ETV Bharat / technology

సిమ్ బైండింగ్ ఫీచర్​పై వాట్సాప్ కసరత్తు- అందుబాటులోకి ఎప్పుడంటే?

DoT ఆదేశాల మేరకు భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ సిమ్ బైండింగ్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.

WhatsApp Developing SIM Bindng Feature for Users in India as Meta Works to Comply With DoT's Directive
WhatsApp Developing SIM Bindng Feature for Users in India as Meta Works to Comply With DoT's Directive (Photo Credit- WABetaInfo)
author img

By ETV Bharat Tech Team

Published : February 25, 2026 at 5:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) ఆదేశాలను అనుసరించడంలో భాగంగా "సిమ్​ బైండింగ్" ఫీచర్​పై పనిచేస్తోంది. WABetaInfo అందించిన సమాచారం ప్రకారం, మెటా యాజమాన్యంలోని కంపెనీ, టెలికమ్యూనికేషన్స్ (టెలికాం సైబర్ సెక్యూరిటీ) రూల్స్ (2024) కింద గతేడాది జారీ చేసిన DoT ఆదేశాలను పాటించడంపై కృషి చేస్తోంది.

ఈ మార్గదర్శకాల ప్రకారం, మెసేజింగ్ అప్లికేషన్‌లు యాక్టివ్ సిమ్ కార్డ్‌ను ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే వినియోగదారులు తమ పరికరంలో అసలు సిమ్ కార్డ్ (రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన సిమ్​) లేకుండా ఈ యాప్‌లను యాక్సెస్ చేయలేరు. ఈ ఫీచర్​కు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయింది. ఇది ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, నియంత్రణ అవసరాలకు అనుగుణంగా వారి స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉందో లేదో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని యాప్ వినియోగదారులకు తెలియజేస్తుంది.

వాట్సాప్ సిమ్ బైండింగ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?: ఫీచర్ ట్రాకర్ WABetaInfo కొత్త పాపప్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. అందులో "భారతదేశంలోని నియంత్రణ అవసరాల దృష్ట్యా, మీ సిమ్ కార్డ్ మీ పరికరంలోనే ఉందో లేదో వాట్సాప్ తనిఖీ చేయాలి" అని ఉంది. ఇది Android 2.26.8.6 అప్‌డేట్ కోసం వాట్సాప్​ బీటాలో గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధిలో దశలో ఉన్నందున అందుబాటులోకి వచ్చేసరికి ఇంకాస్త సమయం పట్టవచ్చు.

నవంబర్ 2025లో జారీ చేసిన DoT ఆదేశాలను పాటించడంలో భాగంగానే మెటా ఈ ఫీచర్​పై పనిచేస్తోందని గమనించాలి. ఇది మెసేజింగ్ యాప్‌లకు సిమ్ ఆధారిత లాగిన్ ధృవీకరణను తప్పనిసరి చేస్తుంది. ఈ నియమం వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్​తో పాటు ఫోన్ నంబర్‌ను ఉపయోగించి అకౌంట్​ను క్రియేట్ చేసేందుకు అనుమతించే ఇతర మెసేజింగ్ యాప్‌లన్నింటికీ వర్తిస్తుంది. దీంతో భారతదేశంలోని వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ ఉన్నంత వరకు మాత్రమే ఈ యాప్‌లను యాక్సెస్ చేయగలరు.

ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం, వాట్సాప్‌లో సైన్ అప్ చేసేటప్పుడు ఉపయోగించిన సిమ్ కార్డ్, యూజర్ హ్యాండ్‌సెట్‌లో ఇన్​సెర్ట్ చేసిన సిమ్ కార్డ్ అని ధృవీకరించడానికి ఒక వెరిఫికేషన్​ ప్రాసెస్​ను నిర్వహించడం ద్వారా వాట్సాప్ కాలానుగుణంగా యూజర్ ఖాతా సెషన్‌ను పునరుద్ధరిస్తుంది. ఇది భారతీయ (+91) ఫోన్ నంబర్‌లతో నమోదు చేసుకున్న ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందనేది గమనించాలి.

మీ వాట్సాప్ అకౌంట్ SIM బైండింగ్ వెరిఫికేషన్ టెస్ట్​లో విఫలమైతే, ధృవీకరణ పూర్తయ్యే వరకు మీకు యాక్సెస్‌ను పరిమితం చేస్తుంది. కానీ సమస్యకు ముందు అందుకున్న మీ చాట్‌లు, మెసెజ్​లను సురక్షితంగానే ఉంచుతుంది.

DoT ఆదేశాలు?: DoT ఆదేశాల ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లు రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించే సిమ్ కార్డ్‌ ఆ డివైజ్​లో ఉంటేనే తమ సేవలను అందించాలి. దీనర్థం:

  • సిమ్ బైండింగ్: వినియోగదారులు తమ పరికరంలో అసలు సిమ్ కార్డ్ లేకుండా ఈ యాప్‌లను యాక్సెస్ చేయలేరు.
  • ఆటో-లాగౌట్: వాట్సాప్ ప్రతి ఆరు గంటలకు దాని వెబ్ ఆధారిత లేదా డెస్క్‌టాప్ క్లయింట్ నుంచి ఆటోమేటిక్​గా లాగ్ అవుట్ అయిపోవాలి. ఆ తర్వాత వినియోగదారులు QR కోడ్‌ స్కాన్ ద్వారా వారి ఖాతాలకు తిరిగి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ డెవలప్‌మెంట్ వెర్షన్‌లో అందుబాటులో లేకపోవడంతో ప్లాట్‌ఫారమ్ దీన్ని ఎప్పుడు జోడిస్తుందనేది అస్పష్టంగా ఉంది.

యాక్టివ్ సిమ్‌లు లేకుండా యాప్‌ల దుర్వినియోగాన్ని నిరోధించడం ద్వారా సైబర్ మోసాన్ని అరికట్టడంమే దీని లక్ష్యం.