సిసోదియా మెడపై ఈడీ కత్తి.. జైలులోనే విచారణ.. కరుడుగట్టిన నేరస్థుల మధ్యే..

author img

By

Published : Mar 7, 2023, 11:30 AM IST

delhi-liquor-policy-case ed manish

ఆప్ నేత మనీశ్ సిసోదియా ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. జైలులో ఆయన్ను ప్రశ్నించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరోవైపు, జైలులో సిసోదియా పక్క గదుల్లో కరుడుగట్టిన నేరస్థులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఆప్ నేత మనీశ్ సిసోదియాను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించనుంది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న ఆయనను ప్రశ్నించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పత్రాలు తీసుకున్నట్లు వెల్లడించారు. మనీలాండరింగ్​కు సంబంధించిన అంశాలపై ఆయనను ప్రశ్నిస్తామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్​మెంట్ రికార్డు చేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

లిక్కర్ స్కామ్ కేసులో సిసోదియాను సీబీఐ గత నెల చివర్లో అరెస్టు చేసింది. రెండు దఫాలుగా సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మార్చి 20 వరకు ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే, తిహాడ్ జైలులో ఆయన ఏకాంతంగానే ఉన్నారని జైలులోని పోలీసు వర్గాలు తెలిపాయి. సిసోదియాతో ఎవరూ గదిని పంచుకోవడం లేదని స్పష్టం చేశాయి. సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొన్నాయి.

"తిహాడ్ జైలులోని వార్డు నెంబర్ 9లో సిసోదియా ఉన్నారు. చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. త్వరలోనే ఆయన్ను మరో ఖైదీ ఉన్న గదిలోకి మారుస్తారు. ఆయన జైలు గదికి పక్కనే ఉన్న గదుల్లో కరుడుగట్టిన నేరస్థులు ఉన్నారు. సోమవారం ఇక్కడికి రాగానే ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. రిపోర్టులన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఆయనకు పేస్ట్, సబ్బు, బ్రష్​తో కూడిన కిట్ ఇచ్చాం. షెడ్యూల్ ప్రకారమే డిన్నర్ చేశారు. సాయంత్రం ఆరు, ఏడున్నర ప్రాంతంలో చపాతి, అన్నం, ఆలూ కర్రీ తిన్నారు."
-జైలు వర్గాలు

పిళ్లై అరెస్ట్..
మరోవైపు, ఇదే కేసులో ఈడీ అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. హైదరాబాద్​కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం సోమవారం సాయంత్రం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇది పదకొండో అరెస్టు కావడం గమనార్హం. కేసులో ప్రధానంగా వినిపిస్తున్న 'సౌత్​ గ్రూప్​' వ్యాపారుల బృందానికి ఈయన ప్రతినిధిగా ఉన్నారు. ఆయన్ను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ తెలిపింది. కస్టడీకి అప్పగించాలని కోరనున్నట్లు వెల్లడించింది.

ఇదీ కేసు..
దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. మద్యం తయారీదారులు, రిటైల్, టోకు వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీ రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ. మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయకుముందే.. ఆ డాక్యుమెంట్ వ్యాపారుల వాట్సాప్ గ్రూప్​లలో ప్రత్యక్షమైందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు, ఇదే కేసులో మనీలాండరింగ్​కు సంబంధించిన ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.