మంచు కొండల్లో మోదీనే బ్రహ్మాస్త్రం.. భారమంతా ఆయనపైనే..!

author img

By

Published : Nov 11, 2022, 6:48 AM IST

Updated : Nov 11, 2022, 9:24 AM IST

himachal pradesh election

హిమాచల్​ప్రదేశ్​ ఎన్నికల్లో భాజపాకు మోదీనే బ్రహ్మస్త్రంగా కనిపిస్తున్నారు. ప్రతీ ఎన్నికలకు కొత్త ప్రభుత్వాన్ని మర్చే సాంప్రదాయం కలిగిన ఈ రాష్ట్రంలో భాజపా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గట్టిగానే పోటీ చేస్తుంది. దానికోసం మోదీనే స్వయంగా రంగంలోని దిగాల్సిన పరిస్థితి నెెలకొంది.

Himachal Pradesh Election 2022 : 'మీరెవ్వరినీ చూడాల్సిన అవసరం లేదు. పువ్వు గుర్తుకు వేయండి చాలు. ఆ ఓటు నాకు వేసినట్లే!'. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చేసిన అభ్యర్థన ఇది. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి చెమటోడ్చుతున్న భాజపా పరిస్థితికి అద్దం పడుతుందిది. ఓటర్లలో నరేంద్ర మోదీకున్న ఆదరణపైనే భాజపా అధికంగా ఆధారపడుతోంది. చూస్తుంటే పోటీ ఇక్కడ స్థానిక కాంగ్రెస్‌కు.. నరేంద్రమోదీకి అన్నట్లు మారింది.

రాష్ట్ర స్థాయిలో ఎంతో మంది నేతలున్నా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రమైనా.. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యత పూర్తిగా మోదీపైనే పడింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి- చారిత్రకంగా ఈ రాష్ట్రం ఎప్పుడూ కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవటం! రెండు- అధిక ధరలు, నిరుద్యోగం, ఉద్యోగుల పింఛను, యాపిల్‌ వ్యాపారుల సమస్యల్లాంటి సామాజిక అంశాలు బలంగా ప్రభావం చూపిస్తుండటం. వీటికితోడుగా పార్టీలో అంతర్గత సమస్యలు, నాయకుల మధ్య సమన్వయ లేమి, తిరుగుబాట్లు తలనొప్పిగా పరిణమించాయి. తిరుగుబాటు నేతలను సైతం నడ్డా ఒప్పించలేకపోయారు. కాంగ్రా జిల్లాలో ఓ తిరుగుబాటు నేతను ఒప్పించటానికి స్వయంగా మోదీయే రంగంలోకి దిగటం గమనార్హం. ఆ అభ్యర్థిని వైదొలగాలంటూ మోదీ అభ్యర్థించిన ఆడియో కాల్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. అలా తిరుగుబాటులతో పాటు విపక్షాలపైనా భాజపా తమ బ్రహ్మాస్త్రంగా ప్రధాని నరేంద్రమోదీనే నమ్ముకొంది. ఆయన కరిష్మాతో గట్టెక్కి.. చరిత్రను తిరగరాయాలనుకుంటోంది.

అందుకే.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భాజపా ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీయే సర్వాంతర్యామిగా కనిపిస్తున్నారు. స్థానిక పార్టీలోని ఇబ్బందులను అధిగమించటానికి ఆయన కూడా డబుల్‌ ఇంజిన్‌ నినాదాన్ని పదపదే వినిపించారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా భాజపా ప్రభుత్వం ఉంటేనే హిమాచల్‌ బాగుపడుతుందని.. సంప్రదాయాన్ని (ప్రభుత్వాలను మార్చే) మార్చి కొత్త సంప్రదాయాన్ని (నయా రివాజ్‌) సృష్టించాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై మరో అస్త్రాన్ని కమలనాథులు బలంగా ప్రయోగిస్తున్నారు. అది ముఖ్యమంత్రి అభ్యర్థి అస్త్రం! కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదంటూ.. దాదాపు 8 మంది ముఖ్యమంత్రులు ఆ పార్టీలో ఉన్నారా అని హోంమంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు.

మరి ఇంజిన్‌కు ఇప్పుడేమైంది?
బలమైన మోదీకి పోటీగా.. స్థానిక కాంగ్రెస్‌ నేతలే ఒంటరిపోరాటం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారానికి వచ్చినా అదంత ప్రభావం చూపే పరిస్థితి లేదు. చిన్న రాష్ట్రం కాబట్టి.. ఓటర్లతో వ్యక్తిగత సంబంధాలే కీలకమని గుర్తించిన కాంగ్రెస్‌ నేతలు ఆ దిశగా తమ ప్రచార వ్యూహాల్ని రచించారు. ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న ధరలు, నిరుద్యోగం గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. భాజపా సర్కారుపై వ్యతిరేకతను పెంచటానికి ప్రయత్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ మరణానంతరం నిజానికి హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో బలమైన నేత అంటూ లేకుండా పోయారు. పార్టీలో చాలామందే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ ఆశలు, ఆకాంక్షలను ప్రదర్శించి విభేదాలతో రోడ్డున పడకుండా జాగ్రత్త పడుతుండటం గమనార్హం! అంతా కలసి కట్టుగా ఉన్నట్లు కనిపిస్తూ.. కమలనాథుల డబుల్‌ ఇంజిన్‌ సర్కారు నినాదాన్ని వారు బలంగా తిప్పికొడుతున్నారు.

భాజపాకు ఓటు వేస్తే నరేంద్రమోదీ ఏమైనా వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిగా చేస్తారా? డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందంటూ భాజపా పరోక్షంగా ఓటర్లను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. ఇప్పటిదాకా హిమాచల్‌లో ఉన్నది డబుల్‌ ఇంజిన్‌ సర్కారే గదా! మరి ఎందుకని అభివృద్ధి చేయలేదు? ఎందుకని సమస్యలను పరిష్కరించట్లేదు? ఎందుకని పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించటం లేదు. ఇప్పుడు చేయకుండా.. మళ్లీ ఎన్నుకుంటే డబుల్‌ ఇంజిన్‌ పనిచేస్తుందంటే నమ్మటానికి ప్రజలు అమాయకులేమీ కాదు’’ అన్నది కాంగ్రెస్‌ నేతల వాదన.

Last Updated :Nov 11, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.