'అగ్నిపథ్'​పై విపక్షాలు భగ్గు.. 'ఆర్మీ అధికారులతో ఆ పని చేయిస్తారా?'

author img

By

Published : Jun 20, 2022, 3:53 PM IST

agnipath scheme

అగ్నిపథ్ స్కీమ్​పై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యువత పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, దీనికి ప్రధానమంత్రే కారణమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాన్ని సమర్థించేందుకు తొలిసారి ఆర్మీ ఉన్నతాధికారులను ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మరోవైపు, విపక్షాలే నిరసనలను ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. నిరసన చేస్తున్నవారిలో 90 శాతం మంది ఆర్మీలో చేరేందుకు అనర్హులని అన్నారు.

Agnipath scheme controversy: దేశంలో యువత పరిస్థితి దిగజారడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి.. యువతను నిరుద్యోగం అనే నిప్పుల మార్గంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్ స్కీమ్​ను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టగా.. వారి సందేశాలను ఆ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్​ షేర్ చేసింది.

ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని వెనకేసుకురావడానికి ఆర్మీ అధిపతులను ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారని అన్నారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఖర్గే ప్రశ్నించారు. అగ్నిపథ్ గురించి ముందుగా యువతతో చర్చించాలని మరో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. లేదా పార్లమెంట్​లో ప్రస్తావన తీసుకురావాలని అన్నారు. అంతకంటే ముందు ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Agnipath
జంతర్​మంతర్​లో ఖర్గే, సీఎంలు గహ్లోత్, బఘేల్

Mamata Banerjee on Agnipath: మరోవైపు, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నూతన రిక్రూట్​మెంట్ విధానం ద్వారా కమలదళం సొంత సాయుధ కేడర్​ను రూపొందించుకునేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ విధానం భద్రతా దళాలకే అవమానకరమైనదిగా అభివర్ణించారు. "అగ్నివీరులను పార్టీ ఆఫీసులకు వాచ్​మెన్​లుగా తీసుకుంటారా?" అని ఎద్దేవా చేశారు. "నాలుగేళ్ల తర్వాత వారు ఏం చేస్తారు? యువత చేతుల్లో ఆ పార్టీ(భాజపా) ఆయుధాలు పెట్టాలని అనుకుంటోంది. 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారు" అని అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు మమత.

Mayawati Agnipath Tweet: అగ్నిపథ్ స్కీమ్​ను తొందరపాటులో తీసుకొచ్చారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. అన్నివర్గాల నుంచి దీనిపై వ్యతిరేకత వస్తోందని పేర్కొన్నారు. "నోట్ల రద్దు, లాక్​డౌన్ మాదిరిగానే దీన్ని కూడా ఆగమేఘాల మీద తీసుకొచ్చారు. కోట్లాది మంది యువతపై దీని ప్రభావం ఉంది. ఇలాంటి అహంకారపూరిత స్వభావాన్ని ప్రభుత్వం మానుకోవాలి. భాజపా నేతలు చేస్తున్న అనియంత్రిత ప్రకటనలు, చిల్లర రాజకీయాల కోసం ప్రజల్లో గందరగోళం సృష్టించడం వల్ల ఆర్మీకే నష్టం" అని మాయావతి అన్నారు.

Agnipath scheme Akhilesh: ఇదే విషయంపై ట్వీట్ చేసిన సమాజ్​వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్.. యువత తమ భవిష్యత్​పై ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. 'ఇది దేశాభివృద్ధికి ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మెరుగుపర్చడం ప్రభుత్వ బాధ్యత. అన్నివర్గాల నుంచి వస్తున్న విమర్శలు భాజపా తన మద్దతును కోల్పోతోందని స్పష్టం చేస్తున్నాయి' అని చెప్పారు.

Agnipath Pralhad Joshi: మరోవైపు, విపక్షాల వాదనలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొట్టిపారేశారు. నిరసనకారులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విపక్షాలే నిరసనలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. 'ఇలాంటి వ్యవస్థ చాలా దేశాల్లో ఉంది. అనేక పరిశోధనలు దీనిపై గతంలో జరిగాయి. ఆర్మీ అధికారులు, నిపుణులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే దీన్ని అమలు చేస్తున్నాం. చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేద్దాం. ఎవరితో చర్చించకుండా దీన్ని అమలు చేస్తున్నామనడం సరికాదు. హింసాత్మక నిరసనలు చేసి దీన్ని వ్యతిరేకించడం తప్పు. విపక్ష పార్టీల అబద్ధాలే ఇందుకు కారణం. కేంద్రం ఏ పనిచేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. నిరసన చేస్తున్నవారిలో 90 శాతం మంది ఆర్మీలో చేరేందుకు అర్హులు కాదు' అని జోషి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.