స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

author img

By

Published : Nov 25, 2022, 1:20 PM IST

Updated : Nov 25, 2022, 3:45 PM IST

homosexuals Moves Supreme Court

స్వలింగ సంపర్కుల వివాహానికి గుర్తింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి​పై నాలుగు వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తించాలంటూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. నాలుగు వారాల్లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసుల వివరాలను చెప్పాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్​, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ​.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్​కు చెందిన అభయ్​ దాంగ్​, సుప్రియో చక్రవర్తి జంట ఒక పిటిషన్​ దాఖలు చేయగా.. పార్థ్​ ఫిరోజ్​, ఉదయ్​ రాజ్​ అనే మరో స్వలింగ సంపర్కుల జంట ఈ పిటిషన్​ దాఖలు చేసింది. ఒకే లింగానికి చెందిన ఇద్దరి వివాహానికి గుర్తింపు ఇవ్వకపోవడం.. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14, 21 కింద సమానత్వ హక్కును ఉల్లఘించడమేనని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్లు. ఈ పిల్​పై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్​ కోరారు.

దిల్లీ హైకోర్టులో సంబంధిత కేసు పెండింగ్​లో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దిల్లీ హైకోర్టులో ఈ కేసు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. ఇది చాలా ముఖ్యమైన అంశమని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ కేసు ప్రభావం చూపుతుందని అన్నారు. దిల్లీ హైకోర్టులో వాదనలు ఎంతవరకు పూర్తయ్యాయో కూడా తనకు తెలియలేదని ఆయన ధర్మాసనానికి చెప్పారు. తక్షణమే విచారణ చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. స్పందించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

Last Updated :Nov 25, 2022, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.