'బడిలో మత స్వేచ్ఛ ఉంటుందా?'.. హిజాబ్​ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్న

author img

By

Published : Sep 6, 2022, 7:43 AM IST

hijab supreme court

Hijab Supreme Court: ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే యూనిఫాం ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ హిజాబ్​ ధరించొచ్చా అనేది ఇక్కడ ప్రశ్న అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై జరిగిన వాదనల్లో పై వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు తమకు దేశంలో వైద్య విద్య కొనసాగించే అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Hijab Supreme Court: ప్రతి వ్యక్తికీ మత స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నిర్దిష్ట ఏకరూప దుస్తులు ధరించాలనే నిబంధన ఉన్న పాఠశాలల్లోనూ మత స్వేచ్ఛను వినియోగించుకోవచ్చా లేదా అన్నదే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న అని పేర్కొంది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్శు ధూలియాలతో కూడిన ధర్మాసనం సోమవారం వాదనలు ఆలకించింది.

"ప్రతిఒక్కరికీ మత హక్కు ఉంటుంది. ఏం ఆచరించాలనుకుంటే దాన్ని ఆచరించొచ్చు. కానీ నిర్దిష్ట ఏకరూప దుస్తులనే ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ విద్యార్థులు హజాబ్‌ ధరించొచ్చా అన్నదే ఇక్కడ ప్రశ్న" అని కొందరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సంజయ్‌ హెగ్డేను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. హిజాబ్‌ ధారణను నిషేధిస్తే.. చాలామంది మహిళలకు విద్యను నిరాకరించినట్లే అవుతుందన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.

"కర్ణాటక ప్రభుత్వం ఏ హక్కునూ కాదనట్లేదు. నిర్దేశిత ఏకరూప దుస్తుల్లో విద్యాసంస్థలకు రావాలని మాత్రమే చెబుతోంది" అని పేర్కొంది. మరోవైపు- ప్రస్తుత వ్యవహారం కేవలం విద్యాసంస్థల్లో క్రమశిక్షణకు సంబంధించినదేనని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కె.ఎం.నటరాజ్‌ వ్యాఖ్యానించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. "ఒక బాలిక హిజాబ్‌ ధరిస్తే బడిలో క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఎలా అవుతుంది?" అని ప్రశ్నించింది. "హిజాబ్‌ ధరించే హక్కు తనకు ఉందని.. కాబట్టి పాఠశాలలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తానని మతాచారం/మతస్వేచ్ఛ ముసుగులో చెప్పడం సరికాదు" అంటూ ఏఎస్‌జీ బదులిచ్చారు. ఈ కేసులో తదుపరి వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.

వైద్య విద్య కోసం..
"ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశంలోని వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ.. లోక్‌సభ కమిటీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు నివేదించింది. దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది" అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు తెలియజేశారు.

ఉక్రెయిన్‌ నుంచి వెనక్కి వచ్చిన తమకు దేశంలో వైద్య విద్య కొనసాగించే అవకాశం కల్పించాలంటూ వైద్య విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాంశు ధూలియాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే.. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం నుంచి సూచనలు పొందేందుకు తనకు మరికొంత గడువు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి: రాహుల్​ గాంధీని కలిసిన బిహార్​ ముఖ్యమంత్రి.. దాని గురించే చర్చ!

'నన్ను ఇరికించాలని చూశారు.. ఆ ఒత్తిడితోనే సీబీఐ అధికారి సూసైడ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.