ETV Bharat / technology

విన్‌ఫాస్ట్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటీ, బైక్: భారత్‌లో డిజైన్ పేటెంట్

విన్‌ఫాస్ట్ భారత మార్కెట్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిజైన్ పేటెంట్లను దాఖలు చేసింది. ఇందులో ఒక స్కూటర్, ఒక బైక్ ఉన్నాయి.

VinFast Patents Two New Electric Two-Wheelers In India Ahead Of Market Entry
VinFast Patents Two New Electric Two-Wheelers In India Ahead Of Market Entry (Photo Credit- VinFast)
author img

By ETV Bharat Tech Team

Published : July 21, 2026 at 10:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన ప్రణాళికలను మరింత విస్తరిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే తమ గ్లోబల్ లైనప్‌లోని మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లతో 2026 ద్వితీయార్థంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. తాజాగా, ఈ EV దిగ్గజం ఇప్పుడు మరో రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం భారతదేశంలో డిజైన్ పేటెంట్లను దాఖలు చేసింది. దీన్నిబట్టి చూస్తే విన్‌ఫాస్ట్ భారత్‌లో ప్రవేశపెట్టే పోర్ట్‌ఫోలియో మొదట అనుకున్నదానికంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆ రెండు కొత్త మోడళ్లు?: ఇటీవల దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఈ రెండు వాహనాలలో ఒకటి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న విన్‌ఫాస్ట్ వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్. రెండోది విన్‌ఫాస్ట్ సులాద్ కాన్సెప్ట్ స్ఫూర్తితో రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తోంది.

విన్‌ఫాస్ట్ వైపర్ పేటెంట్ ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ఇది వియత్నాంలో ప్రస్తుతం అమ్మకంలో ఉన్న ప్రొడక్షన్ మోడల్‌ను దాదాపుగా పోలి ఉంది. గతంలో దాఖలు చేసిన పేటెంట్లలో అనేక స్టైలింగ్ మార్పులు కనిపించినా, ఈ కొత్త వెర్షన్‌లో షార్ప్ బాడీవర్క్, సింగిల్ పీస్​తో కూడిన LED హెడ్‌లైట్, ఐదు స్పోక్‌ల అల్లాయ్ వీల్స్, హబ్‌పై అమర్చిన మోటార్ వంటి ఫీచర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

VinFast Viper Scooter
VinFast Viper Scooter (Photo Credit- VinFast)

వియత్నాం మార్కెట్లో అందుబాటులో ఉన్న విన్‌ఫాస్ట్ వైపర్ 4.8 kWh బ్యాటరీ ప్యాక్, 3 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై సుమారు 70-80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పుడే ఇదే స్పెసిఫికేషన్లతో ఇది భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.

రెండో ఫైలింగ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు సంబంధించినది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో విన్‌ఫాస్ట్ ఆవిష్కరించిన సులాద్ కాన్సెప్ట్‌ను పోలి ఉంది. కంపెనీ ఇంకా దీని అధికారిక స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. అయితే వియత్నాం నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ప్రొడక్షన్ వెర్షన్‌లో 50 kW వరకు శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుందని తెలుస్తోంది. దీనితో ఈ బైక్ గంటకు సుమారు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదని సమాచారం.

VinFast Viper Scooter
VinFast Viper Scooter (Photo Credit- VinFast)

భారత్‌లో విన్‌ఫాస్ట్ వ్యూహం?: ఈ తాజా పేటెంట్ దాఖలు భారత మార్కెట్ పట్ల విన్‌ఫాస్ట్ దీర్ఘకాలిక నిబద్ధతను సూచిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి కూడా విస్తరించే అవకాశాన్ని కంపెనీ పరిశీలిస్తున్నట్లు ఇది స్పష్టం చేస్తోంది.

అయితే, ఒక డిజైన్ పేటెంట్ లభించినంత మాత్రాన ఆ మోడళ్లు ఖచ్చితంగా మార్కెట్లోకి వస్తాయని చెప్పలేము. కంపెనీలు తరచుగా భవిష్యత్ ఉత్పత్తుల కోసం పేటెంట్లను దాఖలు చేస్తుంటాయి. కానీ విన్‌ఫాస్ట్ ఇప్పటికే 2026 ద్వితీయార్థంలో మూడు స్కూటర్ల లాంఛ్​ను ధృవీకరించిన నేపథ్యంలో, ఈ రెండు కొత్త ఫైలింగ్‌లు దాని ప్రణాళికలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

VinFast Viper Scooter
VinFast Viper Scooter (Photo Credit- VinFast)

విన్‌ఫాస్ట్ వైపర్ లేదా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ తమిళనాడులో తన తొలి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాతనే భారత్‌లో విన్‌ఫాస్ట్ ఉత్పత్తుల అసెంబ్లింగ్, అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి దేశీయ, విదేశీ బ్రాండ్లు ఇప్పటికే పోటీపడుతున్న భారత EV ద్విచక్ర వాహన మార్కెట్లో విన్‌ఫాస్ట్ ప్రవేశం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.