జనవరిలో కొత్త కార్ల జాతర- లిస్ట్‌లో ఏ మోడళ్లు ఉన్నాయో తెలుసా?
జనవరిలో కొత్త కారు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా?- కొనే ఆలోచన ఉంటే ఈ జాబితాపై ఓ లుక్కేయండి!

Published : January 7, 2026 at 8:00 AM IST
Hyderabad: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశీయ కార్ల తయారీ సంస్థ మహింద్రా & మహిద్రా తన "XUV 7XO" వాహనాన్ని జనవరి 5, 2026న విడుదల చేసింది. దీంతోపాటు మరికొన్ని జనవరి 2026 కార్ మార్కెట్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి.
టాటా మోటార్స్ ఒక నెల వ్యవధిలో EVతో సహా నాలుగు మోడళ్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇది 2026లో భారత మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి కంపెనీ ఇప్పటికే తన ప్రయత్నాలను ప్రారంభించిందని సూచిస్తోంది. దీనితో పాటు, దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అదనంగా నిస్సాన్, రెనాల్ట్ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత, రెనాల్ట్ తన ప్రసిద్ధ మోడల్ డస్టర్‌ను ఫేస్‌లిఫ్ట్‌తో తిరిగి విడుదల చేస్తోంది. మరెందుకు ఆలస్యం జనవరి 2026లో విడుదల కానున్న వివిధ కంపెనీల కార్లు, వాటి ఫీచర్లను పరిశీలిద్దాం రండి.
1. టాటా హారియర్, సఫారీ పెట్రోల్ ఎడిషన్:
లాంఛ్: జనవరి మొదటి వారం
ఇటీవలే "టాటా సియారా"లో ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ కొత్త 1.5-లీటర్ 'హైపెరియన్' టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఇప్పుడు టాటా "హారియర్", "సఫారీ"లలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కంపెనీ టాటా "హారియర్", "సఫారీ" పెట్రోల్ వేరియంట్‌లను డిసెంబర్ 2025లో భారతదేశంలో అధికారికంగా ఆవిష్కరించింది. అయితే దీని సాంకేతిక వివరాలు, కొత్త ఫీచర్లను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో దీని తుది అధికారిక ధర ప్రకటన కూడా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు.
Iconic SUVs. Standout tech. Rave reviews.
— Tata Motors Cars (@TataMotors_Cars) January 3, 2026
Nationwide experts share thoughts on HyperTech features of the new Harrier and Safari Petrol.
Visit the links below to know more.
Harrier: https://t.co/TX1VFWXkbp
Safari: https://t.co/5ryjEawWJv pic.twitter.com/zhWdPaU0HN
ఈ కొత్త ఇంజిన్‌తో రెండు వాహనాలలోని 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అవుట్‌పుట్ 170 hp పవర్, 280 Nm టార్క్‌కు పెరుగుతుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయవచ్చు. వీటిలో కొత్త టాటా "హారియర్" పెట్రోల్ వేరియంట్ ధర రూ.13.00 లక్షల నుంచి రూ.24.50 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. అదే సమయంలో టాటా "సఫారీ" పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.00 లక్షల నుంచి రూ.25.50 లక్షల మధ్య ఉండొచ్చు. ఈ SUVల టాప్-స్పెక్ పెట్రోల్ వేరియంట్ 14.5-అంగుళాల QLED టచ్‌స్క్రీన్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాల కోసం 'వాషర్' ఫంక్షన్, డిజిటల్ IRVM, 10-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్‌తో వస్తుంది.
2. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
లాంఛ్: జనవరి 13
టాటా మోటార్స్ టాటా పంచ్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 13న దీనిని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టీజర్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఓ టీజర్లో కంపెనీ దీనిలో కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపికను అందించనున్నట్లు వెల్లడించింది. ఇంకా దీని ఇంటీరియర్, ఎక్స్టీరియర్లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
That Khalbali you hear?
