ఆప్ వర్సెస్ గవర్నర్​.. మరింత ముదిరిన వివాదం.. ప్రభుత్వ కార్యాలయానికి ఎల్‌జీ సీల్‌

author img

By

Published : Nov 18, 2022, 3:03 PM IST

aap vs delhi lg

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్​, ఆప్​ మధ్య విభేదాలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ డీడీసీబీ వైస్‌ ఛైర్మన్్​ ఆంక్షలు విధించారు దిల్లీ గవర్నర్ వీకే సక్సేనా . ఈ ఘటనపై ఆప్ ఏమందంటే?

దిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య విభేదాలు నానాటికీ ముదురుతున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ దిల్లీ ప్రభుత్వ మేధో సంస్థ డైలాగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ ఆఫ్‌ దిల్లీ (డీడీసీడీ) వైస్‌ ఛైర్మన్‌ జాస్మిన్‌ షా విధులు నిర్వర్తించకుండా ఎల్‌జీ వీకే సక్సేనా ఆంక్షలు విధించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాల మేరకు షా కార్యాలయాన్ని సీల్‌ చేశారు.

డీడీసీడీ వైస్‌ ఛైర్మన్‌ షా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తూ, రాజకీయ ఉద్దేశాలతో తన ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై భాజపా ఎంపీ పర్వేశ్ వర్మ ఎల్‌జీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఆరోపణలపై స్పందించాలంటూ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కానీ, రెండు సార్లు అవకాశాలిచ్చినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఈ నోటీసులకు గానూ జాస్మిన్‌ షా తన సమాధానాన్ని ప్రణాళిక విభాగ డైరెక్టరుకు బదులుగా ఆ శాఖ మంత్రికి సమర్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో షా స్పందన తెలుసుకునేందుకు ఎల్‌జీ ఆఫీసు.. ఈ నెల 4న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ఈ లేఖకు సీఎం ఆఫీసు నుంచి ఇప్పటివరకు సమాధానం రాకపోవడం వల్ల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డీడీసీడీ వైస్‌ఛైర్మన్‌ షా తన బాధ్యతలు నిర్వర్తించకుండా ఆయనపై ఆంక్షలు విధిస్తూ ఎల్‌జీ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు కేటాయించిన సిబ్బందితో పాటు ఇతర సదుపాయాలను ఉపసంహరిస్తున్నట్లు ఎల్‌జీ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు గురువారం రాత్రి జాస్మిన్‌ షా కార్యాలయాన్ని సీల్‌ చేశారు. షాను పదవి నుంచి తొలగించాలని ఎల్‌జీ సక్సేనా.. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆదేశించారు.

ఈ పరిణామాలతో ఎల్‌జీ.. ఆమ్‌ ఆద్మీ సర్కారు మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజా పరిణామాలపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. "ఆప్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై జాస్మిన్‌ కార్యాలయాన్ని ఎల్‌జీ లాక్‌ చేయించారు. మరి ఐటీడీసీ ఛైర్మన్‌గా ఉన్న సాంబిత్‌ పత్రా భాజపా అధికార ప్రతినిధి కదా. ఆయన కార్యాలయాన్ని ఎందుకు సీల్‌ చేయట్లేదు?" అని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.