ETV Bharat / technology

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్: గ్రూప్ చాట్స్‌లో సరికొత్త ఫీచర్లు!

గ్రూప్ చాట్స్‌ను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. స్మార్టర్ పోల్స్, ఒక్క ట్యాప్‌తో కొత్త గ్రూప్ క్రియేషన్, అందరినీ అలర్ట్ చేసే '@all' ఫీచర్లను అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp Upgrades Group Chats: Introduces Smarter Polls, @all Mentions and Instant Group Creation
WhatsApp Upgrades Group Chats: Introduces Smarter Polls, @all Mentions and Instant Group Creation (Photo Credit- WhatsApp Blog)
author img

By ETV Bharat Tech Team

Published : August 5, 2026 at 11:32 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం గ్రూప్ చాట్స్‌ను మరింత సులభతరం చేస్తూ సరికొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. గ్రూప్‌లలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి 'పోల్స్' (Polls) విభాగంలో కీలక మార్పులు చేయడంతో పాటు, అందరినీ ఒకేసారి అలర్ట్ చేసే '@all' మెన్షన్ ఫీచర్‌ను కంపెనీ అధికారికంగా పరిచయం చేసింది.

పోల్స్‌లో మూడు సరికొత్త మార్పులు: గ్రూప్ సభ్యుల అభిప్రాయాలను సులభంగా సేకరించే పోల్స్ ఫీచర్‌లో వాట్సాప్ మూడు సరికొత్త మెరుగుదలలు చేసింది.

  • ఓటింగ్‌కు గడువు: ఇకపై పోల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఓటింగ్ ముగిసే సమయాన్ని (End Time) లాక్ చేసుకోవచ్చు. ఆ సమయం ముగియగానే ఓటింగ్ ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది.
  • గోప్యత: గ్రూప్‌లోని సభ్యులు ఎలాంటి మొహమాటం లేకుండా తమ అభిప్రాయాన్ని పంచుకునేలా, ఓటు వేసిన వారి పేర్లను దాచిపెట్టే (Hide Voter Names) సదుపాయాన్ని కల్పించారు.
  • పోల్ ఎడిట్: ఒకవేళ పోల్ క్రియేట్ చేసిన తర్వాత ఏవైనా తప్పులు దొర్లితే, వాటిని సరిచేసుకోవడానికి 15 నిమిషాల లోపు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని అందించారు.

అందరినీ అలర్ట్ చేసే '@all' ఫీచర్: గ్రూప్‌లో ఏదైనా ముఖ్యమైన లేదా అత్యవసర సమాచారాన్ని చేరవేయడానికి ఇకపై ఒక్కొక్కరిని ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం '@all' అని టైప్ చేస్తే చాలు, గ్రూప్‌లోని సభ్యులందరికీ ఒకేసారి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆఫీస్, స్కూల్ సెలవుల సమాచారం లేదా లాస్ట్ మినిట్ ప్లాన్స్ వంటి అత్యవసర విషయాలను చేరవేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, 32 మంది కంటే ఎక్కువ ఉన్న పెద్ద గ్రూప్‌లలో ఈ '@all' ఫీచర్ కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మరో కీలక విషయం ఏంటంటే, గ్రూప్‌ను 'మ్యూట్' (Mute) లో పెట్టినప్పటికీ, ఎవరైనా '@all' అని మెన్షన్ చేసినప్పుడు వినియోగదారులకు నోటిఫికేషన్లు అందుతాయి. అయితే, ఈ నోటిఫికేషన్లపై పూర్తి నియంత్రణ యూజర్ల చేతిలోనే ఉంటుంది. తమకు నచ్చిన విధంగా నోటిఫికేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఈ '@all' అలర్ట్‌లను ఎప్పుడైనా మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ కల్పించింది.

ఇంతకుముందు ఈ ఫీచర్ కేవలం కొంతమంది బీటా టెస్టర్లకు, కొన్ని దేశాల్లోని యూజర్లకు లేదా కొన్ని నిర్దిష్ట గ్రూపులకు మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉండేది. ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ (Stable Version) అధికారికంగా విడుదల చేశారు.

మరిన్ని గ్రూప్‌లను సులభంగా క్రియేట్ చేసే సదుపాయం: ఒక గ్రూప్‌లో ఉన్న సభ్యులతోనే మరో కొత్త గ్రూప్‌ను క్రియేట్ చేయాలనుకుంటే, ఇకపై ఒక్కొక్కరిని విడివిడిగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క ట్యాప్‌తో పాత గ్రూప్ సభ్యులతోనే సరికొత్త గ్రూప్ చాట్‌ను ప్రారంభించవచ్చు. మెయిన్ గ్రూప్‌లో అనవసరమైన మెసేజ్‌లు పెట్టకుండా.. సర్ప్రైజ్ పార్టీలు ప్లాన్ చేయడానికి, ఈవెంట్ ఏర్పాట్ల గురించి చర్చించడానికి లేదా ఏదైనా ఒక నిర్దిష్ట విషయంపై ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

గ్రూప్ చాట్స్‌లో నిరంతర అప్‌డేట్స్: వాట్సాప్ ఈ ఏడాది ఇప్పటికే గ్రూప్ మెసేజ్ హిస్టరీ, మెంబర్ ట్యాగ్స్, ఈవెంట్ రిమైండర్స్ వంటి అధునాతన ఫీచర్లను గ్రూప్ చాట్స్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు అదే ఊపుతో స్మార్టర్ పోల్స్, '@all' మెన్షన్స్, అలాగే వేగంగా గ్రూప్ క్రియేట్ చేసే ఫీచర్లను కూడా తోడు చేసింది.