పుట్టినరోజు నాడే మృత్యుఒడికి.. ఆడుకుంటూ నీళ్ల తొట్టిలో పడిన చిన్నారి..

author img

By

Published : Mar 13, 2023, 10:12 PM IST

2 year girl falled in water tub on her birthday in up

బర్త్​డే రోజే ప్రాణాలు కోల్పోయింది రెండేళ్ల చిన్నారి. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడి చిన్నారి ప్రాణాలు కోల్పోవడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు.. బిహార్​లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉత్తర్​ప్రదేశ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. తన బర్త్​డే నాడే రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అసలేం జరిగిందంటే.. గ్రేటర్​ నోయిడా పరిధిలోని దుజానా గ్రామానికి చెందిన సాక్షి(2) అనే చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి ప్రాణాలు విడిచింది. కాగా, అదే రోజు చిన్నారి జన్మదినం కావడం వల్ల ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చిన్నారి తన అన్నయ్యతో ఆడుకుంటుండగా కుటుంబ సభ్యులు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో అక్కడే బట్టలు ఉతికేందుకు ఏర్పాటు చేసిన ఓ నీళ్ల తొట్టి​లో బాలిక పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.

దుజానా గ్రామానికి చెందిన చంద్రపాల్​కు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మృతురాలు సాక్షియే చివరి సంతానం. మార్చి 12న చిన్నారి ఇంట్లోనే ఉత్సాహంగా ఆడుకుంది. కాగా.. సాక్షి తండ్రి చంద్రపాల్ కేక్​ తేవడం కోసం బయటకు వెళ్లాడు. సాక్షి దగ్గర తన నాలుగేళ్ల కుమారుడిని వదిలి వెళ్లాడు. కాగా, చెల్లి ఆడుకుంటుందని అన్న కూడా ఆడుకునేందుకు పక్కకు వెళ్లాడు. ఈ క్రమంలోనే సాక్షి ప్రమాదవశాత్తు నీళ్లున్న తొట్టిలో పడి మరణించింది.

13 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య..
మూడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్ రాజధాని పట్నా​లోని కుమ్హర్ టోలి ప్రాంతంలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుపస్​పుర్​ గ్రామానికి చెందిన బాలుడు నవోదయ అకాడమీ రెసిడెన్షియల్​ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో బాలుడు అన్నయ్య 4వ తరగతి చదువుతున్నాడు. కాగా, వీరిద్దరూ ప్రభుత్వ నవోదయ విద్యాలయ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నారు.

బాలిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో పాఠశాల యాజమాన్యంతో పాటు తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసే తమ బిడ్డను హత్య చేశారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు విచారణ పూర్తయిన తర్వాతే ఇది హత్యా.. ఆత్మహత్యా అనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.