

స్వలింగ సంపర్క సమస్యలతో 16ఏళ్ల యవకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని కోటాలో జరిగింది. మధ్యప్రదేశ్​ ఛింద్వారాకు చెందిన ప్రథమ్​ జైన్​.. రాజస్థాన్​లోని కోటాలోని ఓ హాస్టల్​లో ఉంటూ ఐఐటీ శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే భవ్య అనే యువకుడిని ప్రేమించాడు. అతడి ప్రేమ విఫలం కావడం వల్ల సూసైడ్​నోట్​ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువు కోసం చాలా ఖర్చు పెట్టారని.. తనను క్షమించాలని కోరుతూ తల్లిదండ్రులకు లేఖ రాశాడు.

student suicide news
సూసైడ్​ నోట్​

"సారీ అమ్మ, నాన్న​. నేను జీవించడానికి అర్హుడిని కాను. నేను చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కావట్లేదు. మీ డబ్బును వృథా చేసినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు తమ్ముడి చదవు కోసం ఖర్చు పెడితే చాలు. నా ప్రేమ నిజమైనది. కానీ అది ఓ అబ్బాయితో జరిగింది. నేను భవ్యను ఎంతో ప్రేమిస్తున్నాను."

-లేఖలో ప్రథమ్​ జైన్​

పోలీసుల కథనం ప్రకారం.. ప్రథమ్​ జైన్​ రెండు నెలల కింద ఐఐటీ కోచింగ్​ కోసం కోటా వచ్చాడు. ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత స్నేహితులు కోచింగ్​కు వెళ్లగా అతడు మాత్రం​ గదిలోనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో తలుపు తట్టినా తెరవలేదు. నిద్రపోతున్నాడని భావించిన స్నేహితులు.. సాయంత్రం మళ్లీ వచ్చి పిలిచారు. అనుమానం వచ్చిన స్నేహితులు, హాస్టల్​ సిబ్బంది.. తలుపులు తెరిచి చూడగా.. ఉరివేసుకుని కనిపించాడు. సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షల​ అనంతరం మృతదేహాన్ని వారికి అందజేశారు.

తమిళనాడులో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు: తమిళనాడులో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత 2 వారాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా.. మరో ఇద్దరు తనువు చాలించారు. చెన్నైలో ఓ నర్సింగ్​ విద్యార్థిని, విల్లుపురంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు.

తమిళనాడు చెన్నైలో ఓ నర్సింగ్​ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తిరువేకాడులోని నర్సింగ్ కళాశాలలో​ రెండో ఏడాది చదువుతోంది ఆమె. కింద అంతస్తులో కళాశాల నిర్వహిస్తుండగా.. పై అంతస్తులో హాస్టల్​ను నడుపుతున్నారు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం కోసం పైకి వచ్చింది. భోజనం ముగిశాక.. తాను తర్వాత వస్తానని చెప్పి స్నేహితులను పంపించింది. చాలా సమయం గడిచినా రాకపోవడం వల్ల తోటి విద్యార్థులు వెళ్లి చూడగా.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వైఫల్యమా? కళాశాల యాజమాన్య వేధింపులా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

విల్లుపురంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యార్థిని తండ్రికి అనారోగ్య సమస్యలతో ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. అయితే తండ్రిని చూసేందుకు వస్తానని చెప్పగా.. తల్లి అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం.. ముండియామపక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

స్నానానికి కుంటలో దిగి ఐదుగురు చిన్నారలు మృతి: రాజస్థాన్ శ్రీగంగానగర్​లో దారుణ ఘటన జరిగింది. స్నానం కోసం కుంటలో దిగిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నారు. శ్రీగంగానగర్​ గ్రామ సమీపంలోని ఓ పొలంలో చిన్న కుంటను నిర్మించారు. ఆదివారం సెలవు కావడం వల్ల కుంట వద్దకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు.. లోతు గమనించకుండా దిగారు. దీంతో ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంటలోని నీటని ఖాళీ చేసి.. మృతదేహాలను వెలికి తీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతులను నిషా(13), రాధే(11) భావన(10), అంకిత్​(10), అన్షు(9)గా గుర్తించారు.

ఇవీ చదవండి: 'హక్కులు, విధులపై అవగాహనతోనే రాజ్యాంగబద్ధ అభివృద్ధి'

రెచ్చిపోయిన అమ్మాయిలు.. జుట్లు పట్టుకొని ఫైట్.. బాయ్​ఫ్రెండ్ కోసమేనా?

Last Updated :Jul 31, 2022, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.