'పేపర్ లీక్ మా వైఫల్యమే.. తప్పు నాదే'.. సీఎం కీలక ప్రకటన

author img

By

Published : Mar 16, 2023, 2:02 PM IST

Updated : Mar 16, 2023, 2:22 PM IST

assam paper leak

ప్రశ్నాపత్రం లీక్​పై స్పందించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. క్వశ్చన్ పేపర్ లీక్ కావడం తమ వైఫల్యమేనని, తప్పు అంగీకరిస్తున్నానని ప్రకటించారు.

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకవడం తమ వైఫల్యాన్ని తెలియజేస్తోందని అన్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. తప్పు జరిగిందని తాను అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించామని గురువారం వెల్లడించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉపాధ్యాయుల పాత్ర ఉందని తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్​పై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.

అసోంలో పదో తరగతి పరీక్షా పేపర్​ లీకైంది. సోమవారం (మార్చి 13) జరగాల్సిన జనరల్​ సైన్స్​ క్వశ్చన్​ పేపర్.. ఆదివారం రాత్రే బయటకు వచ్చినట్లు అసోం బోర్డ్ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్(సెబా) అధికారులు గుర్తించారు. వెంటనే పరీక్ష రద్దు చేశారు. మార్చి 30న జనరల్ సైన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

పేపర్​ లీక్​పై సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. వాట్సాప్​లో పేపర్ లీక్ చేశారని.. ప్రశ్నాపత్రం ఇచ్చేందుకు రూ.3000 వరకు వసూలు చేశారని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు.

"జనరల్ సైన్స్​ క్వశ్చన్​ పేపర్​ను రూ.100 నుంచి రూ.3000 వరకు అమ్మారని మా దర్యాప్తులో తెలిసింది. కొన్నిచోట్ల ప్రశ్నాపత్రాన్ని రూ.100కే ఇచ్చారు. మరికొన్ని చోట్ల రూ.200-300కు విక్రయించారు. కొన్నిచోట్ల రూ.3000 వరకు వసూలు చేశారు. పేపర్​ లీక్ ఎక్కడ నుంచి జరిగిందో తెలుసుకునేందుకు వాట్సాప్ సహకారం తీసుకుంటున్నాం. గత మూడు రోజులుగా దర్యాప్తు సాగుతున్న తీరు సంతృప్తికరంగా ఉంది. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తాం." అని తెలిపారు అసోం డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్.

25 మంది అరెస్ట్​..
పేపర్ లీక్​ ఘటనలో మొత్తం 12 మంది విద్యార్థుల సహా 25 మందిని బుధవారం.. పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కొందరు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. బాలనేరస్థులను స్టేట్ హోంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతావారిని మూడు రోజుల పోలీసుల కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు.

పేపర్ లీక్ మూలాలను కనుగొనేందుకు సీఐడీ దర్యాప్తు జరుపుతోందని అసోం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగూ తెలిపారు. పేపర్ లీక్​కు కారణమైన 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు. మరోవైపు.. పేపర్ లీక్ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ గేటు ముందు కాసేపు నిరసనలు చేపట్టింది. పేపర్ లీక్ వ్యవహారంలో నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేసింది.

Last Updated :Mar 16, 2023, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.