'విక్రమ్-1' ప్రయోగం గ్రాండ్ సక్సెస్: సరికొత్త రికార్డు సృష్టించిన భారత తొలి ప్రైవేట్ రాకెట్!
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ రూపొందించిన దేశపు తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' శ్రీహరికోట వేదికగా విజయవంతంగా నింగికెగిరి సరికొత్త రికార్డు సృష్టించింది.

Published : July 18, 2026 at 12:07 PM IST
Sriharikota: నింగికెగిరిన భారత తొలి ప్రైవేట్ రాకెట్. అంతరిక్షంలో కొత్త యుగానికి శ్రీకారం. దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) శనివారం ఉదయం 12.06 గంటలకు శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన "Skyroot Aerospace" దీనిని రూపొందించింది. 'మిషన్ ఆగమన్' పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి.
ఈ చారిత్రాత్మక క్షణానికి సాక్షిగా ఏపీ మంత్రి నారా లోకేశ్ శ్రీహరికోటలోని లాంఛ్ కంట్రోల్ సెంటర్‌కు హాజరయ్యారు. అలాగే లాంఛ్ వ్యూయింగ్ గ్యాలరీకి వందలాది మంది పాఠశాల విద్యార్థులు, యువత తరలివచ్చి రాకెట్ ప్రయోగాన్ని ఉత్సాహంగా తిలకించారు.
Vikram-1 Test Flight-1's journey from lift-off at the historic first launch pad in Sriharikota 🚀#Vikram1 #OpeningSpaceForAll #SkyrootAerospace pic.twitter.com/DNMOyrdLjF
— Skyroot Aerospace (@SkyrootA) July 18, 2026
సమయం మారినా.. పక్కాగా సెపరేషన్: నావిగేషన్ సమస్యల వల్ల ప్రయోగం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:05 గంటలకు వాయిదా పడింది. అయితే, ఆలస్యంగా ప్రారంభమైనా.. నింగిలోకి దూసుకెళ్లిన కొద్ది నిమిషాల్లోనే అత్యంత కీలకమైన మూడో దశ (S3) అనుకున్న టైమ్‌లైన్ ప్రకారమే విజయవంతంగా విడిపోయింది.
భూమి దృశ్యాలు ప్రత్యక్షం: ఈ ప్రయాణంలో రాకెట్‌కు అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా అంతరిక్షం నుంచి మన భూమికి సంబంధించిన అద్భుతమైన లైవ్ దృశ్యాలు కనిపించాయి. గగనతలం నుంచి నీలిరంగులో మెరుస్తున్న భూగోళం తాలూకు విజువల్స్ స్క్రీన్‌లపై ప్రత్యక్షమవ్వగానే లాంఛ్ కంట్రోల్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు, గ్యాలరీలోని విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు.
లాస్ట్ స్టేజ్ (S4) కూడా నామినల్: రాకెట్ ప్రయాణంలో అత్యంత కీలకమైన చివరి, నాలుగో దశ (S4) పనితీరు కూడా అద్భుతంగా, అనుకున్న రీతిలోనే (Nominalగా) సాగింది. 3D-ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన 'రామన్' ఇంజిన్లు పక్కాగా పనిచేసి, రాకెట్‌ను లక్ష్యం వైపు నడిపించాయి.
S4 ఇంజన్ కటాఫ్ (S4 Engine Cut-off): నాలుగో దశ (S4) ప్రయాణం ముగియగానే, ప్లాన్ ప్రకారం 'రామన్' ఇంజన్లు విజయవంతంగా ఆగిపోయాయి (కటాఫ్ అయ్యాయి) . ఇంజిన్ కటాఫ్ ప్రక్రియ పక్కాగా జరగడంతో రాకెట్ తన లక్ష్యాన్ని వంద శాతం చేరుకుంది.
శాటిలైట్లు విజయవంతంగా విడిపోయాయి (Satellites Separated): ఇంజిన్ ఆగిపోయిన వెంటనే, రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాలన్నీ (శాటిలైట్లు) ఒకదాని తర్వాత ఒకటి విజయవంతంగా విడిపోయి (సెపరేట్ అయి) అంతరిక్షంలోకి ప్రవేశించాయి. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే రోబోటిక్ హ్యాండ్ సహా అన్ని పేలోడ్స్‌ను నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
మిషన్ గ్రాండ్ సక్సెస్- అధికారిక ప్రకటన: రాకెట్ ప్రయాణం విజయవంతంగా ముగిసి, ఉపగ్రహాలన్నీ కక్ష్యలోకి చేరిన వెంటనే.. స్కైరూట్, ఇస్రో శాస్త్రవేత్తలు 'విక్రమ్-1' ప్రయోగం "గ్రాండ్ సక్సెస్" అయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ అద్భుతమైన చివరి అప్‌డేట్స్‌తో విక్రమ్-1 మిషన్ పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించి, ప్రపంచ అంతరిక్ష యవనికపై భారత ప్రైవేట్ రంగానికి సరికొత్త గుర్తింపు తెచ్చింది.
ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ- కాలర్ ట్యూన్‌గా 'వందేమాతరం': ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అని అధికారికంగా ప్రకటించిన వెంటనే, శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఈ విజయవంతమైన వివరాలను పంచుకుంది. శాస్త్రవేత్తలు ప్రధానికి కాల్ చేయగానే ఫోన్‌లో 'వందేమాతరం' మ్యూజిక్ (కాలర్ ట్యూన్) వినిపించడం అక్కడ ఉన్నవారందరిలో దేశభక్తిని, మరింత ఉత్సాహాన్ని నింపింది. ఫోన్‌లో ఇస్రో, స్కైరూట్ బృందాల మాటలు విన్న ప్రధాని.. దేశీయ సాంకేతికతతో సాధించిన ఈ అపూర్వ ఘనతపై ప్రశంసలు కురిపించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ యువతలోని సరికొత్త ఆవిష్కరణల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
ఈ చారిత్రాత్మక మిషన్ హైలైట్స్ ఇవే:
ప్రైవేట్ రంగానికి కొత్త శకం: ఇప్పటివరకు అంతరిక్ష ప్రయోగాలన్నీ ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో (ISRO) మాత్రమే చేస్తూ వచ్చేది. కానీ ఈ ప్రయోగంతో పూర్తి స్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను కక్ష్యలోకి పంపే తొలి ప్రైవేట్ స్టార్టప్‌గా "Skyroot Aerospace" సరికొత్త చరిత్ర సృష్టించింది.
స్వదేశీ టెక్నాలజీ 'మేడ్ ఇన్ ఇండియా': ఏడు అంతస్తుల ఎత్తు గల ఈ రాకెట్ ఎన్నో సాంకేతిక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. బరువు తగ్గించడం కోసం దీనిని పూర్తిగా బలమైన 'ఆల్-కార్బన్ కాంపోజిట్' నిర్మాణంతో తయారు చేశారు. నాలుగు దశలు గల ఈ రాకెట్ చివరి దశలో 3D-ప్రింటెడ్ టెక్నాలజీతో చేసిన ద్రవ ఇంధన ఇంజిన్లను ఉపయోగించారు.
స్పేస్ క్యాబ్ సర్వీస్: చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో, చాలా వేగంగా అంతరిక్షంలోకి పంపడానికి ఈ రాకెట్ ఒక 'స్పేస్ క్యాబ్' లాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది దాదాపు 350 కిలోల వరకు బరువున్న శాటిలైట్లను మోసుకెళ్లగలదు.
ప్రధాని మోదీ 'వందేమాతరం' సందేశం: ఈ రాకెట్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తన చేతితో రాసిన ఒక ప్రత్యేకమైన "వందేమాతరం" పోస్ట్‌కార్డ్‌ను అంతరిక్షంలోకి పంపించారు. దీనితో పాటు ప్రస్తుత, మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో పాటు స్కైరూట్ ఎక్స్పర్ట్స్, పెట్టుబడిదారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన వందలాది శుభాకాంక్షల కార్డులను కూడా ఈ రాకెట్ ద్వారా నింగిలోకి తీసుకెళ్లారు.
Among the payloads on Vikram-1 Test Flight-1 is something truly special—a handwritten postcard from Hon’ble Prime Minister Shri @narendramodi with the words, “Vande Mataram.” 🇮🇳🚀
— Skyroot Aerospace (@SkyrootA) July 17, 2026
It travels to space alongside handwritten messages from our team, investors, policymakers, and… pic.twitter.com/sJajN6NiVJ
అంతరిక్ష వ్యర్థాల క్లీనింగ్ సిస్టమ్: ఈ రాకెట్ Cosmoserve సంస్థకు చెందిన 'Embrace' అనే ప్రత్యేకమైన రోబోటిక్ హ్యాండ్‌ను కూడా మోసుకెళ్తోంది. ఇది అంతరిక్షంలో పనికిరాని పాత శాటిలైట్ల వ్యర్థాలను (Space Debris) తొలగించే వినూత్న సాంకేతికతను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది.

