ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం- ఫుల్​ స్ట్రెంథ్​తో సుప్రీంకోర్టు!

author img

By

Published : May 9, 2022, 10:58 AM IST

Supreme Court

Supreme Court Judges: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్​ సుధాంశు ధులియా, జస్టిస్​ జంషెడ్​ బి.పర్దీవాలా ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ వారి చేత ప్రమాణం చేయించారు. వారి రాకతో సుప్రీం కోర్టులో పూర్తిస్థాయిలో న్యాయమూర్తుల నియామకం జరిగినట్లయింది.

Supreme Court Judges: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుధాంశు ధులియా, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జంషెడ్‌ బి.పర్దీవాలా ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ ప్రమాణం చేయించారు. వారి నియామకంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.

జస్టిస్‌ పర్దీవాలా భవిష్యత్తులో సీనియార్టీ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈయన గుజరాత్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ బర్జోర్జి పర్దీవాలా కుమారుడు. మైనార్టీ (పార్సీ) కమ్యూనిటీకి చెందిన న్యాయమూర్తికి పదోన్నతి లభించడం 5 ఏళ్ల విరామం తర్వాత ఇదే తొలిసారి. 2017 ఫిబ్రవరిలో చివరిసారిగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఆ అవకాశం దక్కింది.

ప్రస్తుత న్యాయమూర్తుల్లో సీనియారిటీపరంగా చివరన ఉన్న జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా 2027 అక్టోబర్‌లో సీజేఐగా బాధ్యతలు చేపట్టి 2028 మే 3వ తేదీ వరకు ఆ స్థానంలో కొనసాగుతారు. ఆ తర్వాత జస్టిస్‌ పర్దీవాలా ఆ స్థానంలోకి వచ్చి 2 ఏళ్ల మూడు నెలలు కొనసాగే అవకాశం ఉంది. కొలీజియం సిఫార్సు చేసిన జస్టిస్‌ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్‌ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రెండో వ్యక్తిగా నిలిచారు.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఆగస్టు 31వ తేదీన ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో సహా మొత్తం 9 మంది న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఈ రెండింటి నియామకాలతో ఆ సంఖ్య 11కి చేరింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో కూడిన కొలీజియం గత ఏడాదికాలంలో హైకోర్టులకు పది మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది. ఇందులో టాప్‌ 3తో కూడిన కొలీజియం వివిధ హైకోర్టులకు 180 పేర్లను సిఫార్సు చేసింది. అందులో 126 నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

2022లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మొత్తం ఏడుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఆ జాబితాలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణతోపాటు, ఆయన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా ఉన్నారు. ఇందులో జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ఇప్పటికే రావి-బియాస్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఇదీ చూడండి: ఆంగ్లేయులకు దిమ్మదిరిగే షాక్​ ఇచ్చిన స్వామి వివేకానంద!

'తాజ్​మహల్ స్మారకం కాదు​ శివాలయం.. 22గదుల్లో హిందూ దేవుళ్లు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.