— Tata Motors Cars (@TataMotors_Cars) January 3, 2026
It’s us, back to change the SUV game once again.#TataMotors #TataMotorsPassengerVehicles #TataPunch #NewPunch #CommandWithPunch pic.twitter.com/5mpuOZLmUv
దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ అప్‌కమింగ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు పంచ్ EV నుంచి కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ చేర్చి మరింత ఆధునిక రూపాన్ని ఇస్తున్నట్లు సమాచారం. 2026 టాటా పంచ్ ఇప్పటికే ఉన్న 1.2-లీటర్ మూడు-సిలిండర్ ఇంజిన్‌ను కూడా కొనసాగిస్తుంది. ఇది దాదాపు 88 hp పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.
3. నిస్సాన్ గ్రావైట్
లాంఛ్: జనవరి మధ్యకాలం
జపనీస్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కూడా భారతదేశంలో తన మొదటి MPVని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్‌ను డిసెంబర్ 2025లో ఆవిష్కరించారు. ఇప్పుడు అంటే జనవరి 2026లో ఇది భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ కొత్త "నిస్సాన్ గ్రావైట్" కూడా "రెనాల్ట్ ట్రైబర్" ఉపయోగించే CMF-A+ ప్లాట్‌ఫామ్‌పై ఆధారితం.

ఇంకా దీనిలో "రెనాల్ట్ ట్రైబర్"లో ఉపయోగించిన అదే 1.0-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఈ ఇంజిన్ 72 hp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉంటాయని భావిస్తున్నారు. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
4. కొత్త తరం రెనాల్ట్ డస్టర్
లాంఛ్: జనవరి 26
మునుపటి తరం "రెనాల్ట్ డస్టర్"ను భారతదేశంలో 2022లో నిలిపివేశారు. దీనికి కారణం మార్కెట్లో దీని ప్రత్యర్థులకు ఇది గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇది పాత ఫీచర్లను కలిగి ఉంది. దీంతో పెద్దగా అమ్ముడుపోలేదు. కానీ ఈ ఐకానిక్ SUV జనవరి 26, 2026న గణతంత్ర దినోత్సవం నాడు మూడవ తరం మోడల్‌గా తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది.
for India, adventure began with one car. now, it begins again, with new #Renault #Duster
— Renault India (@RenaultIndia) December 25, 2025
the icon is back. #ComingSoon. 26/01/26. pic.twitter.com/cLp7ZXF347
ఈ కొత్త తరం రెనాల్ట్ డస్టర్ కొత్త డిజైన్, ఆధునిక సాంకేతికత, మరింత శక్తివంతమైన ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది. దీని టాప్ వేరియంట్ 1.0-లీటర్ మూడు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ను "రెనాల్ట్ కిగర్" నుంచి తీసుకుంటున్నారు.
ఈ ఇంజిన్ 100 hp పవర్, 160 Nm టార్క్‌ను అందిస్తుంది. అయితే కొత్త డస్టర్‌కు మరింత పవర్ ఇవ్వడానికి ఈ ఇంజిన్‌ను ట్యూన్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. అదనంగా ఇండియా-స్పెక్ మోడల్ దాని గ్లోబల్ కౌంటర్ కంటే భిన్నంగా కనిపించే అవకాశం ఉంది.
5. మారుతి సుజుకి ఇ-విటారా
లాంఛ్: జనవరి చివరిలో
ఇది మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఎంతగానో ఎదురుచూసిన ఈ మోడల్‌ను డిసెంబర్ 2025లో ఆవిష్కరించారు. అయితే ఇది జనవరి 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ. 18 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇ-విటారా టూ-వీల్ డ్రైవ్ (2WD), ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వేరియంట్లతో సహా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లలో విడుదల కానుంది. అవి: 49kWh, 61kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్‌లు. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా దీని బ్యాటరీని 50 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయవచ్చని పేర్కొంది.


