ముస్లింలపై భాజపా 'పస్మాందా' మంత్రం!.. హ్యాట్రిక్​ విజయమే లక్ష్యంగా

author img

By

Published : Jan 21, 2023, 7:50 AM IST

bjp trying to get pasmanda muslim votes in next assembly elections

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా భాజపా కొత్త వ్యూహాలను పన్నుతుంది. ఓటర్లను తమ వైపునకు ఆకర్షించడానికి సకల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా పస్మాందా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పస్మాందాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా భాజపా ఈసారి ముస్లిం ఓటర్లనూ ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భాజపా నోట బలంగా వినిపిస్తున్న మాట.. 'పస్మాందా'! ఇటీవల భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పస్మాందా ముస్లింలపై దృష్టి సారించాలని, వారి మద్దతు పొందే ప్రయత్నం చేయాలంటూ పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఇంతకూ ఈ పస్మాందా ముస్లింలు ఎవరు? భాజపా వీరినే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది?

పస్మాందా అనేది పర్షియన్‌ పదం. విడిచిపెట్టినవారనేది దీని అర్థం. ముస్లింలలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారిని ఇలా పిలుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ముస్లింలలోని ఓబీసీ, దళిత వర్గాలు ఈ పస్మాందాలు. రాజ్యసభ మాజీ సభ్యుడు అలీ అన్వర్‌ అన్సారీ తొలిసారిగా 1998లో 'పస్మాందా ముస్లిం మహాజ్‌' అనే సంస్థను స్థాపించి ఈ పదాన్ని విస్తృతంగా వాడుకలోకి తెచ్చారు. ముస్లింలలోని సంపన్నవర్గానికి పోటీగా ఇది అస్తిత్వంలోకి వచ్చింది. ముస్లింలకు అంతో ఇంతో లభించే ప్రభుత్వ, ఇతరత్రా ప్రయోజనాలన్నింటినీ తమలోని సంపన్నులే పొందుతున్నారనేది పస్మాందాల ఆక్షేపణ. పార్టీల ‘మైనార్టీ రాజకీయాల’తో తమకెలాంటి లాభం చేకూరటం లేదని, తమ సంఖ్యను చూపి సంపన్న ముస్లింలే లబ్ధి పొందుతున్నారన్నది వీరి ఆరోపణ.

ఎక్కడ.. ఎంతమంది?
2005లో జస్టిస్‌ సచార్‌ కమిటీ అష్రఫ్‌లను ఎలాంటి సామాజిక ఇబ్బందుల్లేనివారిగా గుర్తించింది. అజ్లఫ్‌లను హిందువుల్లో ఓబీసీల్లాంటి వారిగా, అర్జల్‌లను హిందువుల్లో ఎస్సీలతో పోల్చింది. భారత ముస్లింలలో ఈ అజ్లఫ్‌ - అర్జల్‌ వర్గాల జనాభా 40 శాతానికి పైగా ఉంటుందని సచార్‌ కమిటీ భావించింది. అయితే.. తమ జనాభా 80 శాతం దాకా ఉందని పస్మాందా ముస్లిం ఉద్యమకారులు, విద్యావేత్తలు అంటుంటారు. ఈ అజ్లఫ్‌, అర్జల్‌లు పస్మాందా పేరుతో ఒకే గొడుగు కిందికి వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, బెంగాల్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో వీరి సంఖ్య ఎక్కువ. మొత్తం మీద భారత ముస్లింలలో పస్మాందాలు 70-80 శాతం దాకా ఉంటారనేది మహాజ్‌ అంచనా. "ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఉన్నా.. అన్ని రాష్ట్రాల్లో మా పస్మాందా ముస్లింలు భారీస్థాయిలో ఉంటారు. ముస్లింలకు లభించే ప్రయోజనాల్లో పస్మాందాలకు దక్కేది తక్కువే" అన్నది అలీ అన్వర్‌ అన్సారీ వాదన. కులగణన చేపట్టి తమకూ హిందువుల్లా రిజర్వేషన్లు కల్పించాలని చాలాకాలంగా పస్మాందాలు కోరుతున్నారు. ప్రస్తుతం వీరు ఓబీసీ రిజర్వేషన్లు పొందుతున్నారు.

యూపీ వ్యూహాన్నే..
2014 నుంచీ ముస్లింలలో వెనుకబడిన పస్మాందాలను ఆకట్టుకోడానికి భాజపా కసరత్తు ఆరంభించింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఆ దిశగా విజయం సాధించింది కూడా. యూపీలో యోగీ ప్రభుత్వంలో మైనార్టీ వ్యవహారాల శాఖను పస్మాందా వర్గానికి చెందిన దానిష్‌ ఆజాద్‌ అన్సారీకి అప్పగించారు. యూపీ, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పస్మాందాల మద్దతు కూడా తమ విజయంలో భాగమైందని భాజపా భావిస్తోంది. ఇదే వ్యూహాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది కమలనాథుల ఆలోచన. అందుకే అన్ని రాష్ట్రాల్లోని పస్మాందా ముస్లింలపై భాజపా ఇప్పుడు కన్నేస్తోంది.

అష్రఫ్‌... అజ్లఫ్‌... అర్జల్‌
భారత్‌లో ముస్లింలను ప్రధానంగా మూడు తరగతులుగా వర్గీకరిస్తారు. ఒకటి- అష్రఫ్‌లు (గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న సంపన్న ముస్లింలు), రెండు- అజ్లఫ్‌లు (వెనుకబడిన ముస్లింలు.. హిందువుల్లో ఓబీసీల మాదిరి), మూడోవర్గం అర్జల్‌ (దళిత ముస్లింలు).

  • అష్రఫ్‌: అరేబియా, పర్షియా, తుర్కియే, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చిన సయ్యద్‌, షేక్‌, మొగల్‌, పఠాన్‌ ముస్లింలతోపాటు.. హిందూయిజం లోంచి మతం మారిన రాజ్‌పుత్‌ ముస్లింలు, గౌర్‌ ముస్లింలు, త్యాగి ముస్లింలు అందరినీ అష్రఫ్‌లుగా పరిగణిస్తారు.
  • అజ్లఫ్‌: సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడ్డవారు ఈ వర్గం కిందికి వస్తారు. ముఖ్యంగా చేనేత, దర్జీ (కుట్టు), కూరగాయల అమ్మకం తదితర వృత్తులపై ఆధారపడి బతికేవారు.
  • అర్జల్‌: ఈ వర్గాన్ని 1901 జనగణనలో తొలిసారి గుర్తించారు. ఒకరకంగా ముస్లింలలో వీరిని అంటరానివారిగా పరిగణించేవారు. ఫకీర్లు, ధోబీలు, నాయీలు, హలాల్‌ చేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు ఈ వర్గం కిందికి వస్తారు.

"సమాజంలోని అన్ని వర్గాలవారికీ మన పార్టీ దగ్గరవ్వాలి. ముస్లిం మైనార్టీలకు కూడా. ముఖ్యంగా పస్మాందా ముస్లింలపై దృష్టి సారించండి..!"

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇవీ చదవండి:

బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు.. ఏడుగురు సభ్యులతో IOA కమిటీ..

క్రిమినల్​ కేసుల్లో వేసే ఛార్జ్​షీట్‌ను ఆన్‌లైన్​లో అందుబాటులో ఉంచలేం: సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.