సరిహద్దులో కలకలం.. ఆయుధాలు జారవిడిచిన డ్రోన్.. చైనా పిస్తోళ్లు, భారీగా నగదు

author img

By

Published : Nov 24, 2022, 2:13 PM IST

Drone dropped weapon recovery

జమ్ముకశ్మీర్​లోని సాంబా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఓ డ్రోన్ ఆయుధాలు జారవిడిచిన ఘటన కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆయుధాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో విజయపుర్ సమీపంలోని పొలాల్లో నియంత్రణ రేఖ వద్ద ఓ డ్రోన్.. ఆయుధాలు జారవిడిచింది. అనుమానాస్పద ప్యాకెట్ చూసి అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్​ను పరిశీలించిన పోలీసులు అనుమానంతో బాంబు నిర్వీర్య దళాలను రంగంలోకి దించి.. తనిఖీ చేయించారు.

Drone dropped weapon recovery
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

ఆ ప్యాకెట్‌లో ఐఈడీ డిటోనేటర్లు, రెండు చైనా తయారీ పిస్తోళ్లు, 4 లోడెడ్‌ మ్యాగజైన్లు, ఒక బ్యాటరీ, 5 లక్షల రూపాయల విలువైన నగదు కట్టలు దొరికాయి. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో పాకిస్థాన్‌ నుంచి వచ్చిన డ్రోన్‌ వీటిని జారవిడిచి తిరిగి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో తీవ్రవాదుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Drone dropped weapon recovery
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

"ఈ సరుకులను స్టీల్ బేస్‌తో కూడిన చెక్క పెట్టెలో కప్పి ఉంచాం. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభిస్తున్నాం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులకు, పోలీసు బృందానికి అభినందనలు. వీరికి రివార్డు ప్రకటిస్తాం" అని సీనియర్​ పోలీసు అధికారి అభిషేక్ మహాజన్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.