YS Viveka Murder Case: అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. నేటి ఉదయం 11 గంటలకు విచారణ

author img

By

Published : May 15, 2023, 5:11 PM IST

Updated : May 16, 2023, 6:34 AM IST

cbi

17:06 May 15

నేడు విచారణకు హాజరుకావాలని నోటీసు

వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు

CBI Notices to YS Avinash Reddy: YS వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇవాళ సీబీఐ మరోసారి విచారించనుంది. సోమవారం ఆయనకు సీఆర్పీసీ 160 కింద నోటీసు జారీ చేసిన సీబీఐ.. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి వేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ జూన్‌ 5వ తేదీకి వాయిదా పడింది.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీబీఐ: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై గత నెల 25న సీబీఐ వేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో పలు అభియోగాలను, ఆధారాలను.... సీబీఐ వెల్లడించింది. అరెస్ట్‌ చేయకుండా కొన్నిరోజులు ఆపాలని అవినాష్‌రెడ్డి న్యాయవాదులు అభ్యర్థించినా... సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయినప్పటికీ 20 రోజుల పాటు సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి జోలికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

వివేకా కేసులో తన ప్రమేయం లేదని, కేవలం దస్తగిరి వాంగ్మూలం ప్రకారమే తనను ఇరికించారని కడప ఎంపీ వాదిస్తున్నారు. కానీ దస్తగిరి వాంగ్మూలమే కాకుండా... అవినాష్‌ రెడ్డి ప్రమేయం, కుట్రకు సంబంధించిన ఇతర ఆధారాలు కూడా ఉన్నాయని తెలియజేస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్య స్థలంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం, గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది.

హైదరాబాద్‌ నుంచి కుటుంబ సభ్యులు రాకముందే హడావుడిగా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని తెలిపింది. వివేకా హత్య జరిగిన విషయం 2019 మార్చి 15న ఉదయం 6గంటల15 నిమిషాలకే బాహ్య ప్రపంచానికి తెలిస్తే... ఆ రోజు తెల్లవారుజామున మూడున్నరకే అవినాష్‌రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌రెడ్డికి తెలుసని సీబీఐ వెల్లడించింది. ఉదయమే అవినాష్‌రెడ్డి ఇంట్లో ఆయనతోపాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని... మూడో వ్యక్తి ద్వారా వివేకా చనిపోయిన సమాచారం వస్తే సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు ధ్వంసం చేయాలనే కుట్ర పన్నారని తెలిపింది.

నిందితులతో అవినాష్​ రెడ్డి కుమ్మక్కు!: 2019 మార్చి 14న నిందితుడు దస్తగిరి గొడ్డలి కొనుగోలు చేయడానికి కదిరికి వెళ్తే... ఆ సమయంలో అతని కోసం ఏ-2 సునీల్‌యాదవ్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లో వేచి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. హత్యకు ముందు రోజు 14 సార్లు సునీల్‌యాదవ్‌ అవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని... హత్య చేసిన మరుసటి రోజు కూడా అతను... అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉదయం 7గంటల 24 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 12 నిమిషాల వరకు 18 సార్లు ఉన్నట్లు మొబైల్‌ లోకేషన్‌ చూపించిందని తెలిపింది. ఇదంతా గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా గుర్తించామని సీబీఐ పేర్కొంది. 15వ తేదీ తెల్లవారుజామున వివేకాను హత్య చేసిన తర్వాత 1గంట 58 నిమిషాలకు కూడా సునీల్‌యాదవ్‌... అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని తెలిపింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే అవినాష్‌రెడ్డి నిందితులతో కుమ్కక్కయ్యారనే అనుమానాలు ఉన్నాయని తెలిపింది..

ఆ వివరాలు అవినాష్​ విచారణతోనే సాధ్యం: నిందితులు వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఇంతవరకు లభ్యం కాలేదని.. అది ఎక్కడుందనేది తెలియాలంటే కడప ఎంపీని విచారించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. మార్చి 15వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సునీల్‌యాదవ్‌ 1 గంట 58 నిమిషాలకు అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నాడనే వివరాలను సేకరించాల్సి ఉందని పేర్కొంది. హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరికి పంపిణీ చేసిన 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను అవినాష్‌రెడ్డి ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ భావిస్తోంది.

అవినాష్​ విచారణపై తీవ్ర ఉత్కంఠ: అవినాష్‌కు, సునీల్‌యాదవ్‌కు ఉన్న సంబంధాలు.. వివేకా హత్యకు ముందు, తర్వాత ఎందుకు సునీల్‌యాదవ్‌... అవినాష్‌రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నాడనే విషయాలను కస్టడీలో తెలుసుకోవాల్సి ఉందని తెలిపింది. దీంతోపాటు అవినాష్‌, గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి మధ్య సంబంధాలు... హత్యకు ముందు తర్వాత రోజు ఎందుకు ఉదయ్‌కుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడనే వివరాలు తెలియాలంది. కల్లూరు గంగాధర్‌రెడ్డి చెప్పిన విధంగా 10 కోట్ల రూపాయల అంశం కూడా తేలాల్సి ఉందని, న్యాయవాది ఓబుల్‌రెడ్డి, భరత్‌యాదవ్‌లు ఎందుకు దస్తగిరిని కలిశారనే విషయాలు అవినాష్‌రెడ్డి ద్వారా వెల్లడి కావాల్సి ఉందని... ఇవన్నీ తెలియాలంటే అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని సీబీఐ తెలిపింది.

అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు న్యాయస్థానాలు కూడా అభ్యంతరాలు చెప్పని పక్షంలో.. ఇవాళ సీబీఐ విచారణలో కీలక పరిణామాలు జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉండి తాజా పరిణామాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

Last Updated :May 16, 2023, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.