సరూర్‌నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..

సరూర్‌నగర్ తరహాలో మరో పరువు హత్య.. మతాంతర ప్రేమ వల్లే..
Honour killing in Gujarat: సరూర్‌నగర్ తరహా పరువు హత్య కేసు గుజరాత్లో కలకలం రేపింది. చెల్లి ప్రేమించిన వ్యక్తిని కొట్టి చంపాడు నిందితుడు సాకిర్. దీంతో యువతి ఆత్మహత్యకు యత్నించింది.
Gujarat honour killing: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను మరవక ముందే.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇదే తరహా ఉదంతం జరిగింది. 22 ఏళ్ల యువకుడి ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే.. మిథున్ ఠాకూర్ (22) అనే యువకుడు సుమియా కాడివార్ (18) అనే ముస్లిం యువతిని ప్రేమించాడు.
Muslim Honour killing: వీరిద్దరూ కొన్ని నెలల నుంచి రిలేషన్ షిప్లో ఉన్నారు. బిహార్‌కు చెందిన మిథున్.. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ప్రేమలో పూర్తిగా మునిగితేలిన ఈ జంట.. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయం సుమియా ఇంట్లో తెలిసింది. సోమవారం ఉదయం మిథున్ ఠాకూర్.. సుమియాకు ఫోన్ చేయగా.. ఆమె సోదరుడు సాకిర్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే మిథున్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఫోన్లోనే గొడవ పడ్డారు.
ఈ క్రమంలోనే సుమియా సోదరుడు సాకిర్.. మిథున్‌పై దాడి చేశాడు. అతడి ఇంటికి వెళ్లి దారుణంగా కొట్టాడు. దీంతో మిథున్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. గాయాలు తీవ్రంగా ఉండటం, తలకు గట్టి దెబ్బ తగలడం వల్ల మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు మిథున్.
మిథున్ మరణ వార్త వినగానే అతడి ప్రేయసి సుమియా ఆత్మహత్యకు యత్నించింది. బ్లేడుతో చెయ్యిని కోసుకుంది. ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ నేపథ్యంలో మిథున్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాకిర్ను అరెస్టు చేశారు. అతడికి సహకరించిన మరొక వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. మిథున్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
