కంపెనీలకు షాక్​! సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. రూ.500 కోట్లు జరిమానా

author img

By

Published : Nov 18, 2022, 5:49 PM IST

Digital Personal Data Protection Bill 2022

డిజిటల్‌ వేదికల్లో పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించే క్రమంలో మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డేటా ప్రొటెక్షన్‌ బిల్లుకు సవరణలు చేసి త్వరలోనే కొత్తగా బిల్లును తీసుకురానుంది. సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. జరిమానాను రూ.500కోట్ల వరకు పెంచుతూ తాజా ముసాయిదాలో ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి 'డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు' పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ఈ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ముసాయిదా బిల్లు ప్రకారం, చట్టంలోని నిబంధనలు పాటించడంలో విఫలమైతే గరిష్ఠంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఉల్లంఘన తీరును బట్టి ఇది మారనుంది. కంపెనీలు సేకరించే వ్యక్తిగత సమాచారం స్థానికంగానే నిల్వచేయడం, నిల్వ చేసే కాలపరిమితి, మునుపటి సమాచారాన్ని తొలగించడం వంటి అంశాలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు కోసం 'డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా'ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ముసాయిదా బిల్లు డిసెంబర్‌ 17 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ వేదికల్లో చోటుచేసుకునే సమాచార ఉల్లంఘనలను నియంత్రించేందుకు గానూ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2019లోనే తీసుకువచ్చింది. సమాచార ఉల్లంఘనకు పాల్పడే సంస్థకు రూ.15కోట్లు లేదా సంస్థ టర్నోవర్‌లో 4శాతం జరిమానా విధిస్తామని పేర్కొంది. అయితే, దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. పరిశీలించిన జేపీసీ.. 80కిపైగా సూచనలు చేసింది. దీంతో గత వర్షాకాల సమావేశాల్లో దాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. సవరణలతో కొత్త బిల్లును తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.