ఈ ఏడాదంతా మీరు ఏం చేశారు?- చాట్‌జీపీటీ మీ చరిత్రంతా చెప్పేస్తుంది!
"యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ"- ఈ ఏడాదంతా మీరు ఏం చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు!

Published : December 23, 2025 at 4:32 PM IST
Hyderabad: మరికొన్ని రోజుల్లో 2025 ముగుస్తోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు టెక్ దిగ్గజం ఓపెన్ఏఐ "యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ" విడుదలను ప్రకటించింది. ఇది వినియోగదారులు ఈ ఏడాదంతా చాట్‌జీపీటీతో ఏం సంభాషించారు? ఎలా ఉపయోగించారు? అనే అంశాలను రీక్యాప్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఇది వారి సంభాషణల నుంచి ఉన్నత స్థాయి థీమ్‌లను అలాగే సంవత్సరంలో వాటి వినియోగం గురించి సారాంశ గణాంకాలను హైలైట్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, చాట్‌జీపీటీ ఇయర్-ఎండ్ రివ్యూ వినియోగదారులు తాము అన్వేషించిన అంశాల సారాంశాన్ని, వారు తరచుగా అడిగిన ప్రశ్నలను, వారి శోధన విధానాలన్నింటినీ చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సమాచారం కార్డుల వంటి ఫార్మాట్లో లభిస్తుంది. దీనిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు.
ఈ "యువర్ ఇయర్ విత్ చాట్‌జీపీటీ" ఫీచర్ క్రమంగా విడుదల అవుతోంది. కాబట్టి ఇది అందరికీ చేరడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇది ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఇంగ్లిషులో అందుబాటులో ఉంది. అయితే భారతదేశంలోని చాలా మంది వినియోగదారులకు కూడా ఈ ఫీచర్‌కు యాక్సెస్ లభించింది.
ఈ ఎక్స్పీరియన్స్ బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ లేదా ఎడ్యుకేషన్ ప్లాన్ల వినియోగదారులకు తప్ప మిగిలినవారంతా పొందొచ్చు. అంటే చాట్‌జీపీటీ ప్లస్, ప్రో పాటు ఉచిత వినియోగదారులు తమ 2025 రీక్యాప్‌ను చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఆప్షనల్ ఫీచర్ వారి మెమరీ, రిఫరెన్స్ చాట్ హిస్టరీని ఆన్‌లో ఉంచుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని ఓపెన్ఏఐ చెబుతోంది. ఎందుకంటే మీరు ఏడాది పొడవునా AI చాట్‌బాట్‌ను ఎలా ఉపయోగించారో సంగ్రహించడానికి చాట్‌జీపీటీ మీ చాట్ హిస్టరీని ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ మీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత అది చాట్‌జీపీటీ యాప్, వెబ్‌లో ఒక బ్యానర్ మాదిరిగా కనిపిస్తుంది. ప్రత్యామ్నాయంగా మీరు హోమ్‌పేజీలోని ప్లస్ ఐకాన్ (+) పై క్లిక్ చేసి, అక్కడ కన్పిస్తున్న "Your Year with ChatGPT" అనే ఎంపికను ఎంచుకుని వినియోగించుకోవచ్చు.

