'తొలి డార్క్ స్కై' విలేజ్‌గా ఉధమల్- 'స్టార్స్' చూసేందుకు డెస్టినేషన్- 22ఏళ్ల యువకుడి ఆలోచనకు ఫలితం!
రాత్రి వేళ ఆకాశ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు- డార్క్ స్కై ఇంటర్నేషనల్ ధ్రువీకరణ దిశగా అడుగులు- ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు- ఖగోళ పర్యాటకంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

Published : September 1, 2026 at 1:14 PM IST
|Updated : September 1, 2026 at 2:37 PM IST
First Dark Sky Village : రాత్రి వేళ ఆకాశంలో నక్షత్రాలను స్పష్టంగా చూడాలంటే ప్రస్తుతం ఎవరైనా నగరాలకు దూరంగా వెళ్లాల్సిందే. విద్యుత్ దీపాలు, భారీ భవనాలు, వాహనాల లైట్ల కారణంగా పట్టణ ప్రాంతాల్లో రాత్రి ఆకాశం అందాలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో నక్షత్ర వీక్షణకు అనువైన ప్రాంతంగా మారేందుకు మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామం శరవేగంగా అడుగులు వేస్తోంది. నాసిక్ జిల్లా సుర్గాణా తాలూకాలోని గిరిజన ప్రాబల్యం ఉన్న ఉధమల్ గ్రామం డార్క్ స్కై కమ్యూనిటీగా గుర్తింపు పొందే దిశగా ముందుకెళ్తోంది.
రాత్రి వేళ ఆకాశాన్ని కాంతి కాలుష్యం నుంచి రక్షించే ప్రాంతాలను డార్క్ స్కై కమ్యూనిటీలుగా గుర్తిస్తారు. అమెరికాకు చెందిన సంస్థ డార్క్ స్కై ఇంటర్నేషనల్ ఆ గుర్తింపును అందిస్తుంది. సహజ వాతావరణాన్ని పరిరక్షించడంతోపాటు కాంతి కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తోంది. ఉధమల్ను కూడా గుర్తింపు పొందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తయితే మహారాష్ట్రలోని డార్క్ స్కై కమ్యూనిటీగా గుర్తింపు పొందిన తొలి గ్రామంగా ఉధమల్ నిలిచే అవకాశం ఉంది.
22 ఏళ్ల యువకుడి ప్రయత్నం
ఉధమల్ గ్రామాన్ని డార్క్ స్కై ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన వెనుక 22 ఏళ్ల స్థానిక విద్యార్థి విపుల్ ఖిరాడే ఉన్నారు. చిన్నప్పటి నుంచే రాత్రి వేళ ఆకాశాన్ని, నక్షత్రాలను పరిశీలించడంపై ఆసక్తి పెంచుకున్న ఆయన, గ్రామంలోని సహజమైన చీకటి ఆకాశం ప్రత్యేకతను గుర్తించారు. ఆ ప్రాంతాన్ని ఖగోళ పర్యాటకానికి అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దితే గ్రామానికి గుర్తింపు రావడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని భావించారు. తన ఆలోచనలను గ్రామస్థులకు వివరించేందుకు విపుల్ ఇంటింటికీ వెళ్లారు. తొలుత కొందరు గ్రామస్థులు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన పట్టుదలతో అవగాహన కల్పించడంతో క్రమంగా మద్దతు పెరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కూడా అండగా నిలిచింది.
రూ.42.14 లక్షల నిధులు మంజారు
ఉధమల్ డార్క్ స్క్రై ప్రాజెక్ట్‌కు జిల్లా కలెక్టర్, జిల్లా ప్రణాళికా కమిటీ సభ్య కార్యదర్శి ఆయుష్ ప్రసాద్ పరిపాలనా అనుమతులు ఇచ్చారు. జిల్లా వార్షిక ఆదివాసీ ఉప ప్రణాళిక 2026-27లో భాగంగా రూ.42.14 లక్షల నిధులను మంజూరు చేశారు. ఆ నిధులతో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాత్రి ఆకాశ నాణ్యతను అంచనా వేయడం, కాంతి కాలుష్యాన్ని తగ్గించే విధంగా లైటింగ్ వ్యవస్థలను మార్చడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, స్థానిక యువతకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బయట ఏర్పాటు చేసే లైట్లు ఆకాశం వైపు కాకుండా నేలవైపు వెలుతురు పడేలా చర్యలు తీసుకోనున్నారు.
