ETV Bharat / technology

DPDP యాక్ట్ ఎఫెక్ట్: భారత్‌లో వాట్సాప్ 'ఏజ్-వెరిఫికేషన్' టెస్టింగ్ షురూ- రిపోర్ట్

త్వరలో అమలులోకి రానున్న DPDP చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా, వాట్సాప్ భారతదేశంలో ఓ ఆప్షనల్ వయో నిర్ధారణ (Age Verification) ఫీచర్‌ను పరీక్షిస్తోందని సమాచారం.

Representational Image
Representational Image (Image Credit: IANS)
author img

By ETV Bharat Tech Team

Published : August 8, 2026 at 2:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ 'వాట్సాప్' (WhatsApp) భారతదేశంలో ఒక సరికొత్త ఆప్షనల్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించిందని ఓ నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు తమ పుట్టిన తేదీని (Date of Birth) యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. దేశంలో త్వరలో అమల్లోకి రానున్న 'డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్' (DPDP) చట్టంలోని వయో నిర్ధారణ (Age Verification) నిబంధనలకు అనుగుణంగా వాట్సాప్ ఈ ముందస్తు చర్యలు చేపడుతోందని తెలుస్తోంది.

భారతదేశంలో రాబోయే చట్టాల ప్రకారం ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల వయస్సును అడగాల్సి ఉంటుందని పేర్కొంటూ.. 'యాడ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్' (Add your date of birth) అనే ప్రాంప్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు బయటకు రావడంతో, పరిమిత సంఖ్యలో వినియోగదారులతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ ధృవీకరించిందని ఎన్డీటీవీ ప్రాఫిట్ (NDTV Profit) నివేదించింది.

ఇంకా ఆ నివేదిక తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి:

"డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్ వంటి భారతదేశంలో రాబోయే చట్టాలకు అనుగుణంగా, ప్రజలు తమ వయస్సును ధృవీకరించుకోవడానికి గోప్యతను కాపాడే మార్గాలను మేము పరీక్షిస్తున్నాము" అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆప్షనల్ మాత్రమే; కాబట్టి టెస్టింగ్ దశలో ఈ మెసేజింగ్ సేవను ఉపయోగించడం కొనసాగించడానికి వినియోగదారులు తమ పుట్టిన తేదీని అందించాల్సిన అవసరం లేదు.

"దీనివల్ల వాట్సాప్ పనితీరులో గానీ, వినియోగదారుల అనుభవంలో గానీ ఎలాంటి మార్పు ఉండదు. వయస్సుకి సంబంధించిన సమాచారం అత్యంత గోప్యమైనదని మాకు తెలుసు, కాబట్టి ఈ వివరాలు ఇతర వాట్సాప్ వినియోగదారులతో పంచుకోబోము" అని ఆ ప్రతినిధి పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.

పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే ప్లాట్‌ఫారమ్‌లు.. వినియోగదారుల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ ఉందో లేదో తెలుసుకోవడానికి వయస్సు ధృవీకరణ చర్యలు చేపట్టాలని డీపీడీపీ (DPDP) చట్టం నిర్దేశిస్తోంది. భారతదేశం ఈ నిబంధనలను త్వరలో అమలు చేయనున్న తరుణంలోనే వాట్సాప్ ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.

భారతదేశంలో మెటా (Meta) కార్యకలాపాలపై నియంత్రణ సంస్థల (రెగ్యులేటరీ) నిఘా, పరిశీలన తీవ్రమైన సమయంలోనే ఈ టెస్టింగ్ కూడా జరుగుతోంది. ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినందుకు ఈ వారం ప్రారంభంలోనే మెటా క్షమాపణలు చెప్పింది.

మరోవైపు, మొబైల్ నంబర్ పంచుకోకుండానే చాట్ చేసుకునేందుకు వీలు కల్పించే 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను ప్రస్తుతానికి వాయిదా వేయాలని వాట్సాప్‌ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. నకిలీ ఖాతాలు (ఇంపర్సనేషన్), డిజిటల్ మోసాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఫీచర్‌ను హోల్డ్​లో పెట్టాలని సూచించింది.