రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. 'ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్ నడుపుతున్నారా?'

author img

By

Published : Jun 20, 2022, 5:47 PM IST

Updated : Jun 20, 2022, 6:54 PM IST

CONGRESS PREZ meet

Congress leaders President meet: కాంగ్రెస్ సీనియర్ నేతలు ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలిశారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఎంపీలపై పోలీసుల దాడులు, అగ్నిపథ్ స్కీమ్ వంటి అంశాలపై రాష్ట్రపతికి నేతలు ఫిర్యాదు చేశారు.

Congress leaders Kovind: కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలిశారు. రాహుల్ గాంధీపై ఈడీ విచారణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కాంగ్రెస్ ఎంపీలపై దిల్లీ పోలీసులు దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అగ్నిపథ్ వల్ల యువతకు, దేశ భద్రతకు నష్టం అంటూ.. దీనిపైనా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, సీనియర్ నేతలు చిదంబరం, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్.. రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్నారు.

అగ్నిపథ్ పథకం గురించి ఏ కమిటీతోనూ ప్రభుత్వం చర్చించలేదని, పార్లమెంట్​లోనూ బిల్ ప్రవేశపెట్టలేదని రాష్ట్రపతితో చెప్పినట్లు మల్లికార్జున ఖర్గే వివరించారు. ప్రజాస్వామ్య హక్కులకు ఇది విఘాతం కలిగిస్తుందని తెలియజేశామని అన్నారు. రాష్ట్రపతికి సమర్పించిన రెండో మెమొరాండంలో కాంగ్రెస్ నేతలపై పోలీసుల దౌర్జన్యాల గురించి ప్రస్తావించినట్లు చిదంబరం తెలిపారు. దీనిపై విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. 'ఈ సమస్యను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వద్దకు పంపించేలా చూడాలని రాష్ట్రపతిని అభ్యర్థించాం. మేం మావైపు వాదనలు వినిపిస్తాం. దిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ వారి వాదనలు వినిపిస్తాయి. దీనిపై కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమస్యపై దృష్టిసారిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు' అని చిదంబరం వివరించారు.

రాష్ట్రపతిని కలవడానికి ముందు కాంగ్రెస్ ఎంపీలు అత్యవసర సమావేశం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ఎంపీలు భేటీ అయ్యారు. అగ్నిపథ్, రాహుల్ ఈడీ విచారణలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం, పార్లమెంట్ హౌస్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్!
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఫెయిర్ అండ్ లవ్లీ పథకం నడుపుతోందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఎద్దేవా చేశారు. విపక్షంలో ఉంటేనే నేరస్థులని.. భాజపాలో చేరినవారంతా స్వచ్ఛంగా తయారవుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఈడీ, సీబీఐ తమ కార్యాలయాల్లో ఫెయిర్ అండ్ లవ్లీ బాక్సును ఉంచుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని రాజకీయ నేతల్ని బలవంతం చేస్తున్నారు. ఇందుకు వారు ఒప్పుకుంటే ఆ క్రీమ్​ను నేతలకు రాస్తారు. అంతే వారు క్లీన్​గా తయారవుతారు. బీఎస్ యడియూరప్ప, నారాయణ రాణెపై ఈడీ ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. చివరకు ముకుల్ రాయ్ సైతం క్రీమ్ పూసిన తర్వాత క్లీన్​గా మారిపోయారు. ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై దాడులు చేసేందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటున్నారు. రాహుల్ గాంధీని 30 గంటల పాటు ప్రశ్నించారు. కాంగ్రెస్​పై ఒత్తిడి పెంచి, మా గొంతుల్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ పేదల కోసం మాట్లాడుతున్నందునే ఇలా చేస్తున్నారు. మొత్తం 5,422 కేసుల్లో 5,310 కేసులు ఈడీ వద్ద పెండింగ్​లో ఉన్నాయి. ఇవన్నీ గత ఎనిమిదేళ్లలో నమోదు చేసినవే. దీన్నిబట్టి ప్రభుత్వం విపక్షాలపై ఎలా ఒత్తిడి పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు' అని మాకెన్ విమర్శలు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Jun 20, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.