వ్యాపిస్తున్న హాంకాంగ్​ ఫ్లూ.. పుదుచ్చేరిలో పాఠశాలలు బంద్​

author img

By

Published : Mar 15, 2023, 3:58 PM IST

Updated : Mar 15, 2023, 4:31 PM IST

puducherry government declared holidays to schools due to virus

హంకాంగ్​ ఫ్లూగా పిలుస్తున్న హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సెలువులు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.

దేశాన్ని మరో కొత్త వైరస్​ కలవరపెడుతోంది. హంకాంగ్​ ఫ్లూగా పిలిచే హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవలే ఈ వైరస్​ బారిన పడి కర్ణాటక, హరియాణా, గుజరాత్​ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి రాష్ట్ర సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సెలువులు మంజూరు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్​ వ్యాప్తి దృష్ట్యా పది రోజులపాటు విద్యార్థులకు సెలవులు ఇచ్చింది. ఈ సెలవులు మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఉంటాయని ఆదేశాల్లో పేర్కొంది.

పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా వైరస్​ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. హెచ్​3ఎన్​2 వైరస్​ కేసుల సంఖ్య పెరిగితే గనుక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు తగిన వైద్య సిబ్బందితో పాటు మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు ప్రత్యేకించి ఇన్​ఫ్లుయెంజా వైరస్​ సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఇందుకోసమే ముందు జగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులకు సెలవులు ఇచ్చామని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఇన్​ఫ్లుయెంజా వైరస్​ సోకితే మాత్రం జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతునొప్పి, అలసట వంటి ప్రధానమైన లక్షణాలను గమనించవచ్చు. దీంతో వచ్చే జ్వరం 5 నుంచి 7 రోజుల వరకు ఉంటుందని.. కాగా, దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఇబ్బంది పెడుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వైరస్​తో ప్రస్తుతానికి పెద్ద ముప్పేమి లేనప్పటికీ జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్​ సోకిన వారు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్​ఆర్​), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశంలో 451 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది.

117 రోజుల తర్వాత.. 600కి పైగా కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అత్యధికంగా 618 పాజిటివ్​ కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4,197 కొవిడ్​ యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే వైరస్​ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇద్దరు చొప్పున, ఉత్తరాఖండ్‌లో ఒకరు ఉన్నారు. దీంతో మరణాల సంఖ్య 5,30,789కి చేరిందని అధికారులు వెల్లడించారు.

గతేడాది నవంబర్ 18న దేశంలో 656 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో 117 రోజుల తర్వాత ఒక్కరోజే 600కి పైగా కేసులు రావడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 4,46,91,956, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. వైరస్​ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 4,41,56,970కి పెరిగింది. కొవిడ్​ మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.64 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లను పంపిణీ చేశారు.

Last Updated :Mar 15, 2023, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.