పిల్లల కోసం ఎలక్ట్రిక్ బైక్- పెరుగుతున్న కొద్దీ హైట్ సెట్ చేసుకోవచ్చు!
భారత మార్కెట్లో "Vida DIRT.E K3" లాంఛ్- ధర ఎంతంటే?

Published : December 13, 2025 at 2:39 PM IST
Hyderabad: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో విడా 4 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల యువ రైడర్ల కోసం కొత్త మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. దీని పేరు "Vida DIRT.E K3". పెద్ద, శక్తివంతమైన వాహనాల వినియోగానికి ముందుగా పిల్లలకు సురక్షితమైన, నైపుణ్యాలను పెంపొందించే, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ఒక ప్రారంభ వేదికను అందించడమే దీని లక్ష్యం.
దీని ప్రత్యేకతలు: ఈ డర్ట్ బైక్‌కు సర్దుబాటు చేయగల ఫ్రేమ్ ఉంది. ఇది స్మాల్, మీడియం, లార్జ్ అనే మూడు హైట్ ఆప్షన్లను అందిస్తుంది. అలెన్ కీతో మీరే దీన్ని మీ పిల్లల ఎత్తుకు సరిపోయేటట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 16-అంగుళాల స్పోక్డ్ వీల్స్, సింగిల్ రియర్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ముందు, వెనుక సస్పెన్షన్ అవసరమయ్యే నైపుణ్య స్థాయికి రైడర్ చేరుకున్నప్పుడు వాటిని ఆప్షనల్ యాక్సెసరీలుగా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

బ్యాటరీ వివరాలు: ఈ మోటార్‌సైకిల్ 500W మోటారుతో వస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 23-25 కిలోమీటర్లు. ఈ రిమూవబుల్ బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు మూడు గంటలు పడుతుంది. రైడర్ నడిపే నేల, రైడింగ్ శైలిని బట్టి ఇది మూడు గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
రైడింగ్ మోడ్స్: ఇందులో బిగినర్స్, అమెచ్యూర్, ప్రో అనే మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. వీటి స్పీడ్ లిమిట్ వరుసగా 8 km/h, 16 km/h, 25 km/h వరకు ఉంటుంది. తల్లిదండ్రులు ప్రత్యేక యాప్ ద్వారా ఈ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఇది వేగ పరిమితులను సెట్ చేయడానికి, కొన్ని మోడ్‌లను లాక్ చేయడానికి, పిల్లల రైడింగ్ సెషన్‌లను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ మోటార్‌సైకిల్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంది కాబట్టి, కంపెనీ దీనిలో అనేక భద్రత-కేంద్రీకృత అంశాలను కూడా చేర్చింది. వీటిలో బలమైన వైరింగ్, చిన్న చేతులకు సరిపడా బ్రేక్ లివర్‌లు, కీలక ఇంపాక్ట్ పాయింట్ల వద్ద శక్తిని గ్రహించే మెటీరియల్స్, రైడర్ పడిపోతే మోటారును ఆపివేసే ఎమెర్జెన్సీ కటాఫ్ టెథర్ ఉన్నాయి.
ధర వివరాలు: మార్కెట్లో ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 69,990 నుంచి ప్రారంభమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని మన ఆంధ్రప్రదేశ్‌లోని విడా తిరుపతి ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. అయితే దీని ప్రారంభ డెలివరీలు దిల్లీ, బెంగళూరు, పుణే, జైపూర్, కాలికట్‌లో ప్రారంభమవుతాయి.

