'ఆ బర్త్​డే పార్టీ మనకు వార్నింగ్​ బెల్.. గెలుపు కష్టమే'.. షాతో యడ్డీ!

author img

By

Published : Aug 4, 2022, 6:32 PM IST

karnataka politics news

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సిద్ధరామయ్య 75వ బర్త్​డే పార్టీ వేదికగా కాంగ్రెస్​ ఐక్యతారాగం ఆలపించగా.. భాజపా అప్రమత్తమైంది. ఇదే విషయంపై తన అభిప్రాయాల్ని అగ్రనేత అమిత్​ షాకు మాజీ సీఎం యడియూరప్ప నిర్మొహమాటంగా చెప్పారని తెలిసింది.

Yediyurappa meets Amit Shah : కర్ణాటకలోని కాంగ్రెస్​ నేతలు ఐక్యతా సందేశం ఇచ్చేందుకు వేదికైన 'సిద్ధరామోత్సవ'ను భాజపా ఓ వార్నింగ్​ బెల్​లా పరిగణించాలన్నారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప. బెంగళూరు పర్యటనలో ఉన్న భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇదే విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోకపోతే రానున్న శాసనసభ ఎన్నికల్లో భాజపా మరోసారి గెలవడం కష్టమని అమిత్​ షాతో అన్నారు యడియూరప్ప.

'సిద్ధరామోత్సవ' సందర్భంగా కాంగ్రెస్​కు లభించిన ప్రజాదరణను యడ్డీ ప్రస్తావించినట్లు తెలిసింది. "ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టాలి. రాష్ట్ర పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ తర్వాత కర్ణాటకలో పర్యటనలపై దృష్టి పెట్టాలి" అని అమిత్ షాకు యడియూరప్ప చెప్పినట్లు సమాచారం.

Siddaramaiah birthday celebration : మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య 75వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సిద్ధరామోత్సవ పేరిట భారీ వేడుక నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. అగ్రనేత రాహుల్​ గాంధీ కూడా హాజరైన ఈ కార్యక్రమం వేదికగా.. ఐక్యతా సందేశం ఇచ్చారు. ముఖ్యంగా.. కర్ణాటక సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఆలింగనం చేసుకుని, ఒక్కటిగా ఉన్నామని సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షాను యడియూరప్ప అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

మోదీ పాలనలో సమ్మిళిత అభివృద్ధి
మరోవైపు.. భారత్​కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బెంగళూరులో 'సంకల్ప్ సే సిద్ధి' పేరిట సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్తబ్దత ఉండేదని విమర్శిస్తూ.. మోదీ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు. "8 ఏళ్ల పాలనలో మోదీ సమ్మిళిత అభివృద్ధి అందించారు. సంస్కరణలు చేపట్టని రంగమంటూ ఏదీ లేదు. యావత్ సమాజ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం." అని స్పష్టం చేశారు అమిత్ షా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.