కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే.. డిప్యూటీ సీఎంగా డీకే.. మే 20న ప్రమాణం!

author img

By

Published : May 17, 2023, 12:34 PM IST

Updated : May 18, 2023, 6:29 AM IST

karnataka new cm

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే! డిప్యూటీ సీఎంగా డీకే? రెండున్నరేళ్ల తర్వాత..

కర్ణాటక సీఎం పీఠంపై చిక్కుముడి వీడినట్లు తెలుస్తోంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అగ్రనేత సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన విస్తృత మంతనాల అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బెంగళూరులో మే 20న ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటుకు పార్టీ ఆదేశించింది. బెంగళూరులో గురువారం రాత్రి 7 గంటలకు సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సెంట్రల్ అబ్జర్వర్లు వెంటనే బెంగళూరుకు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది.

పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కర్ణాటక సీఎం పీఠం సిద్ధరామయ్యకే అప్పజెప్పేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటి వద్ద భద్రతను పోలీసులు మరింత పెంచారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బాధ్యతలు స్వీకరించునున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. బాణసంచా పేల్చి.. డ్యాన్స్​లు వేశారు. సిద్ధరామయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న కంఠీరవ స్టేడియంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

'ఇంకా చర్చలు జరుగుతున్నాయి'
అంతకుముందు.. కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయని ఆ పార్టీ కర్ణాటక ఇంఛార్జ్ రణ్​దీప్ సూర్జేవాలా తెలిపారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు తెలియజేస్తామని అన్నారు. మరో 48 నుంచి 72 గంటల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్ కొలువుతీరుతుందని చెప్పారు.

గురువారం సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఉదయం 11.30 సమయంలో రాహుల్ నివాసానికి వెళ్లిన సిద్ధరామయ్య.. చర్చల అనంతరం తాను బస చేసే హోటల్​కు తిరిగి చేరుకున్నారు. మరోవైపు, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్​ సైతం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సీఎం సీటుపై డీకే శివకుమార్​, సిద్ధరామయ్య.. రాహుల్​తో చర్చించినట్లు తెలుస్తోంది.

మంగళవారం సైతం ఇరువురు నేతలు కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య, శివకుమార్​ దిల్లీలో మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. అయినప్పటికీ సీఎం కుర్చీపై మంగళవారం ఎటువంటి ప్రకటన రాలేదు. రాహుల్‌గాంధీ సైతం మంగళవారం ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నరసేపు కొనసాగిన ఈ కీలక సమావేశంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శులు రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. పార్టీ పరిశీలకుల నివేదికపై ఖర్గే-రాహుల్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

'ఆ పార్టీలో అంతర్గత పరిస్థితి అలా ఉంది'
ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ఖరారు చేయకపోవడంపై కర్ణాటక ఆపద్ధర్మ సీఎం బసవరాజ్ బొమ్మై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా ఇంకా సీఎంను ఎంపిక చేయకపోవడం.. ఆ పార్టీలో అంతర్గత పరిస్థితికి అద్దంపడుతోందని విమర్శించారు. రాజకీయం కంటే ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని బొమ్మై తెలిపారు. కాంగ్రెస్ వీలైనంత త్వరగా సీఎంను ఎన్నుకోవాలని ఆయన సూచించారు.

Karnataka Election Results : 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్‌ 19 స్థానాలు గెలుపొందాయి.

Last Updated :May 18, 2023, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.