ఆదివాసీల ఓట్లపైనే పార్టీల గురి.. భాజపాకు ఈసారైనా మద్దతు లభించేనా?

author img

By

Published : Nov 19, 2022, 9:22 AM IST

Updated : Nov 19, 2022, 9:35 AM IST

gujarat election 2022

Gujarat Election 2022 : గుజరాత్​లో గత రెండున్నర దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న భాజపా.. ఆదివాసీల ఓట్లను సంపాదించడంలో వెనకబడే ఉంది. అయితే ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి కాంగ్రెస్‌, భాజపా, ఆమ్‌ ఆద్మీలు చెమటోడుస్తున్నాయి.

Gujarat Election 2022 : రెండున్నర దశాబ్దాలకుపైగా గుజరాత్‌లో అధికారం చలాయిస్తున్నా.. భారతీయ జనతాపార్టీ ఒక విషయంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అది అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు, సీట్లు గెల్చుకోవటంలో! గుజరాత్‌లో అన్ని పార్టీలనూ ఆకర్షిస్తున్న వర్గం ఆదివాసీలు! రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆదివాసీల ఓట్లు సంపాదించటానికి కాంగ్రెస్‌, భాజపా, ఆమ్‌ ఆద్మీలు చెమటోడుస్తున్నాయి. కారణం గ్రామీణ ప్రాంతాల్లోని అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న ఆదివాసీల ఓట్లే కీలకం!

గుజరాత్‌లో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌ పార్టీ వైపే ఇప్పటిదాకా మొగ్గు చూపుతూ వస్తున్నారు. అధికారాన్ని అందుకోలేకపోతున్నా.. ఆదివాసీల ఓట్లు, సీట్లను మాత్రం కాంగ్రెసే ఎక్కువగా సాధిస్తోంది. 2017 ఎన్నికల్లో 27 రిజర్వ్‌డ్‌ సీట్లకుగాను కాంగ్రెస్‌ 15 గెల్చుకోగా.. భాజపా ఎనిమిదింటిలో మాత్రమే నెగ్గింది. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచీ ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతూనే ఉంది. 'గతంలో మా ప్రభుత్వాలు ఇచ్చిన అటవీ ఉత్పత్తులపై హక్కు, ఇతర అభివృద్ధి పనులకు విశ్వాసంతో ఆదివాసీలు మాతోనే ఉంటున్నారు. ఇక ముందు కూడా ఉంటారు' అని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తంజేస్తున్నారు. అసెంబ్లీలో విపక్ష నేత పదవిని కూడా.. జేత్‌పుర్‌ ఎమ్మెల్యే ఆదివాసీ నేత సుఖ్‌రామ్‌ రాత్వాకు కాంగ్రెస్‌ అప్పగించింది.

ఈసారి ఎలాగైనా ఆదివాసీలపై కాంగ్రెస్‌ పట్టును దెబ్బతీయాలని భాజపాతో పాటు కొత్తగా బరిలోకి దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా బలంగా ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదే ఈ ప్రాంతాల్లో పర్యటించారు. భాజపా ఇటీవలే ఈ ప్రాంతాల్లో గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర చేపట్టింది. "ఈసారి మేం 27 సీట్లకుగాను 20 గెల్చుకోబోతున్నాం. ఆదివాసీల్లో కూడా మోదీపట్ల ఆదరణ పెరిగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాకతో కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోబోతున్నాయి" అని గుజరాత్‌ ఆదివాసీ అభివృద్ధి శాఖ మంత్రి నరేశ్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కంటే కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న ఆదివాసీలు లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి భాజపాకే మద్దతిస్తుండటం విశేషం.

గుజరాత్‌లో సంచలనం సృష్టించాలని చూస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కొత్త పుంతలు తొక్కుతోంది. పట్టణ ప్రాంత ఓటర్ల పార్టీగా ఉన్న పేరుతో పాటు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టిసారించింది. అందులో భాగంగా.. అందరికంటే ముందు ఆదివాసీల ఓట్లకు గురిపెట్టింది. ఆదివాసీల్లో బలమైన భారతీయ ట్రైబల్‌ పార్టీతో చర్చలు మొదలెట్టింది. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ తన మాటలతో ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నింటికి మించి భాజపా, కాంగ్రెస్‌లో మరచిపోయిన.. పంచాయతీ (షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ) చట్టాన్ని (పీఈఎస్‌ఏ) కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. 1996లో ఆమోదం పొందిన పీఈఎస్‌ఏ ఆధారంగా.. షెడ్యూల్‌ ప్రాంతాల్లోని ప్రజలకు గ్రామ సభల ద్వారా స్వయం పరిపాలన హక్కు లభిస్తుంది. ఈ హామీ తమకు ఆదివాసీ ఓట్లు తెచ్చిపెడుతుందన్నది ఆప్‌ నమ్మకం.

ఆదివాసీల సీట్లు

ఆదివాసీ ప్రాధాన్యం..
దేశంలో ఆదివాసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ది ఐదోస్థానం. రాష్ట్ర జనాభాలో ఏడోవంతు. ముఖ్యంగా రాజస్థాన్‌, మహారాష్ట్రల సరిహద్దుల్లోని 14 జిల్లాల్లో వారే ఎక్కువగా ఉంటారు. 48 తాలుకాల్లో వీరి ప్రభావం ఎక్కువ. వీరిలో భిల్లులదే అత్యధిక సంఖ్య.

  • 182 సీట్ల అసెంబ్లీలో ఎస్టీలకు కేటాయించిన సీట్లు 27
  • 47 అసెంబ్లీ సీట్లలో ఎస్టీ ఓటర్లు 10శాతం పైనే.
  • 40 సీట్లలో 20% పైగా; 31 అసెంబ్లీ సీట్లలో 30% పైగా ఎస్టీ ఓటర్లు ఉన్నారు.
Last Updated :Nov 19, 2022, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.