గ్రామసభ తీర్మానం
డార్క్ స్కై పరిరక్షణ కోసం ఉధమల్ గ్రామసభ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. పేసా చట్టం కింద రాత్రి ఆకాశాన్ని కాపాడేందుకు తీర్మానం చేసింది. పర్యావరణహితమైన, బాధ్యతాయుతమైన బహిరంగ లైటింగ్ విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. అవసరమైన ప్రకాశం, ఎక్కువ తీవ్రత కలిగిన లైట్లు, ఆకాశం వైపు వెలుతురు ప్రసరించే దీపాలను నియంత్రించడం ద్వారా కాంతి కాలుష్యాన్ని తగ్గించనున్నారు. దీని వల్ల నక్షత్రాలను స్పష్టంగా వీక్షించే అవకాశం పెరగడంతోపాటు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.
విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి
ఉధమల్‌లో సహజంగా ఆకాశం చీకటిగా, స్పష్టంగా ఉండడంతో విద్యార్థులకు ఖగోళ శాస్త్రం నేర్చుకునేందుకు ఇది అనువైన ప్రాంతంగా మారనుంది. గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశంతోపాటు ఇతర ఖగోళ వస్తువులు, సంఘటనలను టెలిస్కోప్‌ల ద్వారా పరిశీలించే అవకాశం ఉండనుంది. పాఠశాలల్లో ఖగోళ శాస్త్ర క్లబ్బులు ఏర్పాటు చేయడం, వర్క్‌షాప్‌లు నిర్వహించడం, నిపుణులతో అవగాహం కార్యక్రమాలు చేపట్టడం వంటి చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంది. దీని వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, అంతరిక్ష పరిశోధనపై ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆస్ట్రో టూరిజంతో ఉపాధి అవకాశాలు
డార్క్ స్కై ప్రాజెక్టు కేవలం ఖగోళ పరిశోధన, విద్యకే పరిమితం కాదు. దీని ద్వారా ఉధమల్‌లో ఆస్ట్రో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నగరాలు, ఇతర ప్రాంతాల నుంచి నక్షత్రాలను, పాలపుంతను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులను ఆకర్షించనున్నారు. స్థానిక యువతకు ఖగోళ పర్యాటక గైడ్‌లుగా శిక్షణ ఇవ్వడం, పర్యాటకులకు నక్షత్రాల గురించి వివరించడం, స్థానికంగా పర్యాటక సేవలను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. తద్వారా గ్రామ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది.
11 ప్రాంతాల్లో ఉధమల్
మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ డార్క్ స్కై గుర్తింపునకు అనువైన 11 ప్రాంతాలను గుర్తించింది. వీటిలో కాస్ పీఠభూమి, లోనార్ సరస్సు, తోరణ్‌మాల్ వంటి ప్రాంతాలతో పాటు ఉధమల్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న స్టేట్ డార్క్ స్కై పాలసీకి ఆ కార్యక్రమం అనుగుణంగా ఉందని అధికారులు తెలిపారు. 'రాత్రి ఆకాశ పరిరక్షణలో నాసిక్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా ఆ కార్యక్రమం దోహదపడుతుంది. ఉధమల్ విజయం ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది' అని నాసిక్ జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ పేర్కొన్నారు.
జీవవైవిధ్యానికి కూడా మేలు
కాంతి కాలుష్యం తగ్గించడం వల్ల మనుషులకే కాకుండా పర్యావరణానికి ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళ సహజ చీకటి ఉండటం వల్ల జంతువులు, పక్షుల సహజ జీవన విధానానికి అంతరాయం తగ్గుతుంది. వలస పక్షుల కదలికలపై కృత్రిమ వెలుతురు ప్రభావం తగ్గుతుంది. అనవసరమైన లైటింగ్ తగ్గడంతో విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. ఇలా శాస్త్ర విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ, ఖగోళ పర్యాటకం, స్థానిక ఉపాధి అన్నింటినీ కలిపే ప్రాజెక్టుగా ఉధమల్ డార్క్ స్కై కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది. గుర్తింపు ప్రక్రియ విజయవంతమైతే మహారాష్ట్రలో ఖగోళ పర్యాటకానికి ఉధమల్ కొత్త గమ్యస్థానంగా మారనుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరాతో ఖగోళ అద్భుతం: ఒకే చిత్రంలో 5 లక్షల గెలాక్సీలు, 50 వేల నక్షత్రాలు!
నక్షత్రాలు, చల్లని గాలులను ఆస్వాదిస్తూ సినిమా చూడాలనుందా? - అయితే ఈ థియేటర్ ప్రదర్శనలు మీ కోసమే!

