137 ఏళ్లలో మూడు సార్లే అధ్యక్ష ఎన్నికలు.. ఈసారి సరికొత్త లెక్క.. పార్టీ పరిస్థితి మారేనా?

author img

By

Published : Sep 25, 2022, 6:41 PM IST

congress president election

Congress President Election : దేశాన్ని సుదీర్ఘ కాలం ఏలిన కాంగ్రెస్‌ పార్టీ.. అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైంది. 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ పరిణామం కాంగ్రెస్ గతిని మారుస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి స్వాతంత్ర్య అనంతరం కేవలం మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా ఏకాభిప్రాయంతోనే అధ్యక్ష ఎన్నిక జరగాలని సీనియర్‌ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.

Congress President Election : ఓ వైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీనియర్ల రాజీనామాలు, వరుస ఓటములతో చతికిల పడ్డ 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. స్వాత్రంత్ర అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష స్థానానికి.. ఇప్పటివరకు మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నిక నాలుగోది కానుంది.

1950లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బలపరిచిన ఆచార్య కృపలానీపై పురుషోత్తమ్ దాస్ టాండన్ విజయం సాధించారు. కృపలానీకి 1,092 ఓట్లు రాగా.. టాండన్‌కు 1,306 ఓట్లు వచ్చాయి. దీని తర్వాత 47 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ఏకాభిప్రాయంతోనే ఎన్నుకున్నారు. 1997లో కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి శరద్ పవార్​, రాజేశ్ పైలట్​, సీతారాం కేసరి పోటీ చేశారు. వీరి ముగ్గురిలో సీతారం కేసరి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శరద్‌ పవార్‌కు 882, రాజేశ్‌ పైలట్‌కు 354 ఓట్లు రాగా, సీతారం కేసరికి 6,224 ఓట్లు వచ్చాయి. అనంతరం 2000వ సంవత్సరంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మూడోసారి ఎన్నికలు జరిగాయి. ఈ సారి సోనియాగాంధీపై పోటీ చేసిన జీతేంద్ర ప్రసాద్ ఘోరంగా ఓడిపోయారు. సోనియాకు 7,400 ఓట్లురాగా.. ప్రసాదకు 94 ఓట్లు మాత్రమే వచ్చాయి. అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా సుదీర్ఘకాలం పనిచేశారు.

రాహుల్‌ గాంధీ 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగినా అనంతరం రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్‌కు ఇప్పటివరకూ 16 మంది నాయకత్వం వహించారు. అందులో ఐదుగురు గాంధీ కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. మొత్తం 40 ఏళ్ల పాటు గాంధీ కుటుంబం కాంగ్రెస్‌కు సారథ్యం వహించింది.

ఈసారి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి బహు ముఖ పోరు ఉండడంతో ఓటింగ్‌ అనివార్యం కానుంది. రాజస్థాన్‌ సీఎం అశోక్ గహ్లోత్‌, ఎంపీ శశిథరూర్‌.. సహా పలువురు సీనియర్లు అధ్యక్ష పీఠంపై కన్నేశారు. అక్టోబర్‌ 17న జరిగే ఓటింగ్‌తో కాంగ్రెస్‌ పార్టీకి 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కానున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్‌ గహ్లోత్‌కు గాంధీ కుటుంబం మద్దతు ఇస్తుందా లేక తటస్థంగా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. శశిధరూర్‌, అశోక్‌ గహ్లోత్‌ బరిలో నిలిచినందున.. 17వ తేదీన తప్పకుండా ఎన్నికలు జరుగుతాయని జైరాం రమేష్‌ తెలిపారు.

ఇవీ చదవండి: 'థర్డ్​ ఫ్రంట్​ లేదు.. కాంగ్రెస్​తో కలిసి ఒకటే కూటమి'.. తేల్చేసిన నీతీశ్

భాజపాకన్నా 2 రెట్లు ఎక్కువ ఖర్చు.. ఫలితం శూన్యం.. పీకే స్కెచ్​తో దీదీకి బిగ్ లాస